Begin typing your search above and press return to search.

పోలవరం పై చర్చ ... బాబుకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సీఎం జగన్

By:  Tupaki Desk   |   2 Dec 2020 1:00 PM GMT
పోలవరం పై చర్చ ... బాబుకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సీఎం జగన్
X
ఆంధ్రప్రదేశ్ మూడవ రోజు అసెంబ్లీ సమావేశాల్లో కూడా వాడివేడిగా చర్చ జరిగింది. మూడో రోజు శాసనసభలో పోలవరం ప్రాజెక్టుపై చర్చ జరుగుతున్న సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతుండగా .. టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డుపడుతున్నారని అధికారపక్ష ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడియం వద్ద టీడీపీ శాసనసభ్యులు ఆందోళన చేపడుతున్నారంటూ శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి .. సభకు ఆటంకం కలిగిస్తున్న 9 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 9 మంది ఎమ్మెల్యేలను ఒక్క రోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. సస్పెన్షన్ కు గురైన వారిలో అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, డోల బాలవీరాంజనేయ స్వామి, బెందాళం అశోక్, వెలగపూడి రామకృష్ణబాబు, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్ ఉన్నారు.

ఇక సీఎం జగన్ మోహన్ రెడ్డి పోలవరం పై మాట్లాడుతూ ... పోలవరం ఏపీకి ఓ వరం అని అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న(1995-2004) సమయంలో పోలవరం గురించి కనీసం ఆలోచన కూడా చేయలేదని , పైనున్న రాష్ట్రాలు ప్రాజెక్టుల ఎత్తును పెంచుతున్నా చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శించారు. 2004లో దివంగత నేత వైఎస్సార్‌ సీఎం అయిన తర్వాతే పోలవరం కుడి ప్రధాన కాల్వకు 10,327 ఎకరాలకు భూసేకరణ చేశారని , వైఎస్సార్‌ హయాంలో 86 శాతం కుటి ప్రధాన కాల్వ పనులు జరిగితే, చంద్రబాబు హయాంలో కేవలం 14శాతం పనులు మాత్రమే జరిగాయని సభలో వెల్లడించారు.

ఎడమ ప్రధాన కాల్వకు కేవలం 0.89 శాతం భూసేకరణ జరిగిందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అనుమతులన్నీ వైఎస్సార్‌ హయాంలోనే వచ్చాయని తెలిపారు. వైఎస్సార్‌ హయాంలో కుడి కాల్వ పూర్తికాకపోతే పట్టిసీమ ప్రాజెక్టు ఎలా వచ్చిందని సీఎం జగన్‌ ప్రశ్నించారు. చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో కేవలం 20 శాతం పనులు మాత్రమే జరిగాయాన్నారు. పోలవరాన్ని చంద్రబాబు ఏటిఎంలా మార్చుకున్నారని స్వయంగా ప్రధానమంత్రినే అన్నారని సభలో గుర్తు చేశారు. అలాగే , పోలవరంలో రివర్స్‌ టెండరింగ్ చేస్తే రూ.1343 కోట్లు ప్రభుత్వానికి ఆదా అయ్యిందని సభలో సీఎం జగన్‌ వెల్లడించారు.