Begin typing your search above and press return to search.

ఉన్నది ఉన్నట్లు చెప్పేశారు: ‘టీవీ చర్చల’పై సీజేఐ కీలక వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   18 Nov 2021 5:22 AM GMT
ఉన్నది ఉన్నట్లు చెప్పేశారు: ‘టీవీ చర్చల’పై సీజేఐ కీలక వ్యాఖ్యలు
X
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆ పదవికి మరింత శోభ తెచ్చేలా వ్యవహరిస్తున్నారు జస్టిస్ ఎన్వీ రమణ. అచ్చ తెలుగోడైన ఆయన సుప్రీంకోర్టు పని తీరును మరింత మెరుగుపర్చటమే కాదు.. ఆయన వ్యవహరిస్తున్న తీరు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కుర్చీలో కూర్చున్న ఆయన.. పలు అంశాల విషయంలో ఆయన స్పందిస్తున్న తీరుపై సానుకూలత వ్యక్తం కావటమే కాదు.. కీలక విషయాల్లో ఇటీవల కాలంలో ఇంత స్పష్టంగా అభిప్రాయాల్ని చెప్పటంలో ఆయన తన మార్కును ప్రదర్శిస్తున్నారు.

తాజాగా దేశ రాజధాని ఢిల్లీ దాని పరిసర ప్రాంతాల్లోని వాయు కాలుష్యంపై దాఖలైన పిటిషన్లపై విచారణను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన టీవీ చర్చలపైన స్పందించారు. ఢిల్లీ కాలుష్యానికి మించి టీవీలో జరిగే చర్చలే ఎక్కువ కాలుష్యాన్ని సృష్టిస్తున్నాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘వాళ్లకు ఏమీ అర్థం కాదు.

ప్రతీ ఒక్కరికి సొంత ఎజెండా ఉంది’’ అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఢిల్లీ.. దాని పరిసర ప్రాంతాల్లోని వాయు కాలుష్యం మీద కేంద్రం తీసుకుంటున్న చర్యల మీదా ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేయటానికి వెనుకాడలేదు.

ఢిల్లీ వాయు కాలుష్యం మీద జరిగిన విచారణలో జస్టిస్ ఎన్వీ రమణతోకూడిన ధర్మాసనంలోని వారు కీలక వ్యాఖ్యలు చేశారు. కాలుష్య నివారణకు తీసుకుంటున్న ప్రభుత్వ చర్యల గురించి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అత్యున్నత న్యాయస్థానానికి వివరించారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో పాటు హరియాణా, రాజస్థాన్‌, పంజాబ్‌, ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కూడిన భేటీ జరిగిందన్నారు.

ఇందులో తీసుకున్న నిర్ణయాల ప్రకారం యాంటి స్మాగ్ గన్స్ ను వినియోగిస్తున్నామని.. రోడ్లపై స్ప్రింక్లర్లతో నీళ్లను జల్లుతున్నట్లు చెప్పారు. ఢిల్లీ.. పంజాబ్.. హర్యానా.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో స్కూళ్లను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ అధికారులు వాడే వాహనాల సంఖ్య పెద్దగా లేదని.. అయినప్పటికీ సాధ్యమైనంత వరకు కార్ పూలింగ్ విధానంలోవాహనాల్ని వినియోగించాలని కేంద్రం ఇప్పటికే సర్క్యులర్ జారీ చేసినట్లు చెప్పారు.

ఢిల్లీ కాలుష్యంలో వ్యవసాయ వ్యర్థాల వాటా 4 శాతం అంటూ కేంద్రం ఇచ్చిన అఫిడవిట్ పై తప్పుదోవ పట్టించేలా టీవీ డిబేట్లుజరుగుతున్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చి.. ‘‘మొత్తంఏడాదికి సంబంధించిన గణాంకాలు. రెండునెలల్లో వ్యవసాయ వ్యర్థాల దహనాల వల్ల వచ్చే కాలుష్యం పెరుగుతుంది’’ అని సొలిసిటర్ జనరల్ వ్యాఖ్యలు చేశారు. దీనికి స్పందించిన సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ చంద్రచూడ్.. కోర్టు తప్పుగా అర్థం చేసుకోలేదన్నారు.

వ్యవసాయ వ్యర్థాల దహనం వాటా 10 శాతం లోపే ఉంటుందన్న న్యాయవాదుల వ్యాఖ్యలకు రియాక్టు అయిన జస్టిస్ రమణ.. విషయాన్ని పక్కదారి పట్టించొద్దని.. ఈ రెండు నెలల్లో వ్యవసాయ వ్యర్థాల దహనం వాటా పెరుగుతుందన్నారు. ఇదిలా ఉంటే ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించిన అభిషేక్ మనుసింఘ్వి.. సఫర్ అధ్యయనం ప్రకారం ఢిల్లీ కాలుష్యంలో 36 శాతం వాటా వ్యవసాయ వ్యర్థాల దహనానిదేనన్నారు. కేంద్రం చెబుతున్నట్లుగా ఉన్న 3-4 శాతం వాటా అయితే పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఈ దశలో స్పందించిన జస్టిస్ ఎన్వీ రమణ.. తాము రైతుల్ని శిక్షించుకోవాలని అనుకోవటం లేదన్నారు.

వ్యవసాయ వ్యర్థాల్ని తగలబెట్టటాన్ని కనీసం వారం రోజులైనా ఆపాలని కోరాలన్నారు. పంట వ్యర్థాల దహనం గురించి అఫిడవిట్ లో పేర్కొన్న గణాంకాలు ఏవైనా.. రైతుల ఇబ్బందుల్ని పరిగణలోకి తీసుకోవాలి. ‘ఎందువల్ల వారు వాటిని తగలబెడుతున్నారో ఎవరూ ఆలోచించట్లేదు. ఢిల్లీలోని ఫైవ్ స్టార్.. సెవన్ స్టార్ హోటళ్లలో ఉండే వారు రైతుల్ని నిందిస్తున్నారు. చిన్నకారు రైతుల్ని చూడండి. మీరు మాట్లాడుతున్న యంత్రాల్ని ఉపయోగించే స్తోమత వారికి ఉందా?’’ అంటూ చీఫ్ జస్టిస్ రమణతో పాటు జస్టిస్ సూర్యకాంత్ ఘాటుగా రియాక్టు అయ్యారు.

స్ర్పింక్లర్లు.. వాటర్ బకెట్లు అంటూ చెప్పటం మినహా ప్రభుత్వం ఏమీ చేయట్లేదని.. అన్నీ కోర్టే చేయాల్సి వస్తోందన్న ఆగ్రహాన్ని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. మొత్తంగా ఢిల్లీ వాయు కాలుష్యం మీద జరిగిన వాదనలు ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. సుప్రీంకోర్టు ఏమనుకుంటుందన్న విషయంపై స్పష్టత వచ్చేలా సాగాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.