Begin typing your search above and press return to search.

జగన్ కి సినీ పెద్దల ఘన సత్కారం... ?

By:  Tupaki Desk   |   12 Oct 2021 1:42 PM IST
జగన్ కి సినీ పెద్దల ఘన సత్కారం... ?
X
అదేంటి ఏపీకి జగన్ సీఎం అయి ఏకంగా సగం పాలన పూర్తి అయింది కదా ఇపుడు ఈ ముచ్చట్లు ఏంటి అంటే అవును ఏది ఎపుడు జరిగితా ముచ్చటే కదా అన్న వారూ ఉన్నారు. అన్నింటికీ మించి తెలుగు సినీ పరిశ్రమ ఈ రోజు వరకూ జగన్ని పిలిచి ఎర్రటి శాలువా అయినా కప్పలేదు. ఇది నిష్టుర సత్యం. అంత వరకూ ఎందుకు జగన్ 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి సీఎం అయ్యాక ఆయన్ని అభినందించడానికి కూడా చాలా మంది సినీ ప్రముఖులకు నాలుక తిరగలేదు అన్న ఆరోపణలు ఉన్నాయి.

నిజానికి తెలుగు సినీ పరిశ్రమకు ఏపీని పాలించిన చాలా మంది ముఖ్యమంత్రులతో దశాబ్దాల నుంచి సత్సంబంధాలు ఉన్నారు. ఎవరు సీఎం అయినా ఆయన ఏ పార్టీకి చెందిన వారు అయినా పదవిలోకి రాగానే పిలిచి సత్కారం చేయడం, ఆనక తమ వినతులు చెప్పుకోవడం టాలీవుడ్ కి ఆనవాయితీగా వస్తున్నదే. కానీ దానికి జగన్ విషయంలో గట్టిగానే గండి కొట్టేశారు అన్న మాట ఉంది. ఒక్క జగన్ కే ఎందుకు ఇలా చేశారు అంటే దాని వెనక కూడా రాజకీయాలు, కులాలు ఇత్యాదివి కీలకమైన పాత్ర పోషించాయి అన్న మాట ఉంది.

టాలీవుడ్ లో తెలుగుదేశం సానుభూతిపరులు ఉన్నారని చెబుతారు. 2019 వేళ టీడీపీ ఘోరంగా ఓటమి పాలు కావడం వారిని బాధించింది అని అంటారు. ఇక మెగా ఫ్యామిలీ హీరోకు చెందిన ఒక పార్టీ కూడా ఘోరంగా ఓడింది. దాంతో టాలీవుడ్ లో పెద్దలుగా ఉన్న కొందరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకనే జగన్ విషయంలో చాలా మంది సినీ ప్రతినిధులు సైలెంట్ గా ఉండిపోయారు అని చెబుతారు. ఆ తరువాత కొన్నాళ్ళకు చిరంజీవి జగన్ ఇంటికి వెళ్ళడం ఆయన ఏకంగా విందు భోజనం పెట్టి మరీ మెగాస్టార్ ని గౌరవించడం జరిగింది. ఆ తరువాత గత ఏడాది సినీ పెద్దలంతా కలసి జగన్ని కలిసి సినీ రంగ సమస్యలు చెప్పుకొచ్చారు.

అయితే నాటి నుంచి మరో భేటీ అయితే ఈ రోజుకీ లేదు. ఇవన్నీ పక్కన పెడితే మా కొత్త కార్యవర్గం ఎంపికైంది. మంచు విష్ణు ప్రెసిడెంట్ అయ్యారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలే చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహకారం లేకపోతే టాలీవుడ్ కి ఇబ్బందే అన్నారు. అంతే కాదు, జగన్ ని పిలిచి తాము సమస్యలు చెప్పుకుంటామని కూడా వెల్లడించారు. అంటే త్వరలోనే జగన్ తో మంచు విష్ణు భేటీ ఉంటుందని అంటున్నారు. ఆ తరువాత ఏపీ సీఎం ని ఒక వేదిక మీదకు పిలిచి సత్కారం చేయడానికి కూడా ఆలోచిస్తున్నారు అంటున్నారు. మొత్తానికి టాలీవుడ్ పాత సంప్రదాయాన్ని గుర్తు చేసిన మోహన్ బాబు దాన్ని అమలు చేయడానికి రెడీ అవుతున్నారని టాక్. మరి అదే జరిగితే టాలీవుడ్ కి ఏపీ సర్కార్ కి మధ్య మంచి బంధమే ఏర్పడుతుంది అంటున్నారు.