Begin typing your search above and press return to search.

కర్ణాటకలో యోగి మార్క్.. సీఎం బసవరాజ్ సంచలనం

By:  Tupaki Desk   |   29 July 2022 6:35 AM GMT
కర్ణాటకలో యోగి మార్క్.. సీఎం బసవరాజ్ సంచలనం
X
కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి కోపం వచ్చింది. తానెంత ప్రయత్నించినా పాలన మీద పట్టు సాధించే విషయంలో ఆయన ఇంకా వెనుకబడే ఉన్నారు. దీనికి తోడు శాంతిభద్రతలకు సంబంధించి అంశాలు ఆయనకు పంటి కింద రాయిలా తగులుతూనే ఉన్నాయి. దక్షిణాదిలో అధికారంలో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రమైన కర్ణాటక బీజేపీకి ఎంత ముఖ్యమన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై ఉన్న ఒత్తిడి అంతా ఇంతా కాదు.

ఇలాంటి సమయాల్లోనే సంచలన ఉదంతాలు చోటుచేసుకోవటం.. అధికార పార్టీకి చెందిన యూత్ నేత ప్రవీణ్ నెట్టర్ ను దారుణంగా హత్య చేసిన వైనం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. అధికారంలో ఉండి కూడా హిందూ కార్యకర్తల్ని కాపాడుకునే విషయంలో బసవరాజ్ ప్రభుత్వం ఫెయిల్ అవుతుందన్న ఆరోపణలు వస్తున్నాయి. దక్షిణ కన్నడ జిల్లాలో బీజేపీ యువజన విభాగానికి చెందిన నేత దారుణ హత్య నేపథ్యంలో సీఎం కీలక వ్యాఖ్య చేశారు.

పరిస్థితులు డిమాండ్ చేస్తే కర్ణాటకలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అనుసరించే విధానాల్ని పాటించాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతిని దెబ్బ తీసేందుకు ప్రయత్నించే దేశ వ్యతిరేక.. మతతత్వ శక్తుల్ని ఎదుర్కొనేందుకు వీలుగా యూపీలోని యోగి సర్కారు అనుసరించే విధానాల్ని తాను పాటిస్తానని చెప్పారు. అంటే.. కర్ణాటకలో యోగి సినిమాను చూపించాలన్నట్లుగా సీఎం బసవరాజ్ వ్యాఖ్యలు ఉన్నాయి.

తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారి ఇళ్లను కూల్చేయటం.. వారికి తగిన శాస్తి చేస్తున్నట్లుగా చెప్పుకునే యోగి బుల్ డోజర్ విధానంపై పెద్ద ఎత్తున విమర్శల ఉన్నాయి.

అయితే.. ఇలాంటి వారికి చేతలతో సమాధానం చెబితేనే సరిపోతుందన్న వాదనకు మద్దతు పెరుగుతున్న వేళ.. యోగి మార్కును కర్ణాటకలో తీసుకురావాలన్న బసవరాజ్ మాట ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తమ ప్రభుత్వ పని తీరుకు నూటికి నూరు మార్కులు వేసుకున్న బసవరాజ్.. లెక్కల్లో ఎంత వీక్ అన్నది ఇట్టే తెలుస్తోంది. ఒకవైపు తమ పార్టీకి చెందిన మరో సీఎం విధానాల్ని అనుసరిస్తానని చెబుతూనే..తన ప్రభుత్వానికి నూటికి నూరు మార్కులు వేసుకోవటం ఏమిటి?అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిజంగానే ఆయన పాలన అంత బాగుంటే.. యోగి విధానాన్ని ఫాలో కావాల్సిన పనేముంది?