Begin typing your search above and press return to search.

చింతా పంచాంగం చిలక జ్యోతిష్యమేనా..?

By:  Tupaki Desk   |   11 July 2015 10:33 AM GMT
చింతా పంచాంగం చిలక జ్యోతిష్యమేనా..?
X
ఇటీవల కాలంలో రాజకీయ నాయకులు జ్యోతిష్యం చెప్పడం ఎక్కువవుతోంది. ఎవరు సీఎం అవుతారో... ఎవరు సీఎం పదవి నుంచి దిగిపోతారో... ఎవరు ఎంతకాలం పదవిలో ఉంటారో కూడా చెప్పేస్తున్నారు. ఈ రాజకీయ పంచాంగాల లెక్కలు కరెక్టవడం మాత్రం ఎలా ఉన్నా అది వారివారి మనసుల్లోని కోరికలను... రాజకీయ ఆశలనూ మాత్రం వెల్లడిస్తున్నాయి. తాజాగా తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్‌ చంద్రబాబు జాతకం చెప్పారు. ఆయన లెక్క ప్రకారం చంద్రబాబు ప్రభుత్వం త్వరలోనే పడిపోతుందట... మధ్యంతర ఎన్నికలు వస్తాయట. అయితే... చింతామోహన్‌ తన జ్యోతిష్యాన్ని చంద్రబాబుతోనే సరిపెట్టేసి... ఆ తరువాత తన రాజకీయ కార్యాచరణ చెప్పుకొచ్చారు. నెల్లూరు జిల్లాలోని దుగరాజ పట్నం ఓడరేవు సాధన కోసం సోమవారం నుంచి పాదయాత్ర చేపడుతున్నట్లు చెప్పారు. అంతేకాదు.... చంద్రబాబు పాలనలో ప్రజలు కష్టాలు పడుతున్నారని... రుణమాఫీ అమలు కాలేదని... ఇసుక మాఫియా చెలరేగిపోతోందని... ఇలా పలు అలవాటైన ఆరోపణలు కొన్ని చేశారు.

అయితే... చంద్రబాబు ప్రభుత్వం కూలిపోతుందని... ఆయన సీఎం పదవి నుంచి దిగిపోవడం ఖాయమని... మధ్యంతర ఎన్నికలు వస్తాయని చెప్పిన చింతామోహన్‌ ఆ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు... ఎవరు సీఎం అవుతారన్నది మాత్రం చెప్పలేదు. అయితే... అదృష్టవశాత్తు ఆయన తానే సీఎం అవుతానని మాత్రం చెప్పలేదు. ఆ మాట కానీ చెబితే చింతా మోహన్‌ జ్యోతిష్యంపై నమ్మకం ఇంకా పెరిగిపోయేది.