Begin typing your search above and press return to search.

టీడీపీ సీమ టపాకాయలు.. అనంతలో రచ్చరచ్చ

By:  Tupaki Desk   |   13 July 2020 11:02 PM IST
టీడీపీ సీమ టపాకాయలు.. అనంతలో రచ్చరచ్చ
X
మొన్నటి ఎన్నికల్లో చిత్తుగా ఓడి ప్రతిపక్షంలోకి మారినా సీమ టీడీపీ నేతలు తగ్గడం లేదట.. పగలు, సెగలు కక్కుతూ రాజకీయాలు భగ్గుమనేలా నిప్పులు చెరుగుకుంటున్నారు. కళ్యాణ దుర్గం మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి.. మరో టీడీపీ నేత మాదినేని ఉమామహేశ్వర నాయుడుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా రాజకీయం అనంతపురం జిల్లాలో సెగలు కక్కిస్తోంది.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఇన్ చార్జి హనుమంతరాయను కాదని చంద్రబాబు.. మాదినేని ఉమామహేశ్వర నాయుడుకు టికెట్ ఇచ్చాడు. కానీ ఆయన వైసీపీ గాలిలో కొట్టుకుపోయి ఓడిపోయారు. కానీ ఇద్దరి మధ్య నాటి నుంచి వైరం మొదలై భగ్గుమంటోంది.

కళ్యాణదుర్గం.. ముందు నుంచి టీడీపీకి కంచుకోట.. 2014లో టీడీపీ నుంచి హనుమంతరాయ చౌదరి గెలిచారు. కుటుంబం పెత్తనం ఎక్కువ కావడం.. వ్యతిరేకతతో చంద్రబాబు ఈయనను పక్కనపెట్టి 2019లో మాదినేనికి టికెట్ ఇచ్చారు. దీంతో ఇరువురి మధ్య రాయలసీమ ఫ్యాక్షన్ మొదలైంది. మాదినేని ఓటమికి హనుమంతరాయ పరోక్షంగా పనిచేశారని టాక్ ఉంది. దీంతో ఇద్దరి మధ్య నాటి నుంచి కోల్డ్ వార్ నడుస్తోంది. టీడీపీ సీనియర్ నేతలు పయ్యావుల కేశవ్, జేసీ ఫ్యామిలీలు ఉమామహేశ్వర నాయుడికి సపోర్టు చేస్తున్నారు. హనుమంతకు కాల్వ శ్రీనివాసులు, పార్థసారథి, ప్రభాకర్ చౌదరి మద్దతు తెలుపుతున్నారు. ఇలా టీడీపీ నేతలు కూడా వీరిద్దరి మధ్య చీలిపోయారు.

ఇక టీడీపీ ప్రతిపక్షంలోనూ వీరిద్దరూ తలోదారిలో టీడీపీని ఓన్ చేసుకొని ఎవరి ఆందోళనల్లో వారు పాల్గొంటూ కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తున్నారు. రెండు కత్తులు టీడీపీలోని ఒకే ఒరలో ఇమడలేక కత్తులు దూసుకుంటున్నాయి. పార్టీని రావణాకాష్టంగా చేస్తున్నారని కార్యకర్తలు విమర్శిస్తున్నారు.