Begin typing your search above and press return to search.

షాకింగ్‌.. రాజధానిపై విచారణ నుంచి తప్పుకున్న సుప్రీంకోర్టు సీజే!

By:  Tupaki Desk   |   1 Nov 2022 9:18 AM GMT
షాకింగ్‌.. రాజధానిపై విచారణ నుంచి తప్పుకున్న సుప్రీంకోర్టు సీజే!
X
మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యుయు లలిత్‌ తప్పుకోవడం సంచలనాత్మకంగా మారింది. నవంబర్‌ 1 నుంచి రాజధాని కేసులను విచారిస్తామని ఇటీవల సుప్రీంకోర్టు తెలిపిన విషయం తెలిసిందే.

ఏపీ హైకోర్టు మూడు రాజధానుల అంశాన్ని కొట్టేయడంతో జగన్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మరోవైపు అమరావతి రైతులు సైతం ఆ పిటిషన్‌లో తమను కూడా చేర్చుకోవాలని కోరుతూ ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై నవంబర్‌ 1 సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది.

విచారణ ప్రారంభం కాగానే గతంలో వివిధ అంశాల్లో సీఎం జగన్‌కు జస్టిస్‌ యు.యు.లలిత్‌ తన అభిప్రాయం తెలిపిన విషయాన్ని రైతుల తరఫు న్యాయవాది ఆర్యమ సుందరం ప్రస్తావించారు.

2014లో రాష్ట్ర విభజన సమయంలో జస్టిస్‌ యుయు లలిత్‌ సీనియర్‌ న్యాయవాదిగా ఉన్న సమయంలో అమరావతిపై జగన్‌కు తన అభిప్రాయం తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. దీనిపై స్పందించిన సీజేఐ యుయు లలిత్‌.. ''అవునా.. ఆ విషయం నాకు గుర్తు లేదు. ఏ అభిప్రాయం ఇచ్చానో చెప్పగలరా'' రైతుల తరఫున కేసు వాదిస్తున్న న్యాయవాదిని ప్రశ్నించారు. దీంతో గతంలో జగన్‌కు జస్టిస్‌ లలిత్‌ ఇచ్చిన అభిప్రాయం కాపీని ధర్మాసనానికి రైతుల తరఫు న్యాయవాది ఆర్యమ సుందరం అందజేశారు.

ఆ కాపీని పరిశీలించిన సీజేఐ యుయు లలిత్‌.. ఈ కేసును విచారించబోనని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంత రైతులు, ఏపీ ప్రభుత్వం వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై విచారణకు విముఖత చూపారు. ఈ పిటిషన్లను తాను సభ్యుడిగా లేని మరో ధర్మాసనానికి పంపాలని రిజిస్ట్రీని ఆదేశించారు.

తమరు రాజధాని కేసులను విచారించినా తమకు అభ్యంతరమేమీ లేదని.. సదుద్దేశంతోనే జగన్‌కి ఇచ్చిన అభిప్రాయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చినట్లు అమరావతి రైతుల తరఫు న్యాయవాదులు సీజేఐ లలిత్‌కు నివేదించారు. దీనిపై సీజేఐ స్పందిస్తూ ''అమరావతిపై అభిప్రాయం ఇచ్చానన్న విషయం నాకు తెలియదు.. మీరు నా దృష్టికి తీసుకొచ్చి మంచి పనిచేశారు' అని వ్యాఖ్యానించారు. అనంతరం కేసు విచారణ నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో కేసు తదుపరి విచారణ తేదీని ప్రకటించాలని అమరావతి రైతుల తరపు న్యాయవాదులు విజ్ఞప్తి చేయగా.. విచారణకే విముఖత చూపినప్పుడు తాను తేదీ నిర్ణయించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. వీలును బట్టి రిజిస్ట్రీనే తేదీని ఖరారు చేస్తుందని తెలిపారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.