Begin typing your search above and press return to search.

ఇతగాడు మామూలోడు కాదు.. కటీఫ్ చెప్పి కూడా మోడీని మామూలుగా వాడట్లేదుగా?

By:  Tupaki Desk   |   17 Oct 2020 4:30 AM GMT
ఇతగాడు మామూలోడు కాదు.. కటీఫ్ చెప్పి కూడా మోడీని మామూలుగా వాడట్లేదుగా?
X
తెలివి ఏ ఒక్కరి సొంతం కాదు. ఈ విషయాన్ని బిహార్ ఎన్నికల్ని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది.ఇప్పుడున్న పరిస్థితుల్లో మోడీ పరివారంతో ప్రెండ్ షిప్ కటీఫ్ చేసుకోవటం అంత సామాన్యమైన విషయం కాదు. కానీ.. అంతటి రిస్కుకు సిద్ధపడి మరీ బయటకు వచ్చేస్తున్నాయి. ఎన్డీయే కూటమిలో మిత్రుడిగా ఉన్నప్పటికీ ఎలాంటి ప్రయోజనాలు కలగకపోవటం.. టార్గెట్ మొత్తం తాము ఎదగాలన్న ఆలోచన తప్పించి..తనతో పాటు తిరిగే మిత్రుడ్ని కూడా ఎదగనివ్వాలన్న ఆలోచన ఆ పార్టీలో తక్కువని చెబుతున్నారు. ఈ కారణంతో ఒక పార్టీ తర్వాత మరొక పార్టీ ఎన్డీయే నుంచి బయటకు వస్తున్నాయి.

బిహార్ ఎన్నికల నేపథ్యంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా ఉన్న ఎల్జీపీ (లోక్ జనశక్తి) బయటకు వచ్చేసి.. సొంతంగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నేత కమ్ కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్. రెండుసార్లు ఎంపీగా గెలిచిన ఈ నాయకుడు.. తన తండ్రి మరణం తర్వాత పార్టీ మొత్తాన్ని చూసుకుంటున్నాడు. బిహార్ ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంక్ ను కొల్లగొట్టే అవకాశం ఉందని చెబుతున్న వేళ.. తనపై మోడీ అండ్ కో ఆగ్రహం పడకూడదన్నట్లుగా చిరాగ్ వ్యవహారం ఉంది.

ఒకప్పుడు మిత్రుడిగా వ్యవహరించిన పార్టీ .. బిహార్ ఎన్నికల్లో నువ్వా నేనా? అన్నట్లుగా సాగుతోంది. అదే సమయంలో చిరాగ్ మాటలు ఇప్పుడు బీజేపీ వారిని సైతం విస్మయానికి గురి చేస్తోంది. సాధారణంగా మిత్రపక్షంగా బయటకు వచ్చిన తర్వాత విమర్శలు సంధించటం మామూలే. అందుకు భిన్నంగా ఉంది చిరాగ్ తీరు. మోడీకి వీరాభిమానిగా చెప్పే ఆయన.. తనకున్న ఇమేజ్ కు తగ్గట్లే మాట్లాడుతున్నారు. బీజేపీ తమకు ఇవ్వాల్సిన సీట్లు ఇవ్వకపోవటంతోనే వేరుగాపోటీ చేస్తున్నట్లు స్పష్టం చేస్తున్నారు.

అంతేకాదు.. తాను మోడీకి వీరాభిమానినని.. తనకు మోడీ ఫోటోలు అక్కర్లేదని చిరాగ్ పేర్కొన్నారు.హనుమంతిడి గుండెల్లో రాముడు ఉన్నట్లే.. తన గుండెల్లో మోడీ ఉన్నాడని చెబుతున్నారు. తనగుండెను తీల్చి చూస్తే అందులో మోడీ కనిపిస్తాడంటూ చెబుతున్న మాటలకు.. మోడీ అభిమానులు సంబరపడిపోతున్నారు. ఈ మాటలే కాదు.. మోడీ ఫోటోను తమ ఎన్నికల ప్రచారంలో వాడేయటంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దీనిపై వివరణ ఇచ్చిన చిరాగ్.. తనను తాను మోడీకి హనుమంతుడిగా స్పష్టం చేస్తున్నారు. తిడితే చెలరేగిపోవచ్చు. అందుకు భిన్నంగా పొగిడితే ఏం చెప్పగలరు? ఏం చేయగలరు? అన్నది ప్రశ్న. ఇప్పటివరకు తాము ఎదుర్కోని కొత్త తరహా రాజకీయం చిరాగ్ లో కనిపిస్తోందని చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో అతగాడి మాటల్నికమలనాథులు ఒక పట్టాన జీర్ణం చేసుకోలేకపోతున్నారు.

ఎక్కడైనా సై అంటే సై అనొచ్చు కానీ.. ప్రత్యర్థి తనకు దేవుడితో సమానమని చెప్పేస్తున్న నేతను ఎవరు మాత్రం ఏమనగలరు? తాము కటీఫ్ చెప్పింది సీట్ల లెక్క కోసమే తప్పించి.. మిగిలిన విషయాల్లో మోడీతో తమకు ఎలాంటి విభేదాలు లేవని తన మాటలతో స్పష్టం చేస్తున్నారు.

రాజకీయంగా కటీఫ్ చెప్పేసిన తర్వాత కూడా నమోను ఇంతలా వాడేసింది మాత్రమే చిరాగేనని చెబుతున్నారు. వేలెత్తి చూపించేందుకు వీల్లేకుండానే ప్రత్యర్థిని కెలికేస్తున్న యువనేత తెలివికి బీజేపీ చెక్ పెడుతుందా? అన్నది అసలు ప్రశ్న. కమలనాథులకు ఒక పట్టాన కొరుకుడుపడని రాంవిలాస్ పాశ్వాన్ కొడుకి వ్యూహల్ని క్రాక్ చేయాలన్నకసిలో ఉన్నారు బీజేపీ నేతలు. మరేం జరుగుతుందో చూడాలి.