Begin typing your search above and press return to search.

రెండాకులు చేజారిన‌త‌ర్వాత చిన్న‌మ్మ ప్లాన్ ఇదేనా?

By:  Tupaki Desk   |   25 Nov 2017 4:25 AM GMT
రెండాకులు చేజారిన‌త‌ర్వాత చిన్న‌మ్మ ప్లాన్ ఇదేనా?
X
త‌మిళ‌నాడు అధికార ప‌క్షం అన్నాడీఎంకే అధిప‌త్య పోరు ఒక కొలిక్కి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. చిన్న‌మ్మ‌కు వ్య‌తిరేకంగా ప‌ళ‌ని.. ప‌న్నీర్ లు ప్ర‌య‌త్నించ‌టం.. అందుకు స‌క్సెస్ అయ్యారు. పార్టీ ఎన్నిక‌ల గుర్తు అయిన రెండాకులు ప‌ళ‌ని.. ప‌న్నీర్ బృందానికి సొంతం కావ‌టంతో చిన్న‌మ్మ త‌ర్వాత ఏం చేయ‌నుంద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.
రెండాకుల గుర్తు చేజారిన త‌ర్వాత త‌న వెంట ఉన్న ఎమ్మెల్యేలు నిరాశ‌కు గురి కాకుండా ఉండేందుకు వీలుగా చిన్న‌మ్మ పావులు క‌దుపుతున్నారు. అన్నాడీఎంకే పార్టీ ఓపీఎస్‌.. ఈపీఎస్ వ‌ర్గానిదేన‌న్న విష‌యాన్ని ఈసీ తాజాగా తేల్చేసిన నేప‌థ్యంలో కొత్త పార్టీ ఏర్పాటు దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయ‌ని చెబుతున్నారు. చిన్న‌మ్మ‌.. ఆమె బ్యాచ్ ను పార్టీ నుంచి బ‌హిష్క‌రిస్తూ ప‌ళ‌ని.. ప‌న్నీర్ లు తీసుకున్న నిర్ణ‌యం చెల్లుబాటు అయ్యే ప‌రిస్థితి నెల‌కొంది.

తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామాలు చిన్న‌మ్మ చిన్న‌బోయేలా చేశాయి. ఏ పార్టీని త‌న కంటి సైగ‌తో శాసించారో.. ఇప్పుడా పార్టీకి తాను ఏమీ కాకుండా పోవ‌టాన్ని ఆమె స‌హించ‌లేకపోతున్న‌ట్లుగా చెబుతున్నారు.

త‌న‌కు బంధువైన దిన‌క‌రన్ సాయంతో కొత్త పార్టీని ఏర్పాటు చేయాల‌ని చిన్న‌మ్మ భావిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇందుకు త‌గ్గ‌ట్లే దిన‌క‌ర‌న్ తాజా వ్యాఖ్య‌లు కొత్త పార్టీ ఖాయ‌మ‌ని చెబుతున్నారు. జైల్లో ఉన్న చిన్న‌మ్మ‌తో భేటీ అయ్యాక కొత్త పార్టీని దిన‌క‌ర‌న్ ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.

అమ్మ మ‌ర‌ణం నేప‌థ్యంలో ఆర్కే న‌గ‌ర్ ఉప ఎన్నికను వ‌చ్చే నెల (డిసెంబ‌రు) 21న నిర్వ‌హిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించ‌టంతో.. ఆ ఎన్నిక‌ల బ‌రిలో త‌మ పార్టీ ఉండేలా ప్లాన్ చేస్తున్న‌ట్లు చెబుతున్నారు. ఆర్కే న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల బ‌రిలో నిల‌వ‌ని ప‌క్షంలో ఇప్ప‌టికే త‌మ వ‌ద్ద ఉన్న 15 మంది ఎమ్మెల్యేలు చేజారిపోతార‌ని చెబుతున్నారు. అందుకు యుద్ధ‌ప్రాతిప‌దిక‌న కొత్త పార్టీ ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ఉప ఎన్నిక నాటికి కొత్త పార్టీ ప్ర‌క‌ట‌న‌.. దాని నిర్మాణం సాధ్య‌మ‌వుతుందా? ఒక‌వేళ పార్టీ పెట్టినా దానికి ఎన్నిక‌ల సంఘం నుంచి అనుమ‌తి వ‌స్తుందా? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది.

ఉప ఎన్నిక‌కు స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో స్వ‌తంత్ర‌ అభ్య‌ర్థిగా ఆర్కే న‌గ‌ర్ బ‌రిలోకి దిగితే భారీ న‌ష్టం ఖాయ‌మ‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తున్న నేప‌థ్యంలో కొత్త పార్టీ దిశ‌గా అడుగులు వేయ‌టం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఆర్కే న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో దిన‌క‌ర‌న్ నిలుస్తార‌ని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. త‌మ చేతికి వ‌చ్చిన రెండాకుల్ని త‌మ వ‌ద్దే ఉండేలా మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు ప‌న్నీర్ సెల్వం.

తాజాగా సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన ఆయ‌న‌.. రెండాకులు గుర్తు త‌మ‌కే చెందుతుందంటూ ఎన్నిక‌ల సంఘం తీసుకున్న నిర్ణ‌యాన్ని ఎవ‌రైనా స‌వాలు విసిరితే.. త‌మ వాద‌న‌ల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న త‌ర్వాత‌నే కోర్టు నిర్ణ‌యం తీసుకోవాలని కోరుతూ ఒక పిటిష‌న్ ను దాఖ‌లు చేశారు. ఉప ఎన్నిక వేళ‌..అనూహ్య నిర్ణ‌యాల‌కు అవ‌కాశం ఇవ్వ‌ని రీతిలో ప‌న్నీర్ ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్లుగా చెప్పాలి.