Begin typing your search above and press return to search.

సీజేఐ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు.. ఆయన మాత్రమే ఇలా మాట్లాడగలరు

By:  Tupaki Desk   |   10 Dec 2021 7:36 AM GMT
సీజేఐ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు.. ఆయన మాత్రమే ఇలా మాట్లాడగలరు
X
అత్యుత్తమ స్థానాల్లో ఉన్న వారు నిజాల్ని సూటిగా చెప్పటం చాలా అవసరం. అనవసరమైన పూతలు పూసి.. వాస్తవాన్ని మరుగన పడేసే తీరు చాలామందిలో కనిపిస్తుంది. ఇంత స్థాయికి వచ్చాం.. వాస్తవాలు చెప్పటం కన్నా.. చర్చకు ఏ మాత్రం తావివ్వని రీతిలో మాట్లాడే తీరు పలువురిలో కనిపిస్తుంది. అందుకు భిన్నంగా చేదు వాస్తవాల్ని మనసులో దాచుకోకుండా.. ఉన్నది ఉన్నట్లుగా.. సమాజంలో జరుగుతున్న తప్పుల్ని.. ఇప్పటికైనా మార్చుకోవాల్సిన వాటి గురించి ఓపెన్ గా మాట్లాడే ప్రముఖులు చాలా తక్కువగా ఉంటారు. అలాంటి తక్కువగా ఉండే వారి కోవలోకి వస్తారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ.

సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి.. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు.. చెబుతున్న అంశాలు ఆసక్తికరంగానే కాదు.. అందరూ ఆలోచించేలా ఉంటున్నాయి. ఉన్నది ఉన్నట్లుగా చెప్పేందుకు ఏ మాత్రం మొహమాట పడని ఆయన.. తన వ్యాఖ్యల కారణంగా ప్రభుత్వాలు ఇరుకున పడే అవకాశం ఉన్నా.. పట్టించుకోకుండా సత్యాన్ని సత్యంగా చెప్పే ప్రయత్నం అందరిని ఆకర్షిస్తోంది. తాజాగా ఢిల్లీలోని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (ఎన్ ఎల్ యూ)లో జరిగిన స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన పలు కీలక అంశాలపై ఆయన వ్యాఖ్యలు చేశారు.

ఆయన నోటి నుంచి వచ్చిన మాటల్ని విన్నప్పుడు.. ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాల్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పటమే కాదు.. న్యాయస్థానాలకు ప్రభుత్వాలు ఇచ్చే ప్రాధాన్యత ఎంతన్న విషయాన్ని చెప్పేందుకు ఆయన మొహమాటపడలేదన్న విషయం అర్థమవుతుంది. గతంలో విద్యా సంస్థల్లో ఎన్నికలు నిర్వహించటం.. చదువుకునే దశ నుంచే నాయకత్వ లక్షణాలు బయటకు రావటం ఉండేది. కానీ.. తర్వాతి కాలాల్లో చోటు చేసుకున్న మార్పులు.. విద్యా సంస్థల్లో విద్యార్థి సంఘ ఎన్నికల్ని ఎత్తేయటంతో మొదలై.. ఈ రోజున నాయకులు పుట్టాల్సిన విద్యా సంస్థల్లో అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి విషయాల్ని మొహమాటం లేకుండా మాట్లాడేసిన జస్టిస్ ఎన్వీ రమణ ఏం అన్నారంటే?

- కొన్ని దశాబ్దాలుగా విద్యార్థి లోకం నుంచి ఒక చెప్పుకోదగ్గ పెద్ద నాయకుడెవరూ ఉద్భవించలేదు. సంస్కరణల తర్వాత సామాజిక ప్రయోజనాల కోసం కృషిలో విద్యార్థుల పాత్ర తగ్గిపోతోంది. ఆధునిక ప్రజాస్వామ్యంలో విద్యార్థుల పాత్ర ఎంతో ఉంది. ఈ దేశ యువత సామాజికంగా, రాజకీయంగా చైతన్యవంతమైనప్పుడే విద్య, ఆహారం, వస్త్రాలు, ఆరోగ్యసంరక్షణ మొదలైన సమస్యలకు జాతీయ ప్రాధాన్యత లభిస్తుంది. చదువుకున్న యువకులు సామాజిక వాస్తవికతకు దూరంగా ఉండరాదు.

- ప్రగతిశీలంగా, హేతుబద్ధంగా, నిజాయతీతో ఆలోచించే విద్యార్థులు ప్రజా జీవితంలో ప్రవేశించాలి. నాయకులుగా మారాలి. దేశంలో జరిగిన సామాజిక విప్లవాలు, మార్పులు.. అన్నీ రాజకీయంగా చైతన్యవంతమైన, సామాజిక బాధ్యత గల విద్యార్థుల నుంచే వచ్చాయి. వారు సమాజంలోని అసమానతల పట్ల గొంతెత్తారు. రాజకీయ చైతన్యంతో చేసే అర్థవంతమైన చర్చలే మన రాజ్యాంగం ఆశించిన సుందర భవిష్యత్‌ దిశగా దేశాన్ని నడిపిస్తాయి. బాధ్యత గల యువత ద్వారా ప్రజాస్వామ్యం పటిష్ఠమవుతుంది.

- విద్యార్థులు సమాజంలో భాగం. వారు సమాజానికి దూరంగా ఉండకూడదు. దేశ జనాభాలో నాలుగో వంతుకు ఇంకా మౌలిక విద్య అందుబాటులో లేదు. విద్యార్థులు మొత్తం సమాజం గురించి యోచించకుండా సంకుచిత, వివక్షతో కూడిన అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తే దేశ ప్రజాస్వామ్యం, ప్రగతి దెబ్బతింటాయి. మా రోజుల్లో విద్యార్జన వేరుగా ఉండేది. పాఠశాల, కాలేజీలే కాక, సమాజంలో ఉన్న క్లిష్టమైన పరిస్థితులు కూడా మాకు విలువైన పాఠాలు నేర్పాయి.

- ప్రైవేట్‌ రంగంలోనడుస్తున్న రెసిడెన్షియల్‌ పాఠశాలలు, కోచింగ్‌ సెంటర్లలో చదువుకోవడం వల్ల బాగా డబ్బు లభించే లాభసాటి ఉద్యోగావకాశాలు వస్తాయనుకొని.. తల్లిదండ్రులు తమ పిల్లలను వాటికి పంపుతున్నారు. సామాజిక శాస్త్రాలను పూర్తిగా విస్మరిస్తున్నారు.

- విద్యార్థులు జైళ్ల వంటి గదుల్లో ఊపిరి సలపని వాతావరణంలో చదవడం వల్ల సమగ్ర అభివృద్ధి సాధించలేరు. దేశంలో నాణ్యమైన న్యాయవిద్యను అందించేందుకు ఏర్పర్చిన జాతీయ న్యాయవిశ్వవిద్యాలయాలలో చదివిన విద్యార్థుల్లో అత్యధికులు కార్పొరేట్‌ లా సంస్థల్లో చేరుతున్నారని

- న్యాయ విద్యార్థులు వివిధ సామాజిక అంశాలకు సంబంధించి కోర్టుల్లో పోరాటాలు చేయగలిగిన సామర్థ్యం సంపాదించాలి. న్యాయవాదులు సామాజిక ఆర్థిక, రాజకీయ వాస్తవికతలకు దూరంగా ఉండకూడదు. న్యాయవాద వృత్తి లాభాలు ఆర్జించేందుకు కాదు. అది సేవ లాంటిది.

- సమాజంలో పరిస్థితులు మన ఆలోచనల కంటే భిన్నంగా ఉంటాయి. కోర్టు గదులు సినిమాల్లో చూపించినట్లు ఉండవు. శిథిలమైన కోర్టు గదులు, విరిగిన కుర్చీల్లో కూర్చునే న్యాయమూర్తులు, సరైన సౌకర్యాలు లేకుండా పనిచేసే సిబ్బంది, బాత్రూంలు లేని పరిస్థితి సైతం ఉంది.