Begin typing your search above and press return to search.

ఎవర్ని అడిగి కలాం పేరు మార్చారు ... సీరియస్ అయిన సీఎం జగన్ !

By:  Tupaki Desk   |   5 Nov 2019 6:31 AM GMT
ఎవర్ని అడిగి కలాం పేరు మార్చారు ... సీరియస్ అయిన సీఎం జగన్ !
X
రాష్ట్రంలోని 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు అందించే ప్రతిభ అవార్డు పేరును మార్చారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరు మీద ఇచ్చే ఈ అవార్డును వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరుగా మార్చారు. ప్రతి ఏటా అబ్దుల్ కలాం పుట్టినరోజు నాడు ప్రతిభ అవార్డులు కింద విద్యార్థులకు ఇచ్చే ఈ అవార్డు పేరును. .Dr. A. P. J Abdul Kalam Pratibha Puraskar ను.. YSR Vidya Puraskar గా మార్చేశారు.

అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై పలువురు విమర్శలు చేసారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పేరు మార్చి వైఎస్ఆర్ పేరు పెట్టడం అంటే కలాంను అవమానించడమే అనే విమర్శలు వచ్చాయి. అలాగే వైఎస్ గొప్ప వ్యక్తి కావొచ్చని, కానీ విద్యావ్యవస్థలో రాజకీయాలకి అతీతంగా యువతకి కలాం స్ఫూర్తిదాయకమని పలువురు తమ అభిప్రాయాలని వ్యక్తం చేసారు. దీనితో ఈ విషయం పై సీఎం జగన్ అధికారులపై అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

తన దృష్టికి రాకుండా పేరు మార్చడంపైన సీఎం వైఎస్‌ జగన్‌ తీవ్రంగా స్పందించారు. వెంటనే ప్రతిభా పురస్కారాల పేరు మారుస్తూ ఇచ్చిన జీవోను రద్దు చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ప్రతిభా పురస్కారాలకు యథాతథంగా అబ్దుల్‌కలాం పేరునే పెట్టాలని సూచించారు. అలాగే ప్రభుత్వం అందజేసే అవార్డులకు దేశంలోని మహానీయులు పేర్లు కూడా పెట్టాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. మహాత్మ గాంధీ, జ్యోతిరావ్‌ పూలే, అంబేడ్కర్‌, జగ్జీవన్‌రామ్‌ వంటి మహానీయుల పేర్లతో అవార్డులు ఇవ్వాలని చెప్పారు.