Begin typing your search above and press return to search.

ఆంధ్రుల్లో ఆత్మ‌స్థైర్యం నింప‌రా చిరు..?

By:  Tupaki Desk   |   24 July 2015 9:30 AM GMT
ఆంధ్రుల్లో ఆత్మ‌స్థైర్యం నింప‌రా చిరు..?
X
కేవలం రాజకీయం మాత్రమే చేసే కాంగ్రెస్ నేతల నుంచి నిజానికి పెద్దగా ఆశించేదేమీ లేదు. రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చి.. సమాజాన్ని మార్చేస్తానని చెప్పి పార్టీ పెట్టిన చిరంజీవి.. తర్వాత పార్టీని కాంగ్రెస్ లో కలిపేసి తన సొంత లాభం చూసుకున్న ఆయన.. రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రుల తరఫున పోరాడతారనుకోవటం హస్యాస్పదమే.

మీరు చూపిస్తున్న అభిమానానికి ఏం ఇచ్చి మీ రుణం తీర్చుకోవాలంటూ ఎన్నోసార్లు సినిమా డైలాగులు చెప్పిన చిరంజీవి.. ఏపీకి అన్యాయం జరుగుతున్నా నోరు విప్పని అతగాడి చేతగానితనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేన‌ని ఆయ‌న్ను విమ‌ర్శించే వారు చెబుతుంటారు . తన ప్రజల కోసం రాజకీయ నేతలు ఎంతగానో పోరాడతారు. పోరాటం అంటే ఏమిటో తెలీని చిరంజీవి మాటలు మాత్రమే చెబుతారు. తనకెంతో చేసిన ప్రజలకు ఏమీ చేయని ఆయన.. తాజాగా మాటల మాయ చేసే ప్రయత్నం చేసిన‌ట్లుగా క‌నిపిస్తోంది.

ఏపీలోని రైతాంగం అప్పుల్లో మునిగిపోయిందని.. వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకు అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ పర్యటిస్తున్నారని చెప్పిన చిరు.. కాంగ్రెస్ హయాంలో రైతాంగం ఎంతో సుఖంగా ఉందని చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్ హయాంలో సెజ్ లతో ఎంతమంది రైతుల ఉసురు తీసుకున్నారో చిరుకు గుర్తుందో లేదో తెలీదు కానీ.. కాంగ్రెస్ హయాంలో రైతులు సుఖంగా ఉన్నారన్న అద్భుతమైన వ్యాఖ్యను చేయగలిగారంటూ విమ‌ర్శ‌కులు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు.

రైతుల్లో ఆత్మస్థైర్యం నింపటానికి అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చారని చెప్పిన చిరు.. మరి.. విభజన తర్వాత పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఏపీకి ఆత్మస్థైర్యం నింపటానికి రాహుల్ ఎందుకు రాలేదు? రాహుల్ బాబు అంటే బిజీగా ఉంటారని అనుకోవచ్చు. మరి.. చిరంజీవి సైతం ఇప్పటివరకూ అలాంటి ప్రయత్నం ఎందుకు చేయలేదు? అని ప‌లువురు ఆంధ్రులు ప్ర‌శ్నిస్తున్నారు.

ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదా కోసం ఇప్పటివరకూ పార్లమెంటులో నోరు విప్పని చిరంజీవి.. రైతుల ఆత్మస్థైర్యం గురించి మాటలు చెప్పటం కామెడీగా ఉంటుందన్న విమ‌ర్శ వినిపిస్తోంది. రైతుల ఆత్మస్థైర్యం మీద అంత శ్రద్ధే ఉంటే.. కోట్లాది ఆంధ్రులు విభజన కారణంగా ఆత్మస్థైర్యం కోల్పోయిన విషయాన్ని ఎందుకు గుర్తించలేదో..? అని సూటిగా ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. వీటికి చిరు స‌మాధానం చెబుతారా? అని అడిగేస్తున్నారు ఏపీలోని మేధావులు.