Begin typing your search above and press return to search.

ప్రజల అజ్ఞానం మీద ఆయనకు భలే నమ్మకం

By:  Tupaki Desk   |   13 Sep 2015 6:18 AM GMT
ప్రజల అజ్ఞానం మీద ఆయనకు భలే నమ్మకం
X
తెలుగు ప్రజలు ఆ నాయకుడికి మరీ అంత వెర్రివాళ్లలా కనిపిస్తున్నారో ఏమో అర్థం కావడం లేదు. సాధారణంగా ఎప్పుడూ తిమ్మిని బమ్మిని చేసి ఎన్నికల్లో గెలుస్తూ ఉండే ఆయన.. ఈసారి ఓడిపోయేసరికి.. ఆ ఓటమికి ఇంకా కారణాలు వెతుకుతూనే ఉన్న స్థితిలో కనిపిస్తున్నాడు. ఇంతకూ జనాన్ని వెర్రివాళ్ల కింద జమకట్టేస్తూ.. ఆయన చెబుతున్న సంగతి ఏంటో తెలుసా... తెలుగు ప్రజలు కాంగ్రెస్‌ అంటే.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఏమో అనుకుని ఓట్లు వేస్తున్నారట. అందువల్లనే ఆ పార్టీ సీట్లు గెలిచిందట. మరీ జనాల్ని అజ్ఞానుల కింద జమకట్టేస్తూ.. తన అవగాహన రాహిత్యాన్ని బయటపెట్టుకుంటూన్న ఆ నాయకుడు మరెవరో కాదు.. మాజీ కేంద్రమంత్రి చింతామోహన్‌.

కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానాన్ని మభ్యపెట్టడానికి, సంతుష్టుల్ని చేయడానికి బహుశా ఈ డైలాగు ఆయనకు ఢిల్లీలో మహబాగా ఉపయోగపడవచ్చునేమో. కానీ రాష్ట్రం నడిబొడ్డులో విజయవాడలో జరిగిన కార్యక్రమంలో కూడా ఇలాంటి ఆత్మవంచన డైలాగుల్తో ప్రజల్ని బురిడీ కొట్టించాలనుకుంటే ఎలాగ? రాష్ట్రాన్ని చాలా అవకరంగా విభజించినందుకు ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలందరూ ఏకాభిప్రాయంతో సమాధి కట్టేసిన సంగతి అందరికీ తెలిసిందే. భవిష్యత్తులో కూడా ఇక ఎప్పటికీ కోలుకోలేని విధంగా.. ఆ పార్టీ రాష్ట్రంలో నాశనం అయింది. అయితే ఈ వాస్తవాన్ని గుర్తించలేని స్థితిలో ఇప్పటికీ చింతా లాంటి కొందరు నాయకులు ఉన్నట్లు కనిపిస్తోంది.

ఆయన మాట్లాడుతూ.. జనం కాంగ్రెస్‌ అంటే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అని భ్రమపడుతున్నారని అంటున్నారు.కాంగ్రెస్‌ అంటేనే హస్తం గుర్తు అనేది ఎంతగా నాటుకుపోయిన విషయమో ఆయనకు తెలియదా? అలాంటిది కాంగ్రెస్‌ అనుకుంటూనే గత సార్వత్రిక ఎన్నికల్లో జనం ఫ్యాను గుర్తుకు ఓట్లు వేశారా? ఎవరిని మోసం చేయడానికి ఇలాంటి మాటలు చెబుతున్నారు? అని జనం ఆశ్చర్యపోతున్నారు. ప్రధానంగా దళితులు, దళిత క్రైస్తవులు జగన్‌ వెంట ఉన్నందుకు ఆయన ఇలా అక్కసు వెళ్లగక్కుతున్నట్లుగా ఉంది. అయితే చింతా ఇలా మరిన్ని మాటలు చెప్పినా కూడా.. ఢిల్లీలో కళ్లు మూసుకుని పార్టీ పరిస్థితుల్ని బేరీజు వేస్తూ ఉండే పెద్దలు నమ్ముతారేమో గానీ.. ఇక్కడి ప్రజలు నమ్మరనేది సత్యం.