Begin typing your search above and press return to search.

ఏపీలో వైఎస్సార్సీపీ - టీడీపీల ఘర్షణలు కంటిన్యూ!

By:  Tupaki Desk   |   15 April 2019 7:00 AM IST
ఏపీలో వైఎస్సార్సీపీ - టీడీపీల ఘర్షణలు  కంటిన్యూ!
X
పోలింగ్ పూర్తి అయ్యి మూడు రోజులు గడిచిపోయినా..ఏపీలో తెలుగుదేశం - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్యన గొడవలు చల్లారడం లేదు.ఇరు పార్టీల కార్యకర్తలూ.. గ్రామ స్థాయిల్లో కొట్లాడుతూనే ఉన్నారు. పరస్పరం దాడులు చేసుకోవడం జరుగుతూ ఉంది.

పోలింగ్ రోజున బీభత్సంగా కొట్టుకున్నారు. పలు నియోజకవర్గాల్లో అలాంటి గొడవలు సాగాయి. అంతకు ముందు ప్రచార సమయంలోనూ గొడవలు తప్పలేదు. తమ ఊర్లోకి తమకు నచ్చని వారు ప్రచారానికి రావడానికి వీల్లేదంటూ గ్రామాల్లో గొడవలు సాగాయి. రాళ్ల దాడులు, వాహనాల మీదకు రాళ్లు రువ్వడం జరిగాయి. కొన్ని చోట్ల చెప్పులు.. పరకలు కూడా విసిరిన దాఖలాలున్నాయి.

ప్రచార సమయంలోనే అలాంటి గొడవలు సాగగా..పోలింగ్ రోజున వేట కొడవళ్లు లేచాయి. పోలింగ్ రోజున ఇరు పార్టీలకు చెందని కార్యకర్తలూ హత్యలకు గురి అయ్యారు. అనేక మంది గాయపడ్డారు. ఇక ఎమ్మెల్యే అభ్యర్థుల మీద కూడా దాడులు జరిగాయి.

గత కొన్నేళ్లతో పోలిస్తే ఈ సారి అలాంటి దాడులు సంచలనమే అని చెప్పాలి. పోలింగ్ వేళ ఇన్నేళ్లూ ఆ తరహా హింస జరిగేది కాదు. ఈ సారి గతంతో పోలిస్తే హింస పెరిగింది.

ఇక పోలింగ్ ముగిసిన మూడు రోజుల తర్వాత కూడా పలు చోట్ల ఇరు పార్టీల కార్యకర్తలూ గొడవ పడుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. పెదకూరపాడు నియోజకవర్గంలో అంబేద్కర్ కు నివాళి ఘటించే విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ కార్యకర్తల మధ్యన గొడవ జరిగింది.

ఇక రాయలసీమలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు చెందిన మూడు ఎకరాల అరటి పంటకు నిప్పు పెట్టారు. అది తెలుగుదేశం పార్టీ వాళ్ల పనే అని సదరు బాధితుడు వాపోతూ ఉన్నారు. మొత్తానికి ఎన్నికలు పల్లెసీమల్లో పెద్ద చిచ్చే పెట్టినట్టుగా ఉన్నాయి. ఇవి ఆరేదెన్నడో!