Begin typing your search above and press return to search.

బరిలోకి 'బాస్'.. నువ్వైనా ఇస్తావా.. పంజాబ్ కు 'హోప్'

By:  Tupaki Desk   |   10 Oct 2020 11:30 AM GMT
బరిలోకి బాస్.. నువ్వైనా ఇస్తావా.. పంజాబ్ కు హోప్
X
ఐపీఎల్లో ఇప్పటికే ఆరు మ్యాచ్ లు కింగ్స్ లెవన్ పంజాబ్ కేవలం ఒకే ఒక్క విజయం సాధించి పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పరిమితం అయ్యింది. ప్లే-ఆఫ్స్ అవకాశాలను క్లిష్టంగా మార్చుకుంది. జట్టులో మంచి బ్యాట్స్ మెన్లు, బౌలర్లతో సమతూకంగా ఉన్న పంజాబ్ విజయాల్లో మాత్రం వెనకబడి ఉంది. ఆరంభ మ్యాచ్ లో అదరగొట్టిన పంజాబ్ ఆ తర్వాత వరుసగా చతికిల బడుతోంది. కెప్టెన్ కేఎల్ రాహుల్ ఒక్కడే రాణిస్తూ ఆరెంజ్ క్యాప్ బరిలో కూడా ఉన్నాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కూడా బాగా ఆడుతున్నాడు. అయితే వీరిద్దరూ ఆడకపోతే ఇక అంతే. మిగతా బ్యాట్స్ మెన్లు వరుసబెట్టి పెవిలియన్ బాట పడుతున్నారు.

నికోలస్ పూరన్ బాగా ఆడుతున్నప్పటికీ అతడు అన్ని మ్యాచ్ లలో రాణించలేదు. ముఖ్యంగా జట్టులో ఖరీదైన ఆటగాడు మ్యాక్స్‌‍వెల్ ఇప్పటికి కూడా ఫాం అందుకోక పోవడం పెద్ద సమస్యగా మారింది. అతడిపై ఎన్నో నమ్మకాలు పెట్టుకుంటే ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా గెలిపించలేదు. ఇక టీ20ల్లో యూనివర్సల్ బాస్ అయిన క్రిస్ గేల్ కి ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. దీంతో అతడిని ఎందుకు ఆడించడం లేదంటూ మాజీ ఆటగాళ్ళు, అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అయితే గేల్ సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లోనే బరిలోకి దిగాల్సి ఉందని కోచ్ కుంబ్లే తెలిపారు. తుది జట్టులో చోటు కూడా కల్పించామని.. అయితే చివర్లో గేల్ ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురవడంతో వేరే వాళ్ళకు చోటు ఇచ్చినట్లు చెప్పారు.

కాగా శనివారం మధ్యాహ్నం 3గంటల 30నిమిషాలకు జరిగే మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ గెలవలేకపోతే జట్టు ప్లే-ఆఫ్‌కు చేరే అవకాశాలు పూర్తిగా ఉండవు. నిజం చెప్పాలంటే పంజాబ్ కు ఇది చావో రేవో లాంటి పరిస్థితి. ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా గేల్ బరిలోకి దిగుతున్నట్లు కోచ్ కుంబ్లే మాటలతో అర్థం అవుతోంది. మరి గేల్ అయినా పంజాబ్ తల రాత మారుస్తారేమో చూడాలి.