Begin typing your search above and press return to search.

భారత్ - చైనా బలగాల మధ్య ఘర్షణ.. కాల్పులు కూడా జరిగాయా?

By:  Tupaki Desk   |   8 Sept 2020 9:15 AM IST
భారత్ - చైనా బలగాల మధ్య ఘర్షణ.. కాల్పులు కూడా జరిగాయా?
X
గడిచిన కొద్దికాలంగా భారత్ - చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. గతంలో ఇలాంటి పరిస్థితి దాయాది పాక్ తో ఉండేవి. అందుకు భిన్నంగా కొన్ని నెలలుగా చైనా దూకుడుగా వ్యవహరించటం.. భారత్ ను ఏదోలా దెబ్బ తీయాలన్నట్లుగా వ్యవహరించే ధోరణి అంతకంతకూ పెరుగుతోంది. ఆ మధ్యన గల్వాన్ వ్యాలీలో భారత్ - చైనా బలగాల మధ్య దాడులు జరగటం.. ఎలాంటి ఆయుధాలు లేని భారత సైనికులపై ఇనుప మేకులతో ఉన్న కర్రలతో దాడి చేసి పలువురి ప్రాణాలు తీయటం తెలిసిందే.

ఈ ఉదంతంలో వీరోచితంగా పోరాడిన భారత సైనికులు.. చైనాకు షాకివ్వటమే కాదు.. దాదాపు 30 నుంచి 40 మంది చైనా సైనికుల్ని మట్టుబెట్టటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈసారి అందుకు భిన్నంగా రెండు దేశాల సైనికుల మధ్య కాల్పులు జరిగినట్లుగా చెబుతున్నారు. తూర్పు లద్దాఖ్ లోని వాస్తవాధీన రేఖ వెంట కాల్పులు చోటు చేసుకున్నాయన్న వార్తలు వస్తున్నాయి.

సోమవారం అర్థరాత్రి వేళలో ఈ కాల్పులు చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. తూర్పు లద్ధాఖ్ సెక్టార్ లోని సరిహద్దుల్లో ఇరు దేశాల మధ్య కాల్పులు జరిగాయని తెలుస్తోంది. అయితే.. ఈ కాల్పులకు కారణం భారత్ అని చైనా ఆరోపిస్తోంది. తొలుత భారత సైనికులే కాల్పులు జరిపారంటోంది. అయితే.. ఈ ఉదంతంపై భారత్ ఇప్పటివరకు స్పందించలేదు. అయితే.. చైనా వినిపిస్తున్న వాదనలో నిజం లేదని.. ఇదంతా చైనా ఆడుతున్న నాటకంగా చెబుతున్నారు.

తొలుత చైనానే కాల్పులు జరిపిందని.. తన తప్పును కప్పిపుచ్చుకోవటం కోసం ఇలా బుకాయిస్తుందన్న మాట వినిపిస్తోంది. అయితే.. భారత్ అధికారప్రకటనతో వాస్తవాలు మరింతగా వెల్లడయ్యే అవకాశం ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నట్లుగా చెప్పాలి. భారత్ తొలుత కాల్పులకు దిగటంతో తాము ప్రతిస్పందనగానే ఎదురుదాడి చేయాల్సి వచ్చిందని చైనా ఆర్మీ అధికారి ఆరోపించారు. అంతే తప్పించి.. అందుకు తగ్గట్లు ఎలాంటి ఆధారాల్ని చూపించలేదు. ఈ ఉదంతంపై మరింత సమాచారం బయటకు రావాల్సి ఉంది.