Begin typing your search above and press return to search.

కడపలో వైసీపీ - టీడీపీ వర్గాల ఘర్షణ... వేటకొడవళ్లతో దాడులు!

By:  Tupaki Desk   |   19 Sept 2020 1:11 PM IST
కడపలో వైసీపీ - టీడీపీ వర్గాల ఘర్షణ... వేటకొడవళ్లతో దాడులు!
X
కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీకి చెందిన వర్గీయులు కత్తులతో దాడులకు దిగారు. కత్తులు, గడ్డపారలతో దాడులకు తెగబడి స్థానికుల వెన్నులో వణుకుపుట్టించారు. ఈ ఘర్షణ గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి అతికష్టం మీద పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి సాధరణ స్థితికి వచ్చిందని పోలీసులు చెప్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే .. కమలాపురం గిడ్డంగి వీధి సీతాలమ్మ గుడి వద్ద శనివారం ఉదయం ఉద్రిక్తత ఏర్పడింది. ఓ వివాదాస్పద స్థలం విషయంలో అధికార వైసీపీ - విపక్ష టీడీపీ సభ్యులు గొడవకు దిగడంతో వర్గపోరు మొదలైంది. కత్తులు, గడ్డపారలతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. ఈ దాడిలో రెండు గ్రూపులకు సంబంధించిన కొందరికి గాయాలయ్యాయి. ఆ ఘటనతో ఒక్కసారిగా స్థానికులు బెంబేలెత్తిపోయారు. కాసేపు, రెండు వర్గాలు భీకర స్థాయిలో పరస్పరం దాడులకు తెగబడ్డారు. ఆ గొడవలు చూసిన కొంతమంది స్థానికులు పోలీసులకి సమాచారం ఇవ్వగా .. రంగంలోకి దిగారు. పోలీసులు రంగంలోకి దిగిన తర్వాత కూడా రెండు వర్గాలు పరస్పరం దాడులను కొనసాగించాయి. పోలీసులు అతికష్టం మీద రెండు వర్గాలను తరిమి కొట్టడంతో గొడవ సద్దుమణిగింది. కానీ ఆ ప్రాంతం ఇంకా ఉద్రిక్తంగానే వుండడంతో పోలీసు బలగాలను మోహరించారు. పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని పోలీసు అధికారులు చెబుతున్నారు.