Begin typing your search above and press return to search.

టీ20 ప్రపంచకప్ పై క్లారిటీ?

By:  Tupaki Desk   |   27 Jun 2021 6:30 AM GMT
టీ20 ప్రపంచకప్ పై క్లారిటీ?
X
కరోనా కల్లోలంతో దేశంలో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ నిర్వహణపై అనిశ్చితి నెలకొంది. సెప్టెంబర్ వరకు దేశంలో కరోనా పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. ఇప్పటికే ఐపీఎల్ లో ఎన్ని కఠిన బయోబబుల్ లు పెట్టినా కూడా కరోనా సోకింది. ఆటగాళ్లు కరోనా బారినపడ్డారు. ఈ క్రమంలోనే దేశంలో ప్రపంచ టీ20 నిర్వహించడం బీసీసీఐకి తలకు మించిన భారం. ఎందుకంటే ప్రపంచంలోని అన్ని దేశాల ఆటగాళ్లు భారత్ వస్తారు. వారికి కరోనా సోకకుండా నియంత్రించడం అంటే ఈ సమయంలో అస్సలు సాధ్యం కానీ పని. పైగా దేశంలో థర్డ్ వేవ్ భయాలు ఇంకా ఉండనే ఉన్నాయి.

ఈ క్రమంలోనే కొన్ని నెలలుగా సందిగ్ధంలో పడిన టీ20 ప్రపంచకప్ భారత్ నుంచి బయటకు పోయే ప్రమాదంలో పడింది. టీ20 ప్రపంచకప్ ఎప్పుడు ఎక్కడ నిర్వహించాలనే దానిపై బీసీసీఐ స్పష్టత వచ్చేసింది. అనుకున్నట్లే దేశం నుంచి ఈ మెగా టోర్నీ తరలిపోయింది.

యూఏఈ వేదికగా ఈ మెగా టోర్నీ జరగబోతోంది. షెడ్యూల్ ప్రకారం.. అక్టోబరు-నవంబరు నెలల్లో భారత్ వేదికగా ఈ టీ20 ప్రపంచకప్ జరగాల్సింది . కొన్ని నెలల ముందు వరకు ఈ విషయంలో ఎవరికి సందేహాల్లేవు. కానీ కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు ఇప్పుడు ఇంత పెద్ద టోర్నీని మరో దేశం తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇక మధ్యలో ఆగిపోయిన ఐపీఎల్ ను కూడా యూఏఈలోనే నిర్వహించేందుకు బీసీసీఐ సూత్రప్రాయంగా నిర్ణయించింది. దేశంలో ప్రస్తుతం సెకండ్ వేవ్ తగ్గింది. కానీ ఇంత పెద్ద జనాభా దేశం కావడం.. వైరస్ ప్రభావం పెరగదని గ్యారెంటీ లేకపోవడం.. థర్డ్ వేవ్ భయాల మధ్య ఈ పెద్ద టోర్నీ విషయంలో రిస్క్ తీసుకోలేమని బీసీసీఐ బావిస్తోంది. అందుకే యూఏఈనే సరైన వేదికగా భావిస్తోంది. ఈ మేరకు యూఏఈలోనే టీ20 ప్రపంచకప్ నిర్వహిస్తామని బీసీసీఐ కార్యదర్శి జైషా మీడియాకు వెల్లడించారు. దీనిపై త్వరలోనే ప్రకటన వస్తుందని తెలిపారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. అక్టోబర్ 17 నుంచి ఈ మెగా టోర్నీ మొదలవుతుందట.. నవంబర్ 14న ఫైనల్ జరుగుతుందట.. మధ్యలో ఆగిన ఐపీఎల్ ను కూడా యూఏఈలోనే సెప్టెంబర్ నుంచి నిర్వహించడానికి బీసీసీఐ సిద్దమవుతోంది. ఐపీఎల్ ముగిశాకే టీ20 ప్రపంచకప్ మొదలవుతుంది.