Begin typing your search above and press return to search.

రాజధానిలో జోరు చూపిస్తున్న సీఐడీ..వరుస అరెస్టులు - ఆందోళనలో రైతులు!

By:  Tupaki Desk   |   10 Jun 2020 8:30 AM GMT
రాజధానిలో జోరు చూపిస్తున్న సీఐడీ..వరుస అరెస్టులు - ఆందోళనలో రైతులు!
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఆర్డీఏ రీజియన్ లో భూలావాదేవీల్లో అక్రమాలు జరిగాయని అధికారం చేపట్టిన నాటి నుండి ఆరోపిస్తున్న వైసీపీ ప్రభుత్వం ఆ అక్రమాల నిగ్గు తేల్చే పనిలో జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. ఈ భూ కుంభకోణంలో సీఐడీ జోరు చూపిస్తుంది. అప్పట్లో అమరావతి రాజధాని కాగానే అందిన కాడికి దోచుకున్న అధికారుల భాగోతాన్ని సీఐడీ ఆధారాలతో సహా బయటపెడుతుండటంతో కొందరు అధికారులు అప్రూవర్లుగా కూడా మారేందుకు సిద్ధమవుతున్నారు. దీనితో రైతులతో పాటు బడాబాబుల గుండెల్లోనూ రైళ్లు పరుగెత్తుతున్నాయి.

అమరావతి భూముల్లో రాజధాని పేరుతో జరిగిన క్రయ విక్రయాలపై దర్యాప్తు జరుపుతున్న సీఐడీ చాకచక్యంగా ముందుకుపోతుంది. ఇప్పటికే అసైన్డ్ భూముల అక్రమాలతో పాటు అక్రమ కేటాయింపులపైనా తగిన ఆధారాలు సంపాదించిన సీఐడీ అధికారులు సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ మాధురిని అరెస్టు చేశారు. తాజాగా ఆమె వద్ద పనిచేసిన కంప్యూటర్ ఆపరేటర్ రణధీర్ ను కూడా అరెస్టు చేశారు. అప్పట్లో జరిగిన మరిన్ని అక్రమ కేటాయంపులతో పాటు అసైన్డ్ భూముల వ్యవహారంలో పాలుపంచుకున్న అందరినీ బయటికి లాగాలనేది సీఐడీ ఆలోచనగా కనిపిస్తోంది.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సీఆర్డీఏ కమిషనర్ గా పనిచేసిన చెరుకూరి శ్రీధర్ అమరావతి భూములు, ప్లాట్ల కేటాయింపులతో పాటు ఇతరత్రా వ్యవహరాల్లోనూ కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో ఆయన చెప్పినట్లు నడుచుకున్న సీఆర్డీఏ అధికారులనే సీఐడీ ఇప్పుడు వరుసగా అరెస్టులు చేస్తోంది. వారిని ప్రశ్నిస్తున్న సందర్భంలో వీరంతా భూ కుంభకోణంలో తమ పాత్రేమీ లేదని, ఉన్నతాధికారులు, అప్పటి మున్సిపల్ మంత్రి పేషీల నుంచి వచ్చిన ఫోన్ల ఆదారంగానే తాము ఆ నిర్ణయాలు తీసుకున్నామని, అవసరమైతే అప్రూవర్లుగా మారి సీఐడీకి కావాల్సిన సమాచారం ఇస్తామని చెబుతున్నట్లు తెలిసింది.

గతంలో సీఆర్డీఏ భూముల వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించిన పలువురు అధికారుల జాబితాను సీఐడీ సిద్దం చేస్తోంది. వీరి పాత్రను పక్కాగా నిర్ధారించేలా తగిన ఆధారాలను కూడా సంపాదిస్తోంది. తాజా అరెస్టుల సందర్భంగా బయటపడిన పలు రికార్డులను కూడా వీటికి కలిపి మరిన్ని అరెస్టులకు పక్కా ప్రణాళిక సిద్దం చేస్తోంది.ఈసారి జాబితాలో సీఆర్డీఏలో ఉన్నతాధికారుల అరెస్టులు కూడా ఉండొచ్చని సీఐడీ అధికారుల దర్యాప్తు శైలిని బట్టి తెలుస్తోంది. అమరావతి భూముల అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న సీఐడీ జోరుతో అప్పట్లో అడిగిన వారికల్లా భూములు అప్పగించిన రైతుల్లోనూ ఆందోళన పెరుగుతోంది. పెద్దల వ్యవహారాల్లో పావులుగా మారిన తమను కూడా సీఐడీ ఎక్కడ ఇరికిస్తుందో అన్న భయాలు వారిలో వ్యక్తమవుతున్నాయి.