Begin typing your search above and press return to search.

శుభ‌వార్త : ఉత్త‌రాంధ్ర‌కు సీఎం 4 వ‌రాలు ?

By:  Tupaki Desk   |   31 March 2022 2:30 AM GMT
శుభ‌వార్త : ఉత్త‌రాంధ్ర‌కు సీఎం 4 వ‌రాలు ?
X
అనుకున్న‌విధంగా అనుకున్న స‌మ‌యానికే కొత్త జిల్లాలు ఏర్పాటు ప్ర‌క్రియ షురూ కానుంది. జిల్లాల ఏర్పాటుపై ప‌ద‌కొండు వేల‌కుపైగా అభ్యంత‌రాలు వ‌చ్చినా అవేవీ సీఎం ప‌రిగ‌ణించ లేదు కానీ కొత్త రెవెన్యూ డివిజ‌న్ల‌కు మాత్రం సుముఖంగానే తాను ఉన్నాన‌ని ప్ర‌క‌టించారు. ఆవిధంగా మంత్రుల ప‌రువు కాస్త కాపాడారు. తాజా నిర్ణ‌యంలో భాగంగా జిల్లాల ఏర్పాటు పెద్ద‌గా ప్ర‌యోజ‌నం లేక‌పోయినా రెవెన్యూ డివిజ‌న్ల ఏర్పాటు కాస్త ఊర‌ట. ఇక కొత్త కార్యాల‌యాల ఏర్పాటు సిబ్బంది బ‌దిలీ అన్న‌వి కూడా స‌ర్దుబాటు చేసుకోవాల‌ని సీఎం అంటున్నారు.

కొత్త‌గా కార్య‌క‌లాపాలు ప్రారంభించేందుకు జిల్లాకు రెండు కోట్ల రూపాయ‌లు కేటాయించారని తెలుస్తోంది. కానీ తాత్కాలిక భ‌వ‌నాల్లో కార్యాల‌యాలు ఏర్పాటైనా కూడా ఈ మొత్తం నిధులు ఏ పాటికీ చాల‌వ‌ని కొన్ని చోట్ల కార్యాల‌యాలు పూర్తి స్థాయిలో మ‌ర‌మ్మ‌తులు చేయాల్సి ఉంద‌ని అధికారులు గ‌గ్గోలు పెడుతున్నారు. అదేవిధంగా సిబ్బంది బ‌దిలీల విష‌య‌మై కూడా కొంత అయోమ‌యంగానే ఉంది. రాష్ట్ర‌ప‌తి ఉత్త‌ర్వులు రానందున ప్ర‌స్తుతానికి ఇవి తాత్కాలిక బ‌దిలీలేనని అంటున్నాయి ప్ర‌భుత్వ వర్గాలు.

ఉత్త‌రాంధ్ర‌కు సీఎం 3 వ‌రాలు ప్ర‌క‌టించారు. ముఖ్యంగా శ్రీ‌కాకుళం జిల్లాకు సంబంధించి ప‌లాస రెవెన్యూ డివిజన్ ను ఎనౌన్స్ చేశారు. ఎప్ప‌టి నుంచో ఉన్న ప్ర‌తిపాద‌నే ఇది. మంత్రి సీదిరి అప్ప‌ల్రాజు చొర‌వ ఫ‌లితంగా ప‌లాస కు రెవెన్యూ డివిజ‌న్ ఏర్పాటు సాధ్య‌మైంది.

అదేవిధంగా బొబ్బిలి, చీపురుప‌ల్లి మండ‌ల కేంద్రాల‌ను కూడా రెవెన్యూ డివిజ‌న్ లుగా ఎనౌన్స్ చేశారు. చీపురు ప‌ల్లి నియోజక‌వర్గం బొత్స స‌త్యనారాయ‌ణ‌ది కాగా, బొబ్బిలి నియోజ‌క‌వ‌ర్గం శంభంగి వెంక‌ట చిన అప్పల‌నాయుడుది. ఈ రెండు ప్రాంతాల‌ను కొత్త రెవెన్యూ డివిజ‌న్లుగా ఎనౌన్స్ చేశారు.వీటితో పాటు భీమిలి (విశాఖ జిల్లా) ని కూడా రెవెన్యూ డివిజ‌న్ గా ప్ర‌కటించారు.

ఇక కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి వ‌చ్చిన ఏ అభ్యంత‌రాన్నీ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేదు. ఒక్క తిరుప‌తి కేంద్రంగా ఏర్పాట‌య్యే జిల్లాకు బాలాజీ అన్న పేరు మార్చ‌డం ఏమీ చేయ‌లేదు. బాలాజీ స్థానంలో తిరుప‌తి అన్న పేరునే ప్ర‌జాభీష్టంలో భాగంగా మార్చి నోటిఫికేష‌న్ ఇచ్చారు.
ఏప్రిల్ నాలుగు న ఉద‌యం తొమ్మిది గంట‌ల ఐదు నిమిషాల నుంచి తొమ్మిది గంట‌ల 45 నిమిషాల మ‌ధ్య ఉన్న స‌మాయాన్ని సుముహూర్తంగా నిర్ణ‌యించారు. ఈ స‌మ‌యంలో కొత్త జిల్లాల ఏర్పాటు చేసుకోవ‌చ్చు. అదేవిధంగా స‌మీకృత క‌లెక్ట‌రేట్ల నిర్మాణానికి జిల్లాకు 15 ఎక‌రాల స్థలాన్ని సేక‌రించాల‌ని కూడా క‌లెక్ట‌ర్ల‌కు సీఎం సూచించారు.