Begin typing your search above and press return to search.

కేటీఆర్ కౌంటర్ కు చింతల చుక్కలు చూపించారు

By:  Tupaki Desk   |   23 March 2016 5:19 AM GMT
కేటీఆర్ కౌంటర్ కు చింతల చుక్కలు చూపించారు
X
ఆత్మవిశ్వాసం మంచిదే. కానీ.. అది కాస్త ఎక్కువ అయితేనే ఇబ్బంది అంతా. పవర్ లో ఉన్న వారు ఏం చేసినా జనాలు పెద్దగా పట్టించుకోరు. కానీ.. అహంకారంతో మాట్లాడే మాటలే ఎక్కడలేని తిప్పలు తీసుకొస్తాయి. తాజాగా టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ వారసుడిగా భావిస్తున్న మంత్రి కేటీఆర్ నోటి మాట తాజాగా కలకలం రేపటమే కాదు.. ఈ తరహా మాటలు ఏ మాత్రం మంచివి కావన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం.. అధికార విపక్ష నేతల మధ్య మాటల మంటలు పలుమార్లు అంటుకున్నాయి. మిషన్ భగీరథ పథకం టెండర్ల విషయంలో మంత్రి కేటీఆర్.. బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మధ్య మాటలు మంటలు రేగాయి. ఈ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ తొందరపడి ఒక మాట అనటం.. దానికి ధీటుగా చింతల రియాక్ట్ కావటం కనిపించింది.

తెలంగాణను దోచుకొని పోయే వారికే ప్రాజెక్టుల టెండర్లను అప్పగించారంటూ చింతల ఆరోపించారు. సీడీఆర్ పేరుతో రూ.60వేల కోట్ల పనులు అప్పగించారని.. ఇతర రాష్ట్రాలు దీని కింద రూ.20వేల కోట్లపనులే అప్పగించాయని పేర్కొనటంతో.. కల్పించుకున్న మంత్రి కేటీఆర్.. ‘‘యాంగ్రీ యంగ్ మ్యాన్. మొదటిసారి సభకు వచ్చావ్. ఆవేశంతో ప్రిపేర్ అయి వచ్చినట్లున్నావ్. సభలో ఏది మాట్లాడితే అది మాట్లాడటం సరికాదు. ప్రజల్ని తప్పుదోవ పట్టించినట్లు అవుతుంది’’ అని వ్యాఖ్యానించారు.

దీనికి ధీటుగా స్పందించిన చింతల.. ‘‘ఎగతాళిగా మాట్లాడితే మంచిది కాదు. నీ వెనుక మీ తండ్రి ఉన్నారు. నేను రాజకీయాల్లో ఉన్నప్పుడు నువ్వు మంత్రివి కావు కదా.. కనీసం పుట్టలేదు కూడా. మిషన్ భగీరథ మంచిది కాదని అనటం లేదు. టెండర్ల ప్రక్రియలో జరిగిన లోపాల్ని ప్రశ్నించాను. ఇలాంటి విధానంలో ఒడిషాలో 40 శాతం తక్కువకే కాంట్రాక్టు సంస్థలు పనులు తీసుకుంటే.. ఇక్కడ అరశాతం.. ఒక శాతం తక్కువకే తీసుకుంటున్నారెందుకు? తెలంగాణలో పైపు లైన్ పనులు చేసే వారే లేరా?’’ అంటూ ప్రశ్నించారు. విమర్శలు చేసే విపక్ష సభ్యులకు ఎటకారంతో కాకుండా.. సబ్జెక్ట్ మిస్ కాకుండా మాట్లాడటం మంచిదికాదని. ఇలాంటి తీరు ప్రజల్లో నెగిటివ్ ఇంప్రెషన్ పడేలా చేస్తుందన్న విషయాన్ని కేటీఆర్ గుర్తిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. టెంప్ట్ చేసే విపక్షాల వాదనకు టెంప్ట్ అయిపోతే ఎలా కేటీఆర్?