Begin typing your search above and press return to search.

ఖ‌ర్చులో బాబుకు ఆ సీఎం తీసిపోడ‌ట‌!

By:  Tupaki Desk   |   11 May 2019 10:20 AM GMT
ఖ‌ర్చులో బాబుకు ఆ సీఎం తీసిపోడ‌ట‌!
X
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మంచి ప‌రిపాల‌నా ద‌క్ష‌కుడిగా పేరుంది. తొమ్మిదిన్న‌రేళ్ల పాటు ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన స‌మ‌యంలో.. ఆయ‌న్ను ఏపీ సీఈవోగా అభివ‌ర్ణించేవారు. అదే రీతిలో ప్ర‌భుత్వ పాల‌న‌ను ఒక గాడిన ప‌డేలా చేయ‌టంలో ఆయ‌న అంతో ఇంతో స‌క్సెస్ అయిన‌ట్లుగా చెబుతారు. తాజా ఐదేళ్ల పాల‌న‌లో ఫెయిల్యూర్ పాల‌న‌లో త‌న‌కున్న మంచి ఆడ్మినిస్ట్రేట‌ర్ అన్న పేరును చెడ‌గొట్టుకున్నారు చంద్ర‌బాబు.

ఓప‌క్క పాల‌నా వైఫ‌ల్యం.. మ‌రోవైపు ఆయ‌న పెట్టే ఖ‌ర్చు కార‌ణంగా ఏపీ ఆర్థిక ప‌రిస్థితి దారుణంగా మారింద‌న్న విమ‌ర్శ బ‌లంగా వినిపిస్తోంది. తాజాగా ఏపీకి పొరుగున ఉన్న క‌ర్ణాట‌క రాష్ట్ర ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి ఖ‌ర్చు లెక్క బ‌య‌ట‌కు వ‌చ్చిన ప్ర‌తిసారీ చంద్ర‌బాబు గుర్తుకు వ‌చ్చేలా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఓవైపు క‌ర్ణాట‌క‌లో భీక‌ర క‌రువు నెల‌కొని ఉన్న వేళ‌.. తాగునీటి కోసం క‌న్న‌డిగులు కిందామీదా ప‌డుతున్న వేళ‌.. అవేమీ ప‌ట్ట‌ని రీతిలో ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి మాత్రం స‌ర‌దాగా గ‌డిపేందుకు రిసార్ట్ కు త‌ర‌లివెళ్లిన వైనాన్ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి. మండే ఎండ‌ల్లో పాల‌న చేస్తున్న కుమార‌స్వామి అలిసిపోయారో ఏమో కానీ.. తాజాగా ఆయ‌న మిడికేరికి కొంచెం దూరంలో ఉన్న రాయ‌ల్ రిసార్ట్ లో రెండు రోజులు రెస్ట్ తీసుకోవ‌టానికి డిసైడ్ అయ్యారు.

ఈ విశ్రాంతి కోసం ఆయ‌న పెడుతున్న ఖ‌ర్చు లెక్క విని షాక్ తింటున్నారు. ఈ రిసార్ట్ లో రోజుకు రూమ్ రెంట్ రూ.40వేలుగా చెబుతున్నారు. సీఎం అండ్ కో మొత్తం నాలుగు గ‌దులు బుక్ చేసుకున్నార‌ని.. దీంతో సీఎం విశ్రాంతి ఖ‌ర్చు రూ.2ల‌క్ష‌లుగా చెబుతూ విప‌క్షాలు మండిప‌డుతున్నాయి.

ఓప‌క్క రాష్ట్ర ప్ర‌జ‌లు భీక‌ర క‌రువుతో కిందామీదా ప‌డుతున్న వేళ‌.. ప్ర‌జ‌ల ఈతిబాధ‌ల మీద ప‌ని చేయాల్సిన సీఎం.. అందుకు భిన్నంగా ల‌గ్జ‌రీ రిసార్ట్ లో విశ్రాంతి తీసుకోవ‌ట‌మా? అని మండిప‌డుతున్నారు. ఈ రిసార్ట్ లో రూమ్ లోప‌లే ప్ర‌త్యేక స్విమ్మింగ్ ఫూల్.. ప్రైవేటు బార్.. ప్ర‌త్యేక బాల్క‌నీతో పాటు.. మ‌సాజ్ ట‌బ్.. ఓపెన్ ష‌వ‌ర్.. బోటింగ్ లాంటి ఎన్నో సౌక‌ర్యాలు ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఓప‌క్క కుమార‌స్వామి పాల‌న మీద ప‌లువురు విమ‌ర్శ‌లు చేస్తున్న వేళ‌.. అందుకు భిన్నంగా ఆయ‌న విశ్రాంతి కోసం రిసార్ట్ కు చేరుకోవ‌టాన్ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. ఈ లెక్క‌ల‌న్ని చూస్తున్న‌ప్పుడు ఖ‌ర్చు విష‌యంలో.. అప్ర‌య‌త్నంగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు గుర్తుకు రాక మాన‌రు.