Begin typing your search above and press return to search.

చోక్సీ మహా ముదురే

By:  Tupaki Desk   |   13 July 2021 4:15 AM GMT
చోక్సీ మహా ముదురే
X
వేల కోట్లరూపాయలను బ్యాంకులకు మోసం చేసి విదేశాలకు పారిపోయిన మొహుల్ చోక్సీ మహా ముదురని అర్ధమైపోయింది. ఎలాగైనా భారత్ కు రాకుండా చోక్సీ చేసుకుంటున్న ప్రయత్నాలు సక్సెస్ అయినట్లే అనిపిస్తోంది. తొందరలోనే కోక్సీని భారత్ కు రప్పించాలని కేంద్రప్రభుత్వం చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి.

డొమినికా జైల్లో ఉంటున్న చోక్సీని వైద్యం చేయించుకునేందుకు ఆంటీగ్వాకు వెళ్ళటానికి డొమినికా కోర్టు అనుమతించింది. భారత్ కు దొరక్కుండా తప్పించుకునేందుకే చోక్సీ ఆంటీగ్వా నుండి డొమినాకాకు పారిపోయాడు. అక్కడి నుండి క్యూబాకు వెళ్ళిపోవటానికి ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు. అయితే ఆయన ఖర్మకాలి డొమినికా పోలీసులకు దొరికిపోయాడు.

అక్రమంగా డొమినికాలోకి ప్రవేశించాడనే కేసు తేలేంతవరకు చోక్సీని ఎవరికీ అప్పగించేది లేదని అక్కడి కోర్టు తేల్చి చెప్పేసింది. దాంతో ఆర్ధిక నేరగాడిని మనదేశానికి రప్పించటం ఇప్పట్లో అయ్యేపని కాదని తేలిపోయింది. ఈ విషయం ఇలాగుండగానే వైద్యం కోసం డొమినికా నుండి ఆంటీగ్వాకు వెళ్ళటానికి చోక్సీకి డొమినికా కోర్టు అనుమతివ్వటం ఆశ్చర్యంగా ఉంది. పైగా చోక్సీ తిరిగి వచ్చేవరకు ఆయనపై ఉన్న కేసు విచారణను నిలిపేస్తు డొమినికా కోర్టు ప్రకటించింది.

అంటే చోక్సీ అవకాశం ఉన్నంత కాలం వైద్యం పేరుతో ఆంటిగ్వాలోనే స్వేచ్చగా తిరగచ్చన్నమాట. ఆయన చేసుకునే వైద్యం ఎప్పుడు పూర్తవుతుందో ? మళ్ళీ డొమినికాకు ఎప్పుడు వెళతాడో ? కోర్టులో విచారణ ఎప్పటికి పూర్తవుతుందో ? మొత్తానికి భారత్ కు రాకుండా చోక్సీ చేసుకుంటున్న ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతున్నట్లే అనిపిస్తోంది. ఎలాగే బ్యాంకులను దోచేసిన వేల కోట్లరూపాయలుంది. అందులో కాస్త డబ్బును ఖర్చుపెట్టినా చోక్సీ విదేశాల్లో హ్యాపగా బతికేయచ్చు. జరుగుతున్నది చూస్తుంటే ఈ వజ్రాల వ్యాపారి భారత్ కు ఎప్పుడు వచ్చేది భగవంతుడికే తెలియాలి.

ఎవరీ చోక్సీ, ఆయన గతం ఏంటి?

మెహుల్ చోక్సీ బొంబాయిలో పుట్టారు. ఈయన చినుభాయ్ చోక్సీ కుమారుడు. గుజరాత్ లోని పాలన్పూర్ లోని జి. డి. మోడీ కాలేజీలో వైద్య విద్యను అభ్యసించారు. అతనికి ముగ్గురు పిల్లలు, ఒక కుమారుడు మరియు ఇద్దరు కుమార్తెలు. అతని కుమార్తెలలో ఒకరు డిసెంబర్ 2010 లో ఆంట్వెర్ప్ ఆధారిత వజ్రాల వ్యాపారి ఆకాష్ మెహతాను వివాహం చేసుకున్నారు. పరారీలో ఉన్న వ్యాపారవేత్త నీరవ్ మోడీకి మేన మామ చోక్సి.

మెహుల్ చినుభాయ్ చోక్సి ఆంటిగ్వా మరియు బార్బుడాలో నివసిస్తున్నారు. అతను నేరపూరిత కుట్ర, నేర విశ్వాసం ఉల్లంఘన, మోసం, ఆస్తి పంపిణీ, అవినీతి కేసుల్లో నిందితుడు.

భారతదేశంలో 4,000 దుకాణాలతో రన్ అవుతున్న రిటైల్ ఆభరణాల సంస్థ గీతాంజలి గ్రూప్ యజమాని. చోక్సి 2017 నుండి ఆంటిగ్వాన్ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోసం కేసుకు సంబంధించి చోక్సీకి అరెస్ట్ వారెంట్ జారీ చేయబడింది. మే 2021 చివరన అతను ఆంటిగ్వా మరియు బార్బుడా నుండి క్యూబాకు పడవలో పారిపోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు డొమినికాలో అతన్ని కనుగొని అరెస్టు చేశారు.