Begin typing your search above and press return to search.

విన్నారా..చంద్ర‌బాబును మోదీ మోసం చేశార‌ట‌!

By:  Tupaki Desk   |   1 Jun 2018 12:53 PM GMT
విన్నారా..చంద్ర‌బాబును మోదీ మోసం చేశార‌ట‌!
X
ఏ ఎండ‌కా గొడుగు ప‌ట్ట‌డం.....ఏరు దాటాక తెప్ప త‌గ‌లేయ‌డం.....ఏరు దాటేదాకా ఏరు మ‌ల్ల‌న్నా...ఏరు దాటిన త‌ర్వాత బోడి మ‌ల్ల‌న్నా....ఇటువంటి సామెతల‌న్నీ ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడు పేటెంట్ తీసుకున్నారంటే అతిశ‌యోక్తి కాదేమో. 2014లో నాటి ప్ర‌ధాని అభ్య‌ర్థి మోదీని ఇంద్రుడు చంద్రుడు అని....మోదీ ప్ర‌ధాని అయితే, దేశాన్ని ఎక్క‌డికో తీసుకువెళ‌తార‌ని చంద్ర‌బాబు డ‌ప్పు కొట్టి మ‌రీ చెప్పారు. త‌న రెండు క‌ళ్ల‌సిద్ధాంతాన్ని ఏమాత్రం మిస్ కాకుండా...ఓ కంట్లో మోదీ ప్ర‌తిబింబం...మ‌రో కంట్లో ప‌వ‌న్ ప్ర‌తిబింబం పెట్టుకొని స్వ‌ల్ప తేడాతో సీఎం అయ్యారు. నాలుగేళ్లు మోదీ - ప‌వ‌న్ తో రాసుకుపూసుకు తిరిగిన బాబుగారికి....హ‌ఠాత్తుగా వారిద్ద‌రూ ఆగ‌ర్భ శత్రువుల‌య్యార‌ట‌. అంతేకాదండోయ్, దేశ‌ప్ర‌జ‌ల‌తో పాటు త‌న‌ను కూడా మోదీ మోసం చేశార‌ని చంద్ర‌బాబు తాజాగా ఆరోపించ‌డం ప‌లువురిని సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గురిచేస్తోంది. ప్ర‌ధాని మాట‌ల‌కు తాను కూడా మోస‌పోయాన‌ని....తాజాగా చంద్ర‌బాబు సానుభూతి రాగం అందుకోవ‌డం నిజంగా ఆశ్చ‌ర్య‌క‌రం. చంద్రన్న బీమా పథకం మూడేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్ర‌సంగించిన చంద్ర‌బాబు అనేక ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

న‌ల‌భై ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వం.....3 ప‌ర్యాయాలు ఏపీ సీఎంగా ప‌రిపాలించిన అనుభ‌వం....రేపోమాపో కాబోయే ప్ర‌ధాని అభ్య‌ర్థి....ఇటువంటి హై ప్రొఫైల్ ఉన్న‌ చంద్ర‌బాబును...మోదీ మోసం చేశార‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆయ‌నే వెల్ల‌డించారు. ప్రధాని మాటలు కోటలు దాటుతున్నాయని చంద్ర‌బాబు ఎద్దేవా చేశారు. అనుభవంలేని వాళ్ళు సీఎం అవుతానంటూ రోడ్డు ఎక్కారని వ్యాఖ్యానించారు. ఏటీఎంలలో డబ్బులులేవ‌ని, అటువంటి దుర‌దృష్ట‌క‌ర‌మైన‌ పాలన దేశంలో సాగుతోందని ఎద్దేవా చేశారు. మ‌న డ‌బ్బులు డ్రా చేసుకోవడానికి కూడా క్యూలో నిలుచోవ‌డం, ఇడ్లీపై కూడా 18శాతం టాక్స్ వేయ‌డం దారుణ‌మ‌న్నారు. మోదీ మైక్ తీసుకుంటే ఆప‌లేమ‌ని, ఉప‌న్యాసాలు దంచికొడ‌తార‌ని ఎద్దేవా చేశారు. తాను వేసిన రోడ్ల మీదే నడుస్తూ.. త‌న‌ను విమర్శిస్తున్నార‌ని, ఎవ‌రి మాట‌లు న‌మ్మ‌వ‌ద్ద‌ని పిలుపునిచ్చారు.

చంద్ర‌బాబు మాట‌ల‌ను నిశితంగా ప‌రిశీలిస్తే ఎవ‌రికైనా న‌వ్వు రాక మాన‌దు. పెద్ద నోట్లు ర‌ద్దు చేయాల్సిందిగా తానే గ‌తంలో ప్ర‌ధానికి లేఖ రాశాన‌ని నోట్ల‌ర‌ద్దు స‌మ‌యంలో చంద్ర‌బాబు ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ ప్ర‌క‌టించారు. ఆ క్రెడిట్ కొట్టేయాల‌ని చూశారు. అయితే, బీజేపీతో క‌టీఫ్ చెప్పిన వెంట‌నే బాబుగారికి క్యూలైన్ల‌లో నిల‌బ‌డుతోన్న మ‌నుషులు గుర్తుకురావ‌డం హాస్యాస్పదం. నిన్నటి దాకా కేంద్రం తానా..అంటే తాన తందనా అన్న చంద్రబాబుకు ఇడ్లీల‌పై జీఎస్టీ విష‌యం బ‌హుశా ఇపుడే తెలిసి ఉంటుంది. త‌న‌ను కూడా మోదీ మోసం చేశార‌ని చంద్ర‌బాబు క‌ప‌ట‌నాట‌కాలాడ‌డం ఆయ‌న‌లోని న‌ట చాతుర్య‌త‌ను బ‌య‌ట‌పెడుతోంది. అస‌లు, మోస‌గాళ్ల‌కే మోస‌గాడైన చంద్ర‌బాబును ఎవ‌ర‌న్నా మోసం చేయ‌డం సాధ్య‌మా? అది కూడా....చంద్ర‌బాబుక‌న్నా త‌క్కువ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న మోదీ వంటి వ్య‌క్తికి అస‌లు సాధ్యం కాదు. ప్ర‌పంచంలోనే ఇంత‌టి మోస‌గాడు...ద‌గాకోరు మ‌రొక‌రు ఉండ‌ర‌ని చంద్ర‌బాబునుద్దేశించి ప్రతిప‌క్షాలు విమ‌ర్శిస్తున్న వేళ‌....తానే మోస‌పోయాన‌ని బాబు గారు అన‌డం కొస‌మెరుపు. ఒక‌వేళ పొర‌పాటున భ‌విష్య‌త్తులో ఆస్కార్ అవార్డుల త‌రహాలో `చంద్ర‌న్న` అవార్డులు పెడితే....బాబుగారిని ఉత్త‌మ న‌టుడిగా జ్యూరీ ఏక‌గ్రీవంగా ఎంపిక చేస్తుంద‌న‌డంలో ఎటువంటి సందేహం లేదు.