Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ వ‌లే ముద్ర‌గ‌డ‌ను చూడ‌లేమంటున్న మంత్రి

By:  Tupaki Desk   |   14 Feb 2017 7:33 AM GMT
జ‌గ‌న్ వ‌లే ముద్ర‌గ‌డ‌ను చూడ‌లేమంటున్న మంత్రి
X
కాపు రిజ‌ర్వేస‌న్ల‌ ఉద్య‌మ‌నేత ముద్రగడ పద్మనాభం - ఏపీ ప్ర‌భుత్వానికి మ‌ధ్య న‌డుస్తున్న ఆస‌క్తిక‌ర‌మైన పోటీలో మ‌రో అంశం తెర‌మీద‌కు వచ్చింది. ఈనెల 26 కర్నూలులో ముద్ర‌గ‌డ‌ చేపట్టదలచిన దీక్ష నేప‌థ్యంలో ఏపీ ఉప ముఖ్య‌మంత్రి, హోం మంత్రి నిమ్మ‌కాయల‌ చిన రాజప్ప మీడియాతో మాట్లాడారు. ముద్ర‌గ‌డ దీక్ష‌కు ఎటువంటి అనుమతులూ లేవని, దీక్ష నిర్వహించాలంటే పోలీస్‌ శాఖ అనుమతులు తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు. ఆధునికీకరించిన కృష్ణా జిల్లా జైలు - జైళ్ల శాఖ డిజి కార్యాలయాలను పారంభించిన సందర్భంగా చినరాజప్ప మీడియాతో మాట్లాడారు. శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన జరిగి అభివృద్ధి సాధ్యపడుతుందని తెలిపారు. ముద్రగడ దీక్షయినా మరే ఇతర కార్యక్రమాలైనా ప్రజలకు ఇబ్బంది లేనంత వరకు పోలీసుల అభ్యంతరాలుండవన్నారు. గొడవలు చేస్తూ ఇబ్బందులు కలిగిస్తుంటే చూస్తూ ఊరుకోమని హోం మంత్రి హెచ్చరించారు. ముద్రగడ తన దీక్షకు అనుమతి కావాలని దరఖాస్తు చేస్తే నిబంధనల ప్రకారం పరిశీలించి అనుమతులు ఇస్తామన్నారు. అయితే అనుమతుల కోసం ముద్రగడ అడగనే అడగరని చెప్పారు.

ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల ర్యాలీలను ప్రభుత్వం అడ్డుకుంటున్నదన్న ఆరోపణలను హోం మంత్రి చిన‌రాజ‌ప్ప‌ ఖండించారు. ప్రతిపక్ష నేత జగన్‌ ఎన్ని కార్యక్రమాలు చేపట్టడం లేదని, అవన్నీ తాము అడ్డుకుంటున్నామా అని ప్రశ్నించారు. ముద్ర‌గ‌డ విష‌యంలోనూ అదే నియ‌మం వ‌ర్తిస్తుంద‌ని తెలిపారు. రిపబ్లిక్‌ డే - సీఐఐ సదస్సు నిర్వహించే రోజుల్లో ఉద్దేశపూర్వకంగా యువతను రెచ్చగొడితేనే ప్రభుత్వం అడ్డుకుందని తెలిపారు. కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలు ఎన్నో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా యని, వాటిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వాటిని మాత్రమే పోలీసులు అడ్డుకుంటారని స్పష్టం చేశారు. వైసీపీ ఎమ్మెల్యే రోజాను ఎయిర్‌పోర్టులోనే పోలీసులు నిర్బంధించడాన్ని హోం మంత్రి సమర్థించుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో మహిళా ప్రతినిధులతో పార్లమెంటేరి యన్ల సదస్సు సాగుతుంటే అక్కడ గందరగోళం సృష్టిస్తుందనే కారణంతోనే రోజాను ఆపారని, అదే కార్యక్రమంలో వైసీపీకి చెందిన కొందరు మహిళా నేతలూ పాల్గొన్నారని చిన‌రాజ‌ప్ప‌ గుర్తు చేశారు.

ఇదిలాఉండ‌గా...జైల్ల‌ల్లో సంస్కరణలు అమలు చేసి ఖైదీల్లో పరివర్తన తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని చిన రాజప్ప పేర్కొన్నారు. రూ.1.50 కోట్లతో ఆధునీకరించిన విజయవాడలోని కృష్ణా జిల్లా సబ్‌ జైలుతో పాటు విజయవాడ గులాబి తోటలోని జైళ్ల విభాగం డైరక్టర్‌ జనరల్‌ కార్యాలయాన్ని ప్రారంభించి, ఖైదీలను ఉద్దేశించి మాట్లాడారు. క్షణికావేశంలో నేరాలు చేసి జైళ్లకు వచ్చిన వారు శిక్షాకాలం పూర్తయిన తరువాత సమాజంలో గౌరవంగా జీవించాలని సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చినరాజప్ప రాష్ట్రంలోని అన్ని జైళ్లను ఆధునీకరిస్తామని చెప్పారు. అన్ని నియోజకవర్గాల్లో అగ్ని మాపక కేంద్రాలను ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో ఏటా జరుగుతున్న సుమారు 50 లాకప్‌ మరణాలను నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో నాలