Begin typing your search above and press return to search.

ఏందిది బాబు; అధికారిణిపై తమ్ముడి ఓవర్‌యాక్షన్‌

By:  Tupaki Desk   |   9 July 2015 9:31 AM GMT
ఏందిది బాబు; అధికారిణిపై తమ్ముడి ఓవర్‌యాక్షన్‌
X
మిగిలిన విషయాల సంగతి ఎలా ఉన్నా.. కొన్ని అంశాల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు చాలా కరుగ్గా ఉంటారనే పేరుంది. ముఖ్యంగా తన పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించకుండా ఆయన వారి దూకుడుకు కళ్లాలు వేసే వారన్న పేరుంది.

కాకుంటే పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. రాజకీయ అవసరాలతో పాటు.. చేతిలో పవర్‌ లేని నేపథ్యంలో ఆచితూచి వ్యవహరించటం.. కొందరి విషయంలో చూసీచూడనట్లుగా ఉండటం లాంటివి చేయటం తెలిసిందే. అయితే.. అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు ఎమ్మెల్యేల ఓవర్‌యాక్షన్‌ పెరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే రెండు.. మూడు ఉదంతాలు బయటకు వచ్చాయి.

వీటన్నింటికి మించి తాజాగా వెలుగులోకి వచ్చిన వ్యవహారం తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠను.. చంద్రబాబు సారథ్య సమర్థతను ప్రశ్నించేలా ఉండటం గమనార్హం. కృష్ణా జిల్లాకు చెందిన తహాసిల్దార్‌ వజనాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఆయన అనుచరులు అనుచితంగా వ్యవహరించటం ఇప్పుడు సంచలనంగా మారుతోంది.

ఎమ్మార్వోపై దాడి చేయటంతో పాటు.. సిబ్బందిపై చేయి చేసుకొని మరీ.. అక్రమంగా ఇసుక తరలించటం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. అవినీతి.. అక్రమాలను అడ్డుకోవాల్సిన బాధ్యతలోఉన్న ఎమ్మెల్యేనే.. స్వయంగా గూండాగిరి చేయటం ఏమిటన్న ప్రశ్న వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యే వైఖరిపై రెవెన్యూ సంఘాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి.

ఒక మహిళా అధికారిణి పట్ల అంత అనుచితంగా ఎలా వ్యవహరిస్తారన్న ప్రశ్నతో పాటు.. బాబు సర్కారులో ఇలాంటివి కూడా జరుగుతాయా? అన్న విస్మయం వ్యక్తమవుతోంది. అయితే.. ఈ వ్యవహారానికి సంబంధించి ఫిర్యాదు చేసినా.. పోలీసులు ఎమ్మెల్యేపై ఎలాంటి కేసు నమోదు చేయకపోవటం అనుమానాలకు తావిస్తోంది. దీంతో విపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆందోళన చేయటం.. మొత్తమ్మీదా ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే చింతమనేనిపై కేసు నమోదు చేశారు.

ఆయనపై నాన్‌బెయిల్‌బుల్‌ కేసు నమోదైంది. అయితే.. ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డ ఎమ్మెల్యేపై చర్యలు ఏలా ఉంటాయన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లక్ష్మణ రేఖ దాటుతున్న నేతలపై చంద్రబాబు కఠినంగా వ్యవహరిస్తారా? చూసీచూడనట్లుగా ఉంటారా? అన్నది ప్రశ్నగా మారుతోంది. చింతమనేని విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా బాబు సర్కారు మీద ఈ వ్యవహారం మచ్చగా మారుతుందని చెబుతున్నారు. మరి.. దీనిపై బాబు ఎలా రియాక్ట్‌ అవుతారో చూడాలి.