Begin typing your search above and press return to search.

ఏపీ రోడ్లపై చినజీయర్ మామూలుగా వేయలేదుగా?

By:  Tupaki Desk   |   19 May 2022 1:31 AM GMT
ఏపీ రోడ్లపై చినజీయర్ మామూలుగా వేయలేదుగా?
X
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల పాలనలో ఆయన్ను అత్యధికంగా డ్యామేజ్ చేసిన అంశం ఏదైనా ఉందంటే అది ఏపీలోని రహదారులేనని చెప్పాలి. రోడ్లు దారుణంగా తయారు కావటం.. రోడ్ల మీద పడిన గుంతలతో.. ఏపీ రోడ్ల మీద వాహనాలు నడపాలంటే వాహనదారులు వణికిపోయే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏపీ రోడ్ల మీద పడిన పంచ్ లు.. తయారైన మీమ్స్ తో ఎంతలా పాపులర్ అయి.. జగన్ సర్కారు ఇమేజ్ ను దారుణంగా డ్యామేజ్ చేసిందో తెలిసిందే. తాజాగా అధ్యాత్మిక గురువు.. త్రిదండి చినజీయర్ స్వామి ఆ జాబితాలో చేశారు.

తాజాగా ఆయన ఏపీకి వెళ్లారు. ఈ సందర్భంగా రోడ్ల మీద ఆయన ప్రయాణించాల్సి వచ్చింది. ఈ సందర్భంగా తనకు ఎదురైన అనుభవాన్ని ఆయన ఎంతకూ మర్చిపోలేకపోతున్నారు. ఈ కారణంతోనే ఆయన.. తన భక్తులను ఉద్దేశించి ప్రసంగించిన సందర్భంలోనూ రోడ్ల మీద ఆయన వ్యాఖ్యలు చేయకుండా ఉండలేకపోయారు. తనదైన శైలిలో రోడ్ల మీద గుంతల్ని ప్రస్తావిస్తూ.. చురకలు వేశారు.

తూర్పు గోదావరి పర్యటనలో భాగంగా ఆయన జంగారెడ్డి గూడెం నుంచి రాజమహేంద్రవరం వరకు వాహనంలో ప్రయాణించారు. అనంతరం ఆయన భక్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "ప్రయాణం చేసేటప్పుడు ఒడిదొడుకులు ఉండొచ్చు. ఒక్కోసారి గోతులు ఎక్కువ ఉండొచ్చు. మేం జంగారెడ్డి గూడెం నుంచి రాజమహేంద్రవరం వరకూ రావటానికి చాలానే ప్రయాణం చేశాం. చాలా బాగుంది. చక్కగా గుర్తు పెట్టుకునేలా ఉంది' అంటూ తనదైన శైలిలో వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.

చినజీయర్ టైమింగ్ వ్యాఖ్యలపై సభికులు ఒక్కసారిగా నవ్వేశారు. ఏపీలోని రోడ్ల దుస్థితి ఎలా ఉందనటానికి తాజాగా చినజీయర్ చేసిన వ్యాఖ్యలు నిలువెత్తు నిదర్శనంగా చెప్పక తప్పదు. రోడ్ల దుస్థితిలో మార్పు వచ్చిందని.. పెద్ద ఎత్తున రోడ్లను రిపేర్లు చేసినట్లుగా చెబుతున్నారు.

మొన్నటికి మొన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి కేసీఆర్ సైతం ఏపీ రోడ్ల మీద వ్యాఖ్యానించటం.. దానికి స్పందించిన సినీ నటి కమ్ ఫైర్ బ్రాండ్ మంత్రి రోజా మాట్లాడుతూ.. పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న తాను.. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఏపీకి వస్తే.. ఆయన్నురాష్ట్రం మొత్తం తిప్పుతానని.. రోడ్ల మీద గోతులపై ఆయన చేసిన వ్యాఖ్యలు తప్పుగా తేల్చారు.

కేటీఆర్ కు అయితే ఆయన స్నేహితుడు చెప్పారన్నారు. కాబట్టి.. దానిలో ఎంతవరకు నిజమన్నది ప్రశ్నే. కానీ.. చినజీయర్ స్వామి స్వీయనుభవంతో వ్యాఖ్యలు చేశారు. మరి.. దీనికి మంత్రి రోజా ఎలా రియాక్టు అవుతారో? ఏమైనా చినజీయర్ వారి వ్యాఖ్యలు ఏపీ సర్కారును ఇరాకటంలో పడేస్తాయని చెప్పక తప్పదు.