Begin typing your search above and press return to search.

ఈటెల మాటల్ని.. అంకెల్ని స్కాన్ చేస్తే.. షాకే

By:  Tupaki Desk   |   14 March 2017 4:28 AM GMT
ఈటెల మాటల్ని.. అంకెల్ని స్కాన్ చేస్తే.. షాకే
X
తెలంగాణ రాష్ట్రబడ్జెట్ ను నాలుగోసారి ప్రవేశ పెట్టే అదృష్టం తనకు లభించినట్లుగా చెప్పుకున్నారు తెలంగాణ రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్. తన 65 నిమిషాల బడ్జెట్ ప్రసంగంలో అవకాశం ఉన్నప్రతిచోటా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తేస్తూ పొగిడసిన వైనం స్పష్టంగా కనిపించింది. అంతనా.. తెలంగాణ రాష్ట్రం ఎంతలా దూసుకెళుతుందన్న విషయాన్ని బడాయి మాటలతో చెప్పుకోవటం కనిపించింది. నిజంగానే తెలంగాణ రాష్ట్రం అంతలా అభివృద్ది పథంలో దూసుకెళుందా? అన్న ప్రశ్నను వేసుకున్నప్పుడు అదంతా ఉత్త మాటలేనని తేలింది. మూడేళ్ల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రం చేసిన అప్పుల లెక్క వింటే వామ్మో..అనుకోకుండా ఉండలేం.

అప్పుల్లేని అభివృద్ధిని ప్రజలు కోరుకుంటారే తప్పించి.. అందినంత అప్పులు చేసుకుంటూపోతూ.. వాటిని ఖర్చు చేసి..అదంతా తమ గొప్పతనమే అన్న మాటల్ని చూసినప్పుడు.. అప్పులు చేసి ఖర్చు చేయటం కూడా గొప్పేనా? అన్న సందేహం కలగకమానదు. మాటలు మాయ చేయొచ్చేమో కానీ.. అంకెలు ఆ పని ఎప్పుడూ చేయవు. అంకెలతో ఆటలాడుకునే అవకాశం ఉన్నా.. నిశితంగా చూసినప్పుడు అంకెలు ‘అసలు’ విషయాల్ని చెప్పేయటం కనిపిస్తుంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ప్రవేశ పెట్టిన బడ్జెట్ ను చూసినప్పుడు అదే విషయం మరోసారి స్పష్టమవుతుంది.

బడ్జెట్ అంచనాల్నిఏడాదికేడాదికి పెంచేస్తూ పోతున్నప్పటికీ..అవన్నీ అంచనాలే తప్పించి.. అసలు లెక్కలుకావన్నవిషయాన్ని మర్చిపోకూడదు. దాదాపుగా 1.5లక్షల కోట్ల రూపాయిల బడ్జెట్ ప్రతిపాదనలు చేసినప్పటికీ..రేపొద్దున వాటిల్లో నిజంగా జరిగేవి ఎంతన్నది ప్రశ్నార్థకమే. ఉదాహరణకు రాష్ట్రానికి వచ్చే పన్ను ఆదాయంలో కీలకమైన కేంద్ర పన్నుల వాటా లెక్కనే చూస్తే.. 2015-16 వాస్తవ గణాంకాలు రూ.12,350 కోట్లుగా కనిపిస్తాయి.అదే సమయంలో 2016-17కు చూస్తే.. సవరించిన అంచనాలు రూ.14,876 కోట్లు. ఇది వాస్తవ గణాంకాలు ఎంతమాత్రం కాదన్నది మర్చిపోకూడదు.అదే సమయంలో 2017-18 బడ్జెట్ అంచనాల్నిచూస్తే.. ఏకంగా రూ.17,005 కోట్లు పెంచి చూపించటం కనిపిస్తుంది. నిజంగానే కేంద్రం నుంచి అంత మొత్తంలో పన్నుల వాటా వస్తుందా? అన్నది ప్రశ్న.

