Begin typing your search above and press return to search.

'చిరు' సాయ‌మూ క‌రువాయే!

By:  Tupaki Desk   |   13 Sep 2017 1:30 PM GMT
చిరు సాయ‌మూ క‌రువాయే!
X
కాంగ్రెస్ పార్టీనేత‌ - మెగాస్టార్ చిరంజీవి మ‌న‌సులో ఏముందో తెలియ‌క కాంగ్రెస్ నేత‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఆయ‌న ఎప్ప‌టి నుంచో పార్టీ కార్య‌క్ర‌మాల‌కు - స‌మావేశాల‌కు దూరంగా ఉంటున్నారు. ఆయ‌న వ్యూహాత్మ‌కంగానే ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్నారా.. లేక మ‌రేదైనా కార‌ణ‌ముందా.. అనేది వారికి అంతుప‌ట్ట‌డంలేదు. 2008 ఆగ‌స్టు 26వ తేదీన ప్ర‌జారాజ్యం పార్టీని చిరంజీవి స్థాపించారు. 2009 ఎన్నిక‌ల్లో పోటీచేసిన ఆ పార్టీ కేవలం 18శాతం ఓట్లు మాత్ర‌మే సాధించింది. పార్టీ అధినేత చిరంజీవికి కూడా ఆ ఎన్నిక‌ల్లో ఘోర‌ప‌రాభ‌వం ఎదురైంది. చావు త‌ప్పి క‌న్ను లొట్ట‌పోయిన‌ట్లు సొంత నియోజ‌క‌వ‌ర్గం పాల‌కొల్లులో ఓడిపోయి తిరుప‌తిలో గెలిచారు.

ఆ త‌ర్వాత జ‌రిగిన అనేక ప‌రిణామాల నేప‌థ్యంలో చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీని కాంగ్రెస్‌ లో విలీనం చేస్తున్న‌ట్టు 2011 ఫిబ్ర‌వ‌రి 6న ప్ర‌క‌టించి ఆగ‌స్టులో క‌లిపేశారు. ఆ త‌ర్వాత చిరంజీవిని కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ‌కు పంపింది. రాష్ట్రంలోని రాజ‌కీయ పార్టీలు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించిన నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ పోటీచేసింది. గౌర‌వ ప్ర‌ధ‌మైన స్తాయిలో ఓట్లు తెచ్చుకుని త‌మ ఉనికిని తెలియ‌జేసి 2019 సాధార‌ణ ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని ఆ పార్టీనేత‌లు భావించారు. అయితే ఉప ఎన్నిక‌ల ప్ర‌చారానికి కూడా చిరు రాలేదు. అంత‌కుముందు, ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌లు పార్టీ స‌మావేశాల‌కు - కార్య‌క్ర‌మాల‌కు సైతం చిరంజీవి హాజ‌రుకాలేదు.

ఇటీవ‌ల ఆ పార్టీ కీల‌క‌నేత దిగ్విజ‌య్‌ సింగ్ నిర్వ‌హించిన స‌మావేశానికి కూడా చిరంజీవి హాజ‌రుకాక‌పోవ‌డంతో కాంగ్రెస్ నేత‌లు ఆలోచ‌న‌లో ప‌డ్డారు.  రాష్ట్రాన్ని విభ‌జించి ప్ర‌జాగ్ర‌హానికి గురైన కాంగ్రెస్ ఇప్ప‌ట్లో కోలుకునే ప‌రిస్థితి క‌నిపించ‌డంలేదు. దీంతో ఇక ఆ పార్టీలోనే ఉంటే త‌న‌కు భ‌విష్య‌త్తు లేద‌ని నిర్ణ‌యించుకున్నారా.. లేక తమ్ముడు ప‌వ‌న్ కళ్యాణ్ స్థాపించిన జ‌న‌సేన‌లో చేర‌బోతున్నారా.. లేక మ‌రేదైన పార్టీలో చేరేదిశ‌గా అడుగులు వేస్తున్నారా.. ఇలాంటి ఆలోచ‌న‌లు కాంగ్రెస్ నేత‌ల‌ను వెంటాడుతున్నాయి. ప్ర‌జ‌ల చీత్కారానికి గురైన కాంగ్రెస్‌ లోంచి కీల‌క నేత చిరంజీవి బ‌య‌ట‌కు వెళ్తే ఇక పార్టీ దాదాపుగా క‌నుమ‌రుగ‌వుతుందెమోన‌ని కాంగ్రెస్ నేత‌లు ఆందోళ‌న చెందుతున్నారు.