Begin typing your search above and press return to search.

రూపాయికే ఇల్లు , ఫ్రీ రిజిస్ట్రేషన్ ... ఎక్కడంటే !

By:  Tupaki Desk   |   19 Nov 2020 12:10 PM GMT
రూపాయికే ఇల్లు , ఫ్రీ రిజిస్ట్రేషన్ ... ఎక్కడంటే !
X
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే పలు అద్భుతమైన పథకాలతో , రాష్ట్ర ప్రజల మన్ననలు పొందుతూ , పాలన సాగిస్తున్న ఈ సమయంలో మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఒకే ఒక్క రూపాయి చెల్లింపుతో ఏపీ టిడ్కో ఇంటిని అర్హులకు అప్పగిస్తామని సీఎం ‌ జగన్‌ స్పష్టం చేశారు. పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ ఏర్పాట్లు, ఇళ్ల నిర్మాణాలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో స్పందన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ లో మాట్లాడారు. టిడ్కో ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2,62,200 ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు.

ఇందులో ఇప్పటికే 300 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఇళ్లు 1,43,600 నిర్మాణంలో ఉన్నాయని, 365 చదరపు అడుగుల్లో 44,300 ఇళ్లు, 430 చదరపు అడుగుల్లో 74,300 ఇళ్ల నిర్మాణం జరుగుతోందని చెప్పారు. టిడ్కోకు సంబంధించి గత ప్రభుత్వం రూ.3,200 కోట్లు బకాయి పెట్టి పోయిందన్నారు. ఒక వైపు ఆ బకాయిలు తీరుస్తూనే, మన ప్రభుత్వం వచ్చాక ప్రజల కోసం ఇప్పటికే రూ.1,200 కోట్లు ఇచ్చామని, ఈ వారంలో మరో రూ.400 కోట్లు, 15 రోజుల్లో ఇంకో రూ.600 కోట్లు ఇస్తామని వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబర్ 25న 300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు కేవలం ఒక్క రూపాయితో అగ్రిమెంట్‌ ఆఫ్‌ సేల్‌ చేస్తామని ప్రకటించారు. అలాగే హైకోర్టు స్టే ఉన్నచోట్ల మినహా మిగిలిన ప్రాంతాల్లో డిసెంబరు 25న డి-ఫామ్ పట్టాలతో ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.

గ్రామ వలంటీర్లు వచ్చే సోమవారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు టిడ్కో లబ్ధిదారుల్లో 300 చదరపు అడుగుల ఇల్లు పొందుతున్న వారి దగ్గరకు ప్రభుత్వ లెటర్‌ తీసుకుని పోతారని సీఎం జగన్ చెప్పారు. మీకు బాబు ముద్దా, జగన్‌ ముద్దా, అని అడుగుతారని, మీకు బాబు స్కీమ్‌ కావాలా, జగన్‌ స్కీమ్‌ కావాలా, అని కూడా అడుగుతారని తెలిపారు. అందులో బాబు స్కీమ్‌లో ఏముంటుంది, జగన్‌ స్కీమ్‌ లో ఏముంటుంది అన్నది స్పష్టంగా రాస్తామని జగన్ తెలిపారు. చంద్రబాబు స్కీమ్‌ .. లబ్ధిదారుడు రూ. 3 లక్షల అప్పును నెలకు రూ. 3 వేల చొప్పున 20 ఏళ్ల పాటు వడ్డీతో సహా మొత్తం రూ. 7 లక్షలు కట్టాలి. ఆ తర్వాతే ఇంటిపై హక్కులు వారి చేతికి వస్తాయి. అప్పుడే ఆ ఇంటి పట్టా వారికందుతుంది.జగన్‌ స్కీమ్‌ ... కేవలం ఒక్క రూపాయితో వెంటనే అగ్రిమెంట్‌ ఆఫ్‌ సేల్‌, ఏ అప్పు లేకుండా ఇప్పుడే సర్వ హక్కులతో ఇల్లు. తర్వాత పక్కాగా ఫ్రీ రిజిస్ట్రేషన్‌. ఈ వివరాలు చెప్పి, వారికి ఏ స్కీమ్‌ కావాలన్నది తెలుసుకోండి.’’ అని సీఎం జగన్ వివరించారు.