బడ్జెట్ ఆదాయ అంచనాల్ని మరింత నిశితంగా చూస్తే.. మద్యం అమ్మకాల మీద ప్రభుత్వం భారీగా ఆధారపడిన విషయం కనిపిస్తుంది. 2015-16 వాస్తవ గణాంకాలు రూ.3,809 కోట్లు కాగా..2016-17సవరించిన అంచనాలు రూ.5,083 కోట్లు.కానీ..ఈ ఏడాది బడ్జెట్ అంచనాలు ఏకంగా రూ.8,999 కోట్లుగా చూపించారు. ఈ ఏడాదిలో 19.6 శాతం మేర రాబడి పెరుగుతుందన్న లెక్కతో బడ్జెట్ అంచనాల్ని వినిపించిన ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్.. ఎక్సైజ్ లెక్కకు వచ్చేసరికి దాదాపు 50 శాతం కంటే ఎక్కువ ఆదాయం వస్తుందన్న ఆశాభావాన్ని లెక్కల్లో చూపించటం చూస్తే..ఎక్సైజ్ మీద ప్రభుత్వం ఎంతగా ఆధారపడిందన్నది అర్థమవుతుంది. అదే సమయంలో.. ఒక ఏడాదిలో 50శాతం ఆదాయం పెరుగుదల సాధ్యమేనా? అన్న సందేహం కూడా కలగకమానదు. ఈ ప్రశ్నను మాట వరసకు కూడా ప్రస్తావించని వైనం బడ్జెట్ ప్రసంగం వింటే ఇట్టే అర్థమవుతుంది.

ఒక్క ఎక్సైజ్ లెక్కలోనే కాదు.. ఆదాయం భారీగా వస్తుందన్న అంచనాలు వేసుకొన్న మరికొన్నిఅంశాల్లోనూ.. భవిష్యత్ మీద ఆశలు మాత్రమే కనిపిస్తాయే తప్పించి వాస్తవానికి దూరంగా ఉండకూడదన్న బాధ్యత లోపించినట్లుగా కనిపించకమానదు. ఇక.. అమ్మకాల పన్ను విషయంలో ఈటెల రాజేందర్ లెక్క చూస్తే.. అవాక్కు అవ్వాల్సిందే. ఉద్యమనేతగా.. రాజకీయ నేతగా సుపరిచితుడైన ఈటెల..అంతకుమించి మంచి వ్యాపారవేత్త అన్న విషయాన్నిమర్చిపోకూడదు. ఆయనకున్న భారీ ఫ్రౌల్టీలో లెక్కలు.. ఆయన తాజాగా వినిపించిన బడ్జెట్ ప్రసంగంలో మాదిరి ఎంత మాత్రం ఉండదన్నది మాత్రం కచ్ఛితంగా చెప్పొచ్చు.

అలా ఎందుకంటే.. బడ్జెట్ లో ప్రముఖంగా ప్రస్తావించిన రాబడి పెరుగుదలను చూస్తే.. 19.6 శాతంగా పేర్కొన్నారు. అభివృద్ధి పథంలో దూసుకెళుతున్న తెలంగాణ రాష్ట్రంలో అది సాధ్యమవుతుందనే అనుకున్నా.. అమ్మకం పన్ను పద్దు దగ్గర ఈటెలగారి అంకెల మాయాజాలానికి ముగ్ధులం కావాల్సిందే. ఎందుకంటే.. అమ్మకం పన్ను 2015-16లలో రూ.29,846కోట్లు (వాస్తవ గణాంకాలు) ఉంటే.. 2016-17 నాటి సవరించిన అంచనాల ప్రకారం అమ్మకం పన్ను అంచనాలు రూ.37,433 కోట్లుగా కనిపిస్తుంది.వాస్తవ గణాంకాలు వచ్చేసరికి మరింత తగ్గినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ఆదాయం భారీగా తగ్గిందన్న మాటల నేపథ్యంలో వాస్తవ గణాంకాలు కచ్ఛితంగా ఇప్పుడు పేర్కొన్న సవరించిన అంచనాలకు ఎంతో కొంత తగ్గటం ఖాయంగా చెప్పొచ్చు. ఇక..2017-18 బడ్జెట్ అంచనాల్నిచూసినప్పుడు అమ్మకం పన్నును రూ.46,499 కోట్లుగా చూపించారు.

అంకెలుగా చూసినప్పుడు ఆ మాత్రం రాకుండా పోతుందా? అన్న భావన కలుగుతుంది. కానీ.. అంకెల లోతుల్లోకి వెళితే అసలు విషయం ఇట్టే అర్థమవుతుంది అదెలానంటే.. 2016-17సవరించిన అంచాలతో.. ఈ ఏడాది బడ్జెట్ అంచనాల్ని లెక్క కడితే.. అమ్మకంపన్ను ఆదాయ వృద్ధిరేటు 80 శాతంగా ఈటెలగారు చెప్పటం జరిగింది. అంటే.. ఈ ఏడాది రాబడి పెరుగుదల19.6 శాతంఉంటుందన్న ఈటెల అంచనాలకు.. అమ్మకం విషయంలో అదికాస్తా 80 శాతానికి వెళ్లటం చూస్తే..అంకెల బడాయి ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమవుతుంది.

ఇవే కావు.. వాహనాల పన్ను కావొచ్చు..ఇతర డ్యూలు.. పన్నుల విషయంలోనూ ఇదే హడావుడి కనిపిస్తుంది. అదే సమయంలో.. స్టాంపులు..రిజిస్ట్రేషన్ల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గిన తీరు చూస్తే.. తెలంగాణలో రియల్ బూమ్ లేదు సరికదా.. ఈ ఆర్థిక సంవత్సరంఅంత ప్రోత్సామకంగా ఉండదన్న విషయం అర్థమవుతుంది. ఎందుకంటే..2015-16 వాస్తవ గణాంకాలే స్టాంపులు..రిజిస్ట్రేషన్ల కారణంగా వచ్చిన ఆదాయం రూ.3,102 కోట్లు కాగా.. 2016-17 సవరించిన అంచనాల ప్రకారం ఈ ఆదాయం రూ.4,041కోట్లు. కానీ.. ప్రతి విషయంలోనూ అంతులేని వృద్ధిరేటును ఆశించిన విత్తమంత్రి.. స్టాంపులు..రిజిస్ట్రేషన్ల విషయానికి వచ్చేసరికి మాత్రం 2015-16 కంటే తక్కువగా ఉంటాయన్న విషయాన్ని బడ్జెట్ లో చెప్పేశారు. ఈ ఏడాదిబడ్జెట్ అంచనాల ప్రకారం స్టాంపులు.. రిజిస్ట్రేషన్ల నుంచి ఆదాయం రూ.3వేల కోట్లు మాత్రమే ఉంటుందని చెప్పటం గమనార్హం. అంటే.. 2015-16 వాస్తవ లెక్కల కంటే తక్కువగా ఉండటం విశేషం.

ఇవే కాదు..గ్రాంట్ ఇన్ ఎయిడ్ విషయంలోనూ ఈటెల కర్ర విడిచి సాము చేసినట్లుగా కనిపించక మానదు. ఎందుకంటే.. గ్రాంట్ ఇన్ ఎయిడ్ 2015-15 వాస్తవ గణాంకాల ప్రకారం వచ్చిన పన్నేతర ఆదాయం రూ.9,394 కోట్లు కాగా..2015-16 సవరించిన ఆదాయం ప్రకారం వచ్చేది రూ.13,557 కోట్లుగా లెక్క వేశారు. కానీ.. ఈ ఆర్థిక ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఈ మొత్తం రూ.26,857 కోట్లు ఉంటుందని అంచనా వేసేశారు. గత ఏడాది సవరించిన అంచనాలకు.. ఈసారి బడ్జెట్ అంచనాలకు మధ్య పెరుగుదల 50 శాతానికంటే ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు. భారీ అంకెల మాటున బడాయితనమే తప్పించి.. వాస్తవ దృక్ఫధం..బాధ్యతగా వ్యవహరించినట్లుగా ఈటెల బడ్జెట్ పద్దులో అస్సలు కనిపించకపోవటమే అసలు విసాదంగా చెప్పకతప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/