Begin typing your search above and press return to search.

టీడీపీ మాజీ మంత్రి రాజ‌కీయ స‌న్యాసం ఖారారైందా..!

By:  Tupaki Desk   |   5 Aug 2019 5:15 AM GMT
టీడీపీ మాజీ మంత్రి రాజ‌కీయ స‌న్యాసం ఖారారైందా..!
X
విశాఖ జిల్లా నర్సీనట్నం తెలగుదేశం పార్టీ నేతలు నిర్వేదంలో కూరుకుపోయారా ? ఇక్కడ తమకు దిశానిర్ధేశం చేసేవారు కూడా కరువయ్యారనే నిర్ణయానికి వచ్చారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. నర్సీపట్నంలో 1978 నుంచి ఇప్పటి వరకు 11 సార్లు ఎన్నికలు జరిగాయి. అయితే, మొత్తంగా 7 సార్లు టీడీపీ ఇక్కడ విజయం సాధించింది. కాంగ్రెస్‌ మూడు సార్లు విజయం సాధించగా.. తాజాగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ పునాది వేసుకుంది. అయిత, దీనికి ప్రధానంగా టీడీపీలో ఉన్న కీలక నాయకుల పసలేని వ్యవహారాలే కారణమనే వ్యాఖ్యలు తమ్ముళ్లలో జోరుగా వినిపిస్తున్నాయి.

ఈ నియోజకవర్గం నుంచి చింతకాయల అయ్యన్న పాత్రుడు టీడీపీ తరపున ఎక్కువ సార్లు పోటీ చేసి విజయం సాధించారు. చంద్రబాబు కేబినెట్‌ లోనూ ఆయన మంత్రిగా చక్రం తిప్పారు. అయితే, ఆయన పార్టీని బలోపేతం చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టకపోవడంతోనే ఇప్పుడు కేరాఫ్‌ లేకుండా పోయిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరపున బరిలో నిలిచిన సినీ దర్శకుడు పూరి జగన్నాథ్‌ సోదరుడు ఉమా శంకర్‌ గణేష్‌ విజయం సాధించారు.

నిజానికి ఇక్కడ టీడీపీ గెలిచి ఉండేదే. అయితే, స్వయంకృత అపరాథం - నాయకుల మధ్య పొరపొచ్చాలు, సిట్టింగ్‌ ఎమ్మెల్యే కమ్‌ మంత్రి ఆయ్యన్న ఇక - తాను పోటీ నుంచి తప్పుకొంటున్నామని ఎన్నికలకు ముందుగానే ప్రచారం చేయడం - కుటుంబంలో సోదరుడు ప్రత్యేక వర్గంగా మారిపోయి ప్రచారానికి దూరంగా ఉండడం వంటి కారణాలు పార్టీని నిలువునా ఇబ్బంది పెట్టాయని అంటున్నారు పరిశీలకులు. మరోపక్క, పార్టీ తరపున బలోపేతమైన కార్యక్రమాలు చేయడంలోను - పార్టీని సభ్యత్వ నమోదులో దూసుకుపోయే విషయంలోనూ అయ్యన్న చేష్టలుడిగి వ్యవహరించారనే వ్యాఖ్యలు వినిపించాయి.

తన కుమారుడికి టికెట్‌ ఇప్పించుకోవాలనే ప్రయత్నంలో ఆయన నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టలేకపోయారు. అయితే, దీనిని విభేదించిన అయ్యన్న సోదరుడు సొంతగా ఓ వర్గం ఏర్పాటు చేసుకున్నారు. ఇక, కాంగ్రెస్‌ తరపున 2009లో ఇక్కడ గెలిచిన బోళెం ముత్యాల పాప తర్వాత కాలంలో టీడీపీలోకి వచ్చారు. అయితే, ఆమె ఎదుగుదల తనకు ఇబ్బందేనని భావించిన అయ్యన్నఆమెకు పొగబెట్టారు. దీంతో ఆమె తటస్థంగా మారిపోయారు. ఈ నేపథ్యంలో ఆమె బలం లేక పోతే.. తాను గెలవడం కష్టమని భావించిన అయ్యన్న చివరకు ఇంటికి వెళ్లి మరీ స్వయంగా ఆహ్యానించి ఎన్నికల సమయంలో మద్దతు కోరారు.

ఆమె పార్టీలోకి వచ్చినా.. ఎన్నికల వేళకు మాత్రం మనసు మార్చుకున్నారు. అయ్యన్నకు వ్యతిరేకంగా చాపకింద నీరులా వైసీపీ అనుకూలంగా పనిచేశారు. ఇక, సొంత పార్టీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై బహిరంగ అవినీతి ఆరోపణలు చేసి పార్టీ పరువును బజారుకు ఈడ్చారు అయ్యన్న. దీంతో మొత్తంగా ఇక్కడ తుడిచి పెట్టుకుపోయింది. పైగా ఇటీవల జరిగిన ఎన్నికల్లోనే తనకు ఇంట్రస్ట్‌ లేదని చెప్పిన అయ్యన్న వచ్చే ఎన్నికల నాటికి పోటీ చేసే అవకాశం కూడా లేదు. ఇక, పార్టీ ఓడిపోయిన నేపథ్యంలో ముత్యాల పాప కూడా త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటున్నారు. అయ్య‌న్న రాజ‌కీయ స‌న్యాసం ఖ‌రారైన నేప‌థ్యంలో ఇక్కడ టీడీపీని నడిపించేందుకు నాయకుడు కావలెను! అంటున్నారు తమ్ముళ్లు. మరి బాబు ఏం చేస్తారో చూడాలి.