Begin typing your search above and press return to search.

ఆలూ - చూలు లేదు.. అప్పుడు ఫిమేల్ సీఎం అట..

By:  Tupaki Desk   |   24 Nov 2018 7:49 AM GMT
ఆలూ - చూలు లేదు.. అప్పుడు ఫిమేల్ సీఎం అట..
X
ఆలూ లేదు.. చూలు లేదు.. అప్పుడే నెక్ట్స్ సీఎం అని కలలుగంటున్నారట కాంగ్రెస్ నేతలు.. సోనియా సభ సక్సెస్ తర్వాత కాంగ్రెస్ నేతల్లో ఎక్కడిలేని ఉత్సాహం వచ్చిందంట.. ఉదృతంగా ప్రచారం చేసి పార్టీని గద్దెనెక్కిస్తే మనకే చాన్స్ అనుకుంటున్నారట.. మరికొన్ని రోజుల్లో పోలింగ్ జరగనుంది. ఈలోపు ప్రచార పర్వంలో దూసుకుపోవడానికి ప్లాన్ చేస్తున్నారట.. తెలంగాణ నెక్ట్స్ సీఎం చర్చ ఇప్పుడు కాంగ్రెస్ లో జోరుగా సాగుతోందట. అందరూ ‘‘ఆయన’’ లేదా ‘‘ఈయన’’ అని అనుకుంటుండగా.. ‘‘ఆయన’’ కాదు ‘‘ఆమె’’ అనే ప్రచారం తాజాగా మొదలైంది.

టీఆర్ ఎస్ అధికారంలోకి వస్తే.. సీఎం అభ్యర్థి ఎవరంటే ఠక్కున చెప్పేస్తాం.. కేసీఆర్ అని. ఆయనకు ఆ పార్టీలో ఎదురు చెప్పేవారు ఎవరూ లేకపోవడంతో సీఎం పీఠం అధిరోహించేది ఆయనే అనేది కన్ఫం. మరి, మహా కూటమి అధికారం చేపడితే.. అప్పుడు సీఎం అభ్యర్థి ఎవరంటే.. ఓ నాలుగైదు పేర్లు ముఖ్యంగా వినిపిస్తాయి. ప్రస్తుతం వీరు కూడా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారట. ఎందుకంటే మహిళా సీఎం అయితే.. ఎలా ఉంటుందనే ప్రచారం సోనియా సభ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారిందట..

ఈ ప్రచారానికి కారణం లేకపోలేదు. ఏఐసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు సుస్మితా దేవ్.. తెలంగాణ పర్యటన సందర్భంలో ఇక్కడ ఏర్పాటయ్యేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తేల్చిపడేశారు. అంతటితో ఆగకుండా ఈ సారి మహిళ నేత ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనేశారు. ఈ పాయింట్ ఆధారంగా తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేతలు ఆనందంలో ఉప్పొంగిపోతున్నారు. సీనియర్లు - మంత్రులుగా పనిచేసిన డీకే అరుణ - సబితా ఇంద్రసేనారెడ్డి - గీతారెడ్డి - విజయశాంతి - ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి ప్రస్తుతం ఈ బరిలో ఉన్నారు. అధిష్టానం దూత ప్రకటనతో వీరు ఆనందంలో మునిగిపోయి ప్రయత్నాలు మొదలెట్టేశారు.

దీంతో కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో సీనియర్లుగా చెలామణి అవుతున్న మేల్ లీడర్లు ఇబ్బందులు పడుతున్నారట. అసలు కాంగ్రెస్ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకోలేదు.. ప్రకటించలేదు.. ఈ రచ్చ ఏంది అంటున్నారట. నిన్న మొన్నటి వరకు ఉత్తమ్ - రేవంత్ - భట్టి - జానారెడ్డి - పొన్నాల - దామోదర రాజనర్సింహ వంటి ఉద్ధండులు సీఎం రేసులో ఉన్నారు. ఎన్నికల్లో గెలవకముందే కాంగ్రెస్ పార్టీలో జోరుగా సాగుతున్న చర్చను అధిష్టానం కట్టడి చేయకపోతే అసలుకే మోసం వచ్చేలా ఉందంటున్నారు. మేల్ లీడర్ ను సీఎం చేస్తామా.? లేక ఫిమేల్ లీడర్ ను చేస్తామా అన్నది గెలుపు తర్వాత చూడాలని నేతలు కోరుతున్నారు. కాంగ్రెస్ నేతల ఈ ముందస్తు సీఎం గోల ఇప్పుడా పార్టీలో చర్చనీయాంశంగా మారింది.