Begin typing your search above and press return to search.

చిరంజీవి ఎన్నికల ప్రచారం ఖాయమైనట్టే..?

By:  Tupaki Desk   |   17 March 2019 12:29 PM GMT
చిరంజీవి ఎన్నికల ప్రచారం ఖాయమైనట్టే..?
X
చిరంజీవి మళ్లీ రాజకీయం మాట్లాడనున్నారా? మళ్లీ ఎన్నికల ప్రచారం వైపు రానున్నారా? ఐదేళ్ల కిందట గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసిన చిరంజీవి… ఎక్కడా కాంగ్రెస్ ను గెలిపించలేకపోయారు! కనీసం ఒక్క చోట కూడా చిరంజీవి మ్యాజిక్ పని చేయలేదు. చిరంజీవి డైరెక్టుగా పోటీ చేయలేదు.. ఎవరినీ గెలిపించనూ లేదు. అంతే గాక అప్పుడు ప్రచారానికి వచ్చి కొన్ని నిలదీతలను కూడా ఎదుర్కొన్నారు మెగాస్టార్.

ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. చిరంజీవి రాజకీయాల నుంచి కామ్ గా తప్పుకున్నారు. మళ్లీ పోటీ ఊసు లేదు. కాంగ్రెస్ వాళ్లు పలుదఫాలుగా ప్రచారానికి రమ్మని పిలిచినా..చిరంజీవి వెళ్లలేదు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలప్పుడూ పిలిచారు, తెలంగాణ ఎన్నికలప్పుడూ కోరారు. అయినా చిరంజీవి స్పందించలేదు. అంతేగాక.. చిరంజీవి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ ఐడీ కార్డు కాలపరిమితి ముగిసిపోయిందని లీకు కూడా ఇచ్చారు. అలా చిరంజీవి తప్పుకున్నట్టే అనే భావనను కలిగించారు.

అయితే.. ఇప్పుడు చిరంజీవిని మళ్లీ ప్రచారానికి రమ్మంటున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ పిలుపు కాంగ్రెస్ నుంచినో, మరో పార్టీ నుంచినో రావడం లేదు. చిరంజీవి సహనటి, సన్నిహితురాలు అయిన సుమలత నుంచి వస్తోందట. సుమలత మండ్య నుంచి స్వతంత్రంగా ఎంపీగా పోటీ చేయాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తరఫున ప్రచారానికి ప్రముఖ తారలు రావడం గ్యారెంటీ అని టాక్.

అందులో భాగంగానే.. చిరంజీవిని కూడా ఆమె ఆహ్వానించినట్టే అంటున్నారు. చిరంజీవికి సుమలతతో సన్నిహిత సంబంధాలున్నాయి. అంబరీష్ తో కూడా సన్నిహిత సంబంధాలు కొనసాగాయి. ఇప్పుడు అంబరీష్ భార్య ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి ప్రచార సాయం ఆమె అడుగుతున్నారు.

మండ్యలో చిరంజీవికి ఎంతో కొంత గుర్తింపు ఉండనే ఉంటుంది. పక్క భాషకు చెందిన మెగాస్టార్ ప్రచారానికి రావడం ఎంతో కొంత ప్రభావం ఉండకపోదా అనే ఆశ సుమలతకు ఉండొచ్చు. అలాగే కన్నడ సినిమా వాళ్లను కూడా ఆమె ప్రచారానికి ఆహ్వానించాలని అనుకుంటున్నారట! మరి కర్ణాటకలోని పార్టీలను పక్కన పెట్టి అక్కడి స్టార్లు సుమలతకు సపోర్ట్ గా వస్తారా? చిరంజీవి మాట సాయం చేస్తారా? చూడాలిక!