Begin typing your search above and press return to search.

చింతమనేని.. చంద్రబాబుకు ఎప్పటికీ గుదిబండే?

By:  Tupaki Desk   |   24 Feb 2018 1:05 PM
చింతమనేని.. చంద్రబాబుకు ఎప్పటికీ గుదిబండే?
X
దెదులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేరు తెలియనివారు తెలుగురాష్ట్రంలో ఉండకపోవచ్చు. రాజకీయ నాయకుల్లో రౌడీయిజానికి దగ్గరి పోలికలు ఉన్న వ్యక్తిగా చింతమనేని ప్రభాకర్ గురించి చాలా మంది విమర్శిస్తూ ఉంటారు. అవతలి వారు ఎంతటి వారైనా సరే లెక్క చేయకుండా దూకుడు ప్రదర్శించడం.. ఆవేశపూరితంగా మాట్లాడడం.. వ్యవహారం ముదిరితే ముందువెనుక చూసుకోకుండా చేయి చేసుకోవడం ఆయన నైజం. ఇలాంటి దుందుడుకు చేష్టలతో తరచూ వార్తల్లో కెక్కడం ద్వారా ఆయన రాష్ట్రప్రజలందరికీ చిరపరిచితులయ్యారు. అదే క్రమంలో చంద్రబాబుకు కూడా మెడలో గుదిబండలా తయారయ్యారనే విమర్శలు కూడా అనేకం వినిపిస్తూ ఉంటాయి.

చింతమనేని ప్రభాకర్ మీద.. రౌడీయిజం, దాడి వంటి కేసులు అనేకం పెండింగ్ లో ఉన్నప్పటికీ.. ఒక్క కేసులో వచ్చిన కోర్టు తీర్పు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. నిజానికి ఇది 2011 నాటి కేసు. అప్పట్లో ఓ పబ్లిక్ మీటింగ్ పాల్గొన్న ఎమ్మెల్యే చింతమనేని, అప్పటి మంత్రి వట్టి వసంతకుమార్ మీద దాడి చేసి కొట్టారు. ఆ దాడి గురించి మంత్రి గన్ మ్యాన్ చేసిన ఫిర్యాదు ఆధారంగా విచారణ సాగింది. భీమడోలు కోర్టులో ఇటీవల చింతమనేనికి రెండేళ్ల జైలు శిక్ష విధించారు.

రెండేళ్ల జైలుశిక్ష పడినట్లయితే, అది అమల్లోకి వచ్చిన వెంటనే.. సదరు ప్రజాప్రతినిధికి ఆటోమేటిగ్గా పదవి పోతుంది. కొన్ని నెలలు తక్కువ శిక్ష విదించి ఉన్నా చింతమనేనికి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. సరిగ్గా రెండేళ్లు జైలుశిక్ష పడడంతో పదవి కోల్పోయే ప్రమాదమే కాదు, మరో ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీచేయకుండా ఓ ఆటంకం కూడా ఏర్పడింది.

అయితే చింతమనేని కేసులో భీమడోలు కోర్టు చిన్న వెసులుబాటు ఇచ్చింది. ఆయన సుప్రీం కోర్టుకు అప్పీలు చేసుకోవచ్చునని అందుకు గడువు ఇచ్చింది. ఆ గడువులోగా అప్పీలు చేసుకోకుంటే జైలుశిక్ష తప్పదన్నమాట.

అయితే రౌడీయిజానికి మారుపేరుగా రాజకీయాల్లో ఎమ్మెల్యేగా చెలామణీ అవుతున్న చింతమనేని ప్రభాకర్ కు శిక్ష పడిన నేపథ్యంలో - ఆయనను తక్షణం సస్పెండ్ చేసి - ఎమ్మెల్యేగా అనర్హుడిని చేయాలని, నేరమయ రాజకీయాలకు తాను దూరం అని చంద్రబాబు నిరూపించుకోవాలని విపక్షాలు కోరుతున్నాయి. మరి చంద్రబాబు ఈ హితోక్తులను చెవిన వేసుకుంటారో లేదో!!