Begin typing your search above and press return to search.

చిత్తూరు పోలీసులకు షాకిచ్చిన రెడ్ శాండిల్ క్వీన్

By:  Tupaki Desk   |   10 Jun 2016 12:27 PM IST
చిత్తూరు పోలీసులకు షాకిచ్చిన రెడ్ శాండిల్ క్వీన్
X
శేషాచల అడవుల్లో ఎర్రచందనం దుంగల్ని అక్రమ పద్ధతిలో స్మగ్లింగ్ చేసే లేడీ డాన్.. రెడ్ శాండిల్ క్వీన్ గా పిలుచుకునే సంగీతా చటర్జీ చిత్తూరు పోలీసులకు మరోసారి షాకిచ్చింది. ఆమెను కోల్ కతా నుంచి చిత్తూరుకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్న వారికి అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ కిలాడీ లేడీ డాన్ బుల్లితెర నటిగా.. మోడల్ గా సుపరిచితురాలే. ఈమెకు సంబంధించిన షాకింగ్ నిజాలు తెలుసుకున్న చిత్తూరు పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించి కోల్ కతాకు వెళ్లి ఆమె ఆచూకీ కనిపెట్టి అదుపులోకి తీసుకున్న మరుక్షణంలో డజను మందికి పైగా లాయర్లు కమ్మేసి అమ్మడికి బెయిల్ వచ్చేలా చేయటం అప్పట్లో సంచలనం సృష్టించింది.

ఆ తర్వాత మరింత పకడ్బందీగా వ్యవహరించిన చిత్తూరు పోలీసులు ఆమెను అరెస్ట్ చేసినా.. నిబంధనల్లో ఉన్న మినహాయింపులతో బయటపడింది. అప్పటి నుంచి ఆమెను చిత్తూరు కోర్టుకు తీసుకురావాలన్న ప్రయత్నం చేస్తున్నా ఫలించని పరిస్థితి. చిత్తూరు కోర్టుకు హాజరవుతానని చెప్పి మరీ రాని నేపథ్యంలో ఆమె ఆచూకీ కోసం చిత్తూరు పోలీసులు మరోసారి కోల్ కతా బాట పట్టారు.

ఆమె ఆచూకీ కోసం ప్రయత్నించిన పోలీసులకు ఎలాంటి ఆధారాలు చిక్కకపోవటంతో.. ఆమె జాడ కోసం కోల్ కతా మహానగరాన్ని జల్లెడ పడుతున్నారు. ఈసారి ఆమెను అదుపులోకి తీసుకొని చిత్తూరు కోర్టుకు తీసుకురావాలన్న పట్టుదలతో ఉన్నారు. ఆమె ఆచూకీ చిక్కకున్నా.. ఆమెకు చెందిన బ్యాంకు లాకర్లను స్వాధీనం చేసుకొని తనిఖీలు చేపట్టగా కీలక డాక్యుమెంట్లతో పాటు.. 2.5 కేజీల బంగారు ఆభరణాలు లభించినట్లుగా చెబుతున్నారు. ఈ లెక్కన.. ఈ కిలేడీ కానీ దొరికి.. పోలీసులు విచారిస్తే మరెన్ని షాకింగ్ నిజాలు బయటకు వస్తాయో..?