Begin typing your search above and press return to search.

చిరు మాట‌!... కేటీఆర్‌ కు సారీ చెప్పా!

By:  Tupaki Desk   |   19 Dec 2017 5:35 AM GMT
చిరు మాట‌!... కేటీఆర్‌ కు సారీ చెప్పా!
X
టాలీవుడ్ మెగాస్టార్ - కాంగ్రెస్ పార్టీ నేత‌ - కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి నోట సారీ మాట వినిపించేసింది. అది కూడా ప్ర‌పంచ తెలుగు మ‌హా స‌భ‌ల వేధిక‌గా ఆయ‌న నోట ఈ మాట వినిపించ‌డం నిజంగా ఆస‌క్తిక‌ర‌మ‌నే చెప్పాలి. అయినా సారీ చెప్పేంత మేర చిరు ఏం త‌ప్పు చేశార‌న్న విష‌యానికి వ‌స్తే... త‌ప్పేమీ లేదు గానీ... మాతృభాష అయిన తెలుగు చిరుతో పాటుగా మ‌నం కూడా చూపిస్తున్న ఆద‌ర‌ణ‌ను ప్ర‌స్తావిస్తూ చిరు సారీ చెప్పేశారు. ఇక అస‌లు విష‌యంలోకి వెళితే... హైద‌రాబాదు వేదిక‌గా గ‌డ‌చిన నాలుగు రోజులుగా ప్ర‌పంచ తెలుగు మ‌హా స‌భ‌లు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నెల 15న ప్రారంభ‌మైన ఈ స‌భ‌లు నేటితో ముగియ‌నున్నాయి. ఈ క్ర‌మంలో నాలుగో రోజు కార్య‌క్ర‌మంలో భాగంగా సినీ రంగానికి చెందిన ప‌లువురు ప్ర‌ముఖులను ఆహ్వానించిన తెలంగాణ స‌ర్కారు... వారికి ఘ‌న స‌న్మానం చేసింది. ఈ ఆహ్వానితుల జాబితాలో చిరు పేరు కూడా ఉంది. తెలంగాణ స‌ర్కారు ఆహ్వానాన్ని మ‌న్నించిన చిరు... నిన్న‌టి స‌భ‌ల‌కు హాజ‌ర‌య్యారు. త‌న‌కు స‌న్మానం జ‌రిగిన అనంత‌రం మైకందుకున్న చిరు.... ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల‌కు సినీ రంగానికి చెందిన త‌మ‌ను ఆహ్వానించిన కేసీఆర్ స‌ర్కారుకు ప్ర‌త్యేకించి మంత్రి కేటీఆర్‌ కు ప్ర‌త్యేకంగా కృతజ్ఞ‌త‌లు చెప్పారు.

ఈ క్ర‌మంలో మ‌నమంతా మ‌న ఇళ్ల‌లో తెలుగును ఏ మేర వాడుతున్నామ‌న్న విష‌యాన్ని ప్ర‌స్తావించిన చిరు... త‌న‌ను ఆహ్వానించిన సంద‌ర్భంగా కేటీఆర్‌ తో తాను సంభాషించిన వైనాన్ని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. మ‌హాస‌భ‌ల‌కు కేటీఆర్ ఆహ్వానించ‌డం - చిరు కూడా ఆ ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన త‌ర్వాత‌... మంత్రిగా కేటీఆర్ దూసుకెళుతున్న తీరుపై చిరు ప్ర‌శంస‌లు కురిపించార‌ట‌. ఈ ప్ర‌శంస‌ల‌న్నీ కూడా ఆంగ్లంలో దొర్లిపోతున్నాయ‌ట‌. దీంతో వెంట‌నే స్పందించేసిన కేటీఆర్‌... తెలుగు ప్ర‌పంచ మ‌హాస‌భ‌ల‌ను నిర్వ‌హించుకుంటున్న త‌రుణంలో తెలుగు వాళ్ల‌మైన మ‌న ఇద్ద‌రం తెలుగులోనే మాట్లాడితే బాగుంటుంది క‌దా అన్నార‌ట‌. దీంతో ఒక్క‌సారిగా త‌న‌కు జ్ఞాన‌దోయ‌మైంద‌ని, వెంట‌నే జ‌రిగిన పొర‌పాటును గుర్తించి కేటీఆర్‌ కు అక్క‌డిక‌క్క‌డే సారీ చెప్పాన‌ని చిరు చెప్పుకొచ్చారు. చిరు నోట నుంచి సారీ మాట వినిపించ‌గానే.. చాలా వేగంగా రియాక్ట్ అయిన కేటీఆర్‌... తానేమీ సీరియ‌స్‌ గా అనలేద‌ని - స‌ర‌దాగా అన్నాన‌ని చిరుకు చెప్పార‌ట‌.

త‌న నోట నుంచి వినిపిస్తున్న ఆంగ్ల ప‌దాల‌ను విన్న కేటీఆర్... తెలుగును గుర్తు చేసిన వైనం, ఆ త‌ర్వాత ఏదో స‌ర‌దాగా అన్నానులే అన్నా గానీ... ఇద్ద‌రం తెలుగు వాళ్లం క‌లిసిన‌ప్పుడు ఈ ఆంగ్ల వాడుక ఎందుక‌న్న విష‌యం గుర్తుకు రాగానే మ‌న‌సు చివుక్కుమ‌న్న‌ద‌ని కూడా చిరు చెప్పారు. అంతేకాకుండా.. ఇద్ద‌రు తెలుగు వాళ్లు క‌లిస్తే... ఆంగ్లంలో మాట్లాడుకోవాల్సిన అవ‌స‌ర‌మేముంద‌ని వ్యాఖ్యానించిన చిరు... ఉత్త‌రాదికి చెందిన ఇద్ద‌రు క‌లిస్తే హిందీలోనే సంభాషిస్తూ గ‌ర్వంగా ఫీలవుతున్న వైనాన్ని తాను కేంద్ర మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ప్ర‌త్యేకంగా గ‌మ‌నించాన‌ని ఆయ‌న చెప్పారు. మాతృభాష‌ను గౌర‌వించుకునే విష‌యంలో త‌మిళుల‌ను మించిన వారు మ‌రొక‌రు ఉండ‌ర‌న్న చిరు... ఇద్ద‌రు త‌మిళులు క‌లిస్తే... త‌మిళంలోనే వారి సంభాష‌ణ సాగుతుంద‌ని, తెలుగు వాళ్ల‌మైన మ‌న మ‌ధ్య మాత్రం ఆంగ్లం దొర్లుతుండ‌టం స‌బ‌బు కాద‌ని చెప్పారు. త‌మ ఇంటిలో పిల్ల‌లు తెలుగునే వాడేలా త‌న‌తో పాటు త‌న స‌తీమ‌ణి కూడా ప్ర‌త్యేకంగా చ‌ర్య‌లు తీసుకుంటున్న వైనాన్ని వివ‌రించిన చిరు.. ఇక‌పై ఇద్ద‌రు తెలుగోళ్లు క‌లిస్తే... తెలుగులోనే సంభాషించుకుందామంటూ పిలుపునిచ్చారు.