Begin typing your search above and press return to search.

సుప్రీం తీర్పును వ్య‌తిరేకించి సినిమాటోగ్ర‌ఫీ చ‌ట్టం తెచ్చారా?

By:  Tupaki Desk   |   6 July 2021 11:00 PM IST
సుప్రీం తీర్పును వ్య‌తిరేకించి సినిమాటోగ్ర‌ఫీ చ‌ట్టం తెచ్చారా?
X
ఇటీవ‌లే కేంద్ర ప్ర‌భుత్వం సినిమాటోగ్రాఫ్ -1952 చ‌ట్టాన్ని స‌వ‌రిస్తూ కొత్త ముసాయిదా బిల్లును తీసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. మోదీ అధికార పీఠ‌మెక్కిన త‌ర్వాత వ‌చ్చిన కొత్త చ‌ట్టాల్లో ఇదొక‌టి. ఇంత‌కీ ఈ చ‌ట్టం ఏం చేబుతుంటే? భార‌త్ లో విడుద‌ల‌య్యే సినిమాల‌కు సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ స‌ర్టిఫికేష‌న్ ఉంటుంది. అలా స‌ర్టిఫికేష‌న్ జ‌రిగిన సినిమా విష‌యంలో అభ్యంత‌రాలు ఏమైనా ఉంటే నిర్మాత‌లు ఫిల్మ్ స‌ర్టిఫికెట్ ట్రైబ్యున‌ల్(ఎఫ్ సీఏటీ) ముందుకెళ్లే అవ‌కాశం ఉంటుంది. అయితే ఏప్రిల్ లో ఈ అప్పీలేట్ ని కేంద్రం ర‌ద్దు చేసింది. ఆ త‌ర్వాత కొత్త బిల్లుని తీసుకొచ్చింది. అంటే సినిమాటోగ్రాఫ్ యాక్ట్ లో సెక్ష‌న్-6 ప్ర‌కారం సినిమాని మ‌ళ్లీ స‌ర్టిఫికేష‌న్ జ‌రిపించే అధికారం కేంద్ర ప్ర‌భుత్వానికి ఉంటుంద‌న్న‌మాట‌.

అయితే ఒక‌సారి స‌ర్టిఫికేష‌న్ పూర్త‌యిన త‌ర్వాత ప్ర‌భుత్వం జోక్యం గానీ స‌మీక్ష గాని ఉండ‌కూడ‌ద‌ని కెఎం.శంక‌ర‌ప్ప వ‌ర్సెస్ యూనియ‌న్ ఆఫ్ ఇండియా కేసులో క‌ర్నాట‌క హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును కేంద్రం తొసిపుచ్చి సుప్రీంకోర్టుకు వెళ్ల‌గా క‌ర్ణాట‌క కోర్టు తీర్పుకు మ‌ద్దుతుగానే తీర్పునిచ్చింది. కానీ ముసాయిదాలో కేంద్రం మార్పులు చేసి సెక్ష‌న్ 5బీ(1) పేరుతో కేంద్రం కొత్త బిల్లును తీసుకొచ్చింది. దీనిపై కేంద్ర స‌మాచార శాఖ .. ప్ర‌సార మంత్రిత్వ శాఖ జులై 2 లోగా సినీ ప్ర‌ముఖులు సూచ‌న‌లు,.. స‌ల‌హాలు ఇవ్వాల‌ని సూచించింది. దీంతో ద‌క్షిణాదిన ఒక్క‌సారిగా అగ్గి రాజుకుంది. ఉత్త‌రాది ప‌రిశ్ర‌మ పెద్ద‌లు ప‌రిమితంగా స్పందిచ‌న‌ప్ప‌టికీ సౌత్ ఇండ‌స్ట్రీ నుంచి ముఖ్యంగా కోలీవుడ్ లో మాత్రం పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చెల‌రేగాయి.

దాదాపు వెయ్యికి పైగా సినీ ప్ర‌ముఖులు కేంద్రానికి ఈ ముసాయిదాను ఉద్దేశిస్తూ.. విమ‌ర్శిస్తూ లేఖ‌లు రాసారు. క‌మ‌ల్ స‌హాస‌న్- సూర్య‌- కార్తీ- విశాల్- కార్తిక్ సుబ్బ‌రాజ్ - పా రంజిత్- వెట్రీ మార‌న్- నందితా దాస్ వంటి వారు స్పందించ‌గా.. అలాగే టాలీవుడ్ నుంచి అగ్ర నిర్మాత సురేష్ బాబు- దిల్ రాజు- అల్లు అర‌వింద్- రాంగోపాల్ వ‌ర్మ‌- ప్ర‌కాష్ రాజ్ లాంటి వాళ్లు త‌మ గ‌ళాన్ని వినిపించే ప్ర‌య‌త్నం చేసారు. బాలీవుడ్ నుంచి అనురాగ్ క‌శ్య‌ప్- ప‌ర్హాన్ అక్త‌ర్- ష‌బానా అజ్మీ స‌హా ప‌లువురు విమ‌ర్శ‌లు చేసారు.

స్వేచ్ఛ స్వ‌తంత్య్రం కోసం మీ గొంతు మాతో క‌ల‌పండ‌ని క‌మ‌ల్ ట్విటర్ వేదిక‌గా అభిమానుల‌కు పిలుపునిచ్చారు. # సినిమాటోగ్రాఫ్ యాక్ట్..రెయిజ్ యువ‌ర్ వాయిస్ అంటూ మండిప‌డ్డారు. ఈ చ‌ట్టం వ‌ల్ల సినిమా భావ ప్ర‌క‌ట‌న‌ను కోల్పోతుంద‌ని..స్వేచ్ఛ‌ను హ‌రించేలా ముసాయిదా ఉంద‌ని సినీ ప్ర‌ముఖులు అభిప్రాయ‌ప‌డ్డారు. ఇటీవ‌ల కాలంలో మోదీ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన రైతు చ‌ట్టాల‌పైనా దేశం భ‌గ్గుమ‌న్న సంగ‌తి తెలిసిందే. ఆస‌క్తిక‌రంగా రెండు సార్లు కోర్టు తీర్పు వెలువ‌డ్డాక‌.. వాట‌న్నిటినీ వ్య‌తిరేకించి కేంద్రం ఈ నిర్ణ‌యం తీసుకుంది. సుప్రీం తీర్పును కూడా వ్య‌తిరేకించి బిల్లును తీసుకొచ్చారు. ఇప్ప‌టికి సైలెంట్ గా ఉన్నా కానీ.. ఇకపైనా కేంద్రంలోని భాజ‌పా ప్ర‌భుత్వానికి సినీప‌రిశ్ర‌మ‌ల నుంచి కచ్ఛితంగా తీవ్ర నిర‌స‌న ఎదుర‌వుతుంద‌నే భావిస్తున్నారు.