Begin typing your search above and press return to search.

బీచ్ లో పోలీసులకి చిక్కిన ఛోక్సీ .. అక్కడ ఏం చేస్తున్నాడంటే ?

By:  Tupaki Desk   |   27 May 2021 6:37 AM GMT
బీచ్ లో పోలీసులకి చిక్కిన  ఛోక్సీ .. అక్కడ ఏం చేస్తున్నాడంటే ?
X
పీఎన్‌ బీ కుంభకోణం కేసు నిందితుడు మెహుల్‌ ఛోక్సీ అదృశ్యం, ఆ తర్వాత అరెస్టు వ్యవహారం సినిమాను తలపిస్తోంది. ఆంటిగ్వాలో గత ఆదివారం ఒక్కసారిగా ఛోక్సీ అదృశ్యమయ్యాడు. దీనితో ఆ దేశ పోలీసులు సహా ఇంటర్‌పోల్‌ రంగంలోకి దిగింది. ఆయన కోసం గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలోనే ఆంటిగ్వాకు పక్కనే ఉన్న చిన్న దేశం డొమినికాలోని ఓ బీచ్‌ లో ఏవో పత్రాలు సముద్రంలోకి విసిరేస్తూ ఛోక్సీ పోలీసుకు దొరికాడు. 2018 ప్రారంభంలో పీఎన్‌ బీ కుంభకోణం వెలుగులోకి రాకముందే దేశాన్ని విడిచి పారిపోయిన ఛోక్సీ, అప్పటికే ఉన్న ఆంటిగ్వాలో పౌరసత్వం వినియోగించుకొని అక్కడే ఉంటున్నాడు. అయితే రెండు రోజుల క్రితం ఛోక్సీ ఆంటిగ్వాలో కన్పించకుండాపోవడం కలకలం రేపింది.

ఆదివారం సాయంత్రం డిన్నర్‌ కోసమని ఇంటి నుంచి బయటకు వచ్చిన అతడు.. ఆ తర్వాత నుంచి అదృశ్యమయ్యాడు. దర్యాప్తులో భాగంగా జాలీ హార్బర్‌ ప్రాంతంలో ఆయన వాహనాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో ఛోక్సీ సముద్రం మార్గం గుండా పారిపోయి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అతడి ఆచూకీ కోసం ఆంటిగ్వా ప్రభుత్వం ఇంటర్‌ పోల్‌ ను ఆశ్రయించడంతో ఎల్లో నోటీసు జారీ అయ్యింది. డొమినికా నుంచి క్యూబాకు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ఆయన పట్టుబడినట్లు సమాచారం. ఓ చిన్నబోటు ద్వారా డొమినికా చేరుకున్న మెహుల్ చోక్సీ, అక్కడ్నుంచి క్యూబాకు పారిపోతుండగా, స్థానిక డొమినికా పోలీసులు పట్టుకున్నారు. ఆ తర్వాత తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఇక్కడి పోలీసుల అదుపులో ఉన్న మెహుల్ చోక్సీని నేరుగా భారత్‌ కు అప్పగించాలని ఆంటిగ్వా ప్రభుత్వం డొమినికా ప్రభుత్వాన్ని కోరింది. 2018లో పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) కుంభకోణం బయటపడటంతో నీరవ్ మోడీతోపాటు మెహుల్ చోక్సీ దేశం వదిలి పరారయ్యారు. నీరవ్ మోడీకి మెహుల్ చోక్సీ మేనమామ. సుమారు రూ. 14వేల కోట్ల పీఎన్బీ స్కాంలో వీరిద్దరు నిందితులుగా ఉన్నారు. ఈ ఇద్దరిని ఇండియా కి తీసుకురావడానికి ఈడీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది.