Begin typing your search above and press return to search.

రాజకీయాల్లో చిరు కోరికను పవన్ తీరుస్తారా?

By:  Tupaki Desk   |   29 Sept 2019 11:13 AM IST
రాజకీయాల్లో చిరు కోరికను పవన్ తీరుస్తారా?
X
పార్టీ పెట్టి.. ఎన్నికల్లో పోటీ చేస్తే చాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి మెగాస్టార్ చిరంజీవే. ఈ మాట 2009కు ముందు వినిపించేది. తనను విపరీతంగా అభిమానించి.. ఆరాధించే అభిమానులతో పాటు తాను పార్టీ పెడితే వెంట నడిచే వారితో తన చేతికి పవర్ అన్నది కేక్ వాక్ అన్నట్లుగా ఉండేది. అయితే.. ప్రజారాజ్యం పార్టీ పెట్టి.. ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి చిరు బలం ఏమిటో అర్థం కావటమే కాదు.. ఎన్నికల్లో ఆయన విజయవకాశాల ఎంతన్న విషయం మీద ఒక అంచనాకు వచ్చేశారు.

దీనికి తగ్గట్లే ఎన్నికల ఫలితాయి వచ్చాయి. మూణ్ణాళ్ల ముచ్చటగా ప్రజారాజ్యం పార్టీని నడిపి.. చివరకు కాంగ్రెస్ లో కలిపేయటం.. రాజ్యసభ సభ్యత్వంలో కేంద్రమంత్రి పదవిని చేపట్టిన చిరు..రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. తాను బరిలోకి దిగితే సీఎం సీటు అన్న ఊహకు.. వాస్తవానికి మధ్య దూరాన్ని మెగా క్యాంప్ గుర్తించినట్లుగా చెబుతారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కావటం అంత సులువైన విషయం కాదని.. అందుకు చాలానే లెక్కలు ఉంటాయన్న మాట పలువురి నోట వినిపిస్తుంది. ఇదిలా ఉంటే అనూహ్యంగా పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్.. ఏపీ రాజకీయాల్లో రాణిస్తారని.. 2014 ఎన్నికల్లో ఆయన కీలకభూమిక పోషిస్తారన్న అంచనాకు తగ్గట్లే ఫలితాలు వచ్చినా.. వాటిని నిలుపుకోవటంతో పాటు.. తన పొలిటికల్ గ్రాఫ్ నుపెంచుకోవటంలో ఫెయిల్ అయ్యారు పవన్.

ఈ కారణంతోనే 2019లో జరిగిన ఎన్నికల్లో తాను స్వయంగా పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ పవన్ ఓటమిపాలయ్యారు. ఒక్క స్థానంలో పవన్ పార్టీ గెలవటం ద్వారా ఏపీ రాజకీయాల్లో ఆయన పాత్ర ఏమిటన్న సందేహం పలువురిలో వ్యక్తమైంది. ఇంత దారుణ పరాజయాన్ని పవన్ అభిమానులు కూడా ఊహించలేదు. అయితే.. ఈ ఓటమి నుంచి తాను పావుగంట వ్యవధిలోనే బయటకు వచ్చినట్లుగా పవన్ చెప్పుకున్నారు.

ఇదిలా ఉంటే.. ఆయన్ను ఏపీ ముఖ్యమంత్రిగా చూడాలన్న మాటను ఆయన అభిమానులు తరచూ తమ నినాదాల రూపంలో వ్యక్తం చేస్తుంటారు. ఇలాంటివేళ.. అన్న చిరు కోరికైన సీఎం పదవిని తమ్ముడు పవన్ అయినా చేపడతారా? అన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది. తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సీఎం పదవిని చేజిక్కించుకోవటం సాధ్యం కాలేదన్న మాటను నర్మగర్భంగా అడిగిన తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

రాజకీయాల్లో మీ తీరని కోరికను మీ తమ్ముడు తీరుస్తారా? అన్న ప్రశ్నను చిరుకు సంధించగా.. కాస్తంత ఆలోచనతో సమాధానం ఇచ్చారు. తానో స్థాయికి చేరిన తర్వాత సమాజానికి తన వంతు సాయంగా సేవ చేయాలన్న ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు. కానీ.. కల్యాణ్ మాత్రం చిన్నతనం నుంచి సమాజం పట్ల ఆసక్తి ఉండేదని.. జరుగుతున్న అన్యాయాల పట్ల ఆవేశం.. ఆవేదన ఉండేవన్నారు.

నిజం చెప్పాలంటే పవన్ సినిమాల కంటే కూడా సమాజాన్ని ఎక్కువగా ప్రేమించేవాడని.. అందుకే రాజకీయాల్లోకి వచ్చాడన్నారు. అవకాశం వస్తే.. అద్భుతంగా ప్రజాసేవ చేస్తాడని.. పాలిస్తాడని కితాబులిచ్చాడు. ఆ దక్షత.. సామర్థ్యం పవన్ లో పుష్కలంగా ఉన్నట్లుగా చిరు సమాధానం చూస్తే.. తన తమ్ముడు ఎప్పటికైనా ఏపీ సీఎం అవుతారన్న నమ్మకం ఉందనిపించక మానదు.