Begin typing your search above and press return to search.

మీడియా దూకుడు కథనాలపై సీజేఐ ఆవేదన.. కీలక వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   18 Aug 2021 11:30 AM GMT
మీడియా దూకుడు కథనాలపై సీజేఐ ఆవేదన.. కీలక వ్యాఖ్యలు
X
ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నట్లుగా కొన్నిసార్లు పరిస్థితి ఉంటుంది. మీడియా విషయంలో ఈ అతి ఎక్కువగా కనిపిస్తుంటుంది. సంచలనానికి కేరాఫ్ అడ్రస్ గా మీడియా ఉండటం ఏ మాత్రం సరైంది కాదు. సంచలనాలు ప్రజలకు అందివ్వాల్సిందే.. దాని వల్ల ప్రయోజనం ఉండాలే కానీ.. అనవసరమైన వివాదాలకు.. దుష్ట సంప్రదాయానికి తెర తీసేలా ఉండటం ఏ మాత్రం సరికాదు. మీడియాలో పని చేసే వారు అనునిత్యం ప్రజాక్షేమాన్ని కాంక్షించాలి. అందుకు భిన్నంగా కొందరి ప్రయోజనాల కోసం పని చేస్తే సమాజం మీద దారుణ ప్రభావాలు పడతాయి. ఇటీవల కాలంలో మీడియాలో పని చేసే వారు.. తాము పాటించాల్సిన ప్రమాణాల విషయంలో ద్వంద వైఖరిని అనుసరించటం.. మీడియా సంస్థల వాణిజ్య ధోరణి.. కొన్నిసార్లు కొత్త తలనొప్పుల్ని తీసుకొస్తుంటాయి.

తాజాగా అలాంటి ఉదంతమే చోటు చేసుకుంది. కొత్త న్యాయమూర్తుల నియామకం కోసం సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులపై మీడియాలో వచ్చిన కథనాలపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజీఐ) జస్టిన్ ఎన్వీ రమణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అధికారిక ప్రకటనకు ముందే.. నియామకాల గురించి కథనాలు రాయటం వల్ల విపరిణామాలు చోటు చేసుకుంటాయన్నారు. ఇలాంటి వార్తల్ని రాసే సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.

జస్టిన్ నవీన్ సిన్హా పదవీ విరమణ సందర్భంగాజరిగిన వీడ్కోలు సమావేశంలో మాట్లాడిన ఆయన.. కీలక వ్యాఖ్యలు చేశారు. కొలీజియం సిఫార్సు చేసినట్లుగా వచ్చిన జాబితాపై విచారం వ్యక్తం చేసిన సీజేఐ.. ఇలాంటి సీరియస్ అంశాలపై మీడియాలో ఊహాజనిత కథనాలు రావటం బ్యాడ్ లక్ గా అభివర్ణించారు. న్యాయమూర్తుల నియామక ప్రక్రియ చాలా పవిత్రమైనదని.. దాన్ని మీడియా మిత్రులు గమనించాలన్నారు. మీడియాలో వచ్చిన కథనాల్లో తప్పులు ఉన్నాయన్న విషయాన్ని ఆయన స్పష్టం చేస్తూ.. ''న్యాయమూర్తుల నియామక ప్రక్రియ ఇంకా సాగుతోంది. ఇది చాలా పవిత్రమైన ప్రక్రియ. ఎంతో గౌరవంతో కూడుకున్నది. దీన్ని మీడియా గుర్తించాలి. ప్రక్రియ పూర్తి కాకముందే రాయటం వల్ల ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఇలాంటి బాధ్యతారాహితమైన రిపోర్టింగ్.. ఊహాగానాలతో కొందరి కెరీర్లు దెబ్బ తింటాయి. దీనిపై నేను విచారం వ్యక్తం చేస్తున్నా'' అని వ్యాఖ్యానించారు.

ఊహాజనిత వార్తలు ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని.. సుప్రీంకోర్టు గౌరవాన్ని నిలబెట్టేలా ఉండాలని సూచించారు. మీడియా స్వేచ్ఛను.. వ్యక్తుల హక్కులను సుప్రీంకోర్టు ఎంతో గౌరవిస్తుందన్న ఆయన.. ఈ వ్యవస్థ సమగ్రత, హుందాతనాలను అందరూ కాపాడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అసలేం జరిగిందంటే.. సీజేఐ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు కొలీజియం అత్యున్నత న్యాయస్థానానికి కొత్తగా తొమ్మిది మంది న్యాయమూర్తుల్ని సిఫార్సు చేసినట్లుగా వార్తా కథనాలు వచ్చాయి. ఇందులో..
1. జస్టిస్ బీవీ నాగరత్న
2. మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ పీఎస్ నరసింహ
3. జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా
4. జస్టిస్ విక్రమ్‌నాథ్
5. జస్టిస్ జేకే మహేశ్వరి
6. జస్టిస్ సీటీ రవి కుమార్
7. జస్టిస్ ఎంఎం సుందరేశ్‌ తదితరుల (మరో రెండు పేర్లు బయటకు రాలేదు) పేర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. కానీ.. ఇందులో నిజం లేదని.. ఎంపిక ప్రక్రియ పూర్తి కాలేదని.. సీజేఐ చెప్పటం గమనార్హం. ఇలాంటి కథనాలుచాలామంది కెరీర్ లను దెబ్బ తీస్తాయన్న ఆయన మాట.. ఇప్పుడు ప్రచారమవుతున్న పేర్లకు వచ్చే అవకాశాల్ని దెబ్బ తీసేలా మారతాయన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది. అయినా.. ఇలాంటి అంశాల విషయంలో మీడియా కూసింత సంయమనం ప్రదర్శించాలన్న మాట వినిపిస్తోంది.