Begin typing your search above and press return to search.

ముందు బొమ్మ చూపించి మాయ చేసేద్దాం!

By:  Tupaki Desk   |   13 Jan 2018 4:24 AM GMT
ముందు బొమ్మ చూపించి మాయ చేసేద్దాం!
X
పోలవరం ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తి కాదు అనే మాట చెప్పేసి చంద్రబాబునాయుడు చేతులు దులిపేసుకున్నారు. మరి అది ఎప్పటికి పూర్తవుతుందో ఆయనకు కూడా ఎంతమాత్రమూ క్లారిటీ లేదనే సంగతి.. ఆయన మాటల్లోనే కాస్తంత లోతుగా గమనిస్తే అర్థం అవుతుంది. ప్రస్తుతానికి రాష్ట్ర ప్రజలకు పోలవరం బొమ్మ చూపించేద్దాం.. ప్రాజెక్టును తర్వాత చూపించొచ్చు అనే ఆలోచన కూడా ముఖ్యమంత్రికి వచ్చినట్లుగా కనిపిస్తోంది.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయిన తర్వాత అక్కడినుంచి అటే పుణె కు వెళ్లారు. అక్కడ కేంద్ర జలవిద్యుత్తు పరిశోధన కేంద్రం వారు.. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఒక త్రీడీ నమూనా ను తయారుచేశారు. దానిని పరిశీలించేందుకు చంద్రబాబునాయుడుతోపాటు జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కూడా వెళ్లారు. మొత్తానికి పోలవరం ప్రాజెక్టు ఎలా ఉంటుందో.. అధికారులు తయారు చేసిన బొమ్మ చంద్రబాబునాయుడుకు తెగ నచ్చినట్లుగా కనిపిస్తోంది. ఆ వెంటనే.. ఆయనకు- ఇలాంటి బొమ్మను అమరావతిలో కూడా ఒకటి ఏర్పాటు చేయాలనే ఐడియా వచ్చేసింది.

ఇదే మాదిరి త్రీడీ నమూనాను అమరావతిలో కూడా ఏర్పాటు చేస్తే.. బాగుంటుదని.. అమరావతిలో దానిని చూసిన వాళ్లందరూ కూడా పోలవరం ప్రాజెక్టును చూడడానికి వెళ్తారని చంద్రబాబునాయుడు పేర్కొన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. చూడబోతే.. మరో ఎక్స్ ట్రా త్రీడీ బొమ్మను తయారుచేయించి.. దాన్ని అమరావతికి తీసుకువచ్చి.. దాని ఫోటోలను మీడియాకు రిలీజ్ చేసి.. అక్కడితో.. పోలవరం పూర్తి అయిపోతోందన్న ఫీలింగ్ ను ప్రజలకు కలిగించేయవచ్చుననే భావనతో చంద్రబాబునాయుడు ఉన్నట్లుగా కనిపిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

గతంలో అరచేతిలో వైకుంఠం చూపించడం అనే సామెత ఉండేది. ఇప్పడు చంద్రబాబునాయుడు విషయంలో.. కంప్యూటర్లలో తయారైన డిజైన్లను అరచేతిలో ఇమిడి స్మార్ట్ ఫోన్లలో, ట్యాబ్ లలో చూపించేస్తూ.. ఇలాంటి త్రీడీ బొమ్మలతో ఫీల్ క్రియేట్ చేస్తూ.. ఆ సామెతను సార్థకం చేస్తున్నట్లుగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.