Begin typing your search above and press return to search.

‘చింతపండు’కు బెయిల్ వచ్చాక విడుదల వేళ లోనూ హై డ్రామా?

By:  Tupaki Desk   |   9 Nov 2021 5:28 AM GMT
‘చింతపండు’కు బెయిల్ వచ్చాక విడుదల వేళ లోనూ హై డ్రామా?
X
ఎట్ట కేలకు తీన్మార్ మల్లన్న అలియాస్ చింత పండు నవీన్ కుమార్ బెయిల్ మీద విడుదలయ్యారు. ఒక యూ ట్యూబ్ న్యూస్ చానల్ అధినేగా.. జర్నలిస్టుగా సుపరిచితమైన తీన్మార్ మల్లన్న పై పోలీసులకు ఒక ఫిర్యాదు అందటం.. దాని మీద చర్యలు తీసుకునే క్రమంలో ఆయన్ను అదుపులోకి తీసుకోవటం.. ఆ వెంటనే ఒకటి తర్వాత ఒకటి చొప్పున తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 38 కేసులు నమోదు కావటం తెలిసిందే. తెలంగాణ అధికారపక్ష అధినేత కేసీఆర్ ను సూటిగా విమర్శించటంతో పాటు.. నిత్యం ఘాటు వ్యాఖ్యల తో విరుచుకుపడే ఆయన్ను తెలంగాణ ప్రభుత్వం టార్గెట్ చేసిందన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది.

తాను కోరిన డబ్బులు ఇవ్వని పక్షం లో చంపేస్తానంటూ తనను బెదిరించారంటూ ఒక జ్యోతిష్యుడు చిలకల గూడ పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన కంప్లైంట్ నేపథ్యంలో మల్లన్నను అరెస్టు చేయటం తెలిసిందే. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న ఆఫీసులో కొన్ని డాక్యుమెంట్లను.. హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకున్నారు. ఆగస్టులో అరెస్టు అయిన తీన్మార్ మల్లన్న దాదాపు రెండు నెలలకు పైనే చంచలగూడ జైల్లో ఉన్నారు. ఆయనపై మొత్తం 38 కేసులు నమోదు అయితే.. అందులో ఆరు కేసుల్ని హైకోర్టు కొట్టేసింది. మిగిలిన 32 కేసుల్లో 31 కేసులకు గతంలోనే బెయిల్ మంజూరైంది. మిగిలిన ఒక్క కేసు (చిలకలగూడ కేసు)లోనూ తాజాగా బెయిల్ వచ్చింది.

దీంతో ఆయన సోమవారం సాయంత్రం విడుదలయ్యారు. ఇదంతా బాగానే ఉన్నా.. జైలు నుంచి బయటకు వచ్చిన సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. తనకు బెయిల్ వచ్చి జైలు నుంచి విడుదలయ్యే ఆఖరి నిమిషం లోనూ తనను విడుదల కాకుండా అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగాయని.. దీనికి సంబంధించిన వివరాల్ని తన లీగల్ టీం అందజేస్తుందన్నారు. మల్లన్న మాటల్ని చూస్తుంటే.. ఆయన విడుదల వేళ.. భారీ హై డ్రామా జరిగినట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే బండి సంజయ్ చేసిన విమర్శలు.. ఆరోపణలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్.. డైలీ ప్రెస్ మీట్ల పేరు తో ఎదురుదాడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి వేళ.. తీన్మార్ మల్లన్న బెయిల్ మీద బయటకు వచ్చిన వేళ.. మరిన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోవటం ఖాయమంటున్నారు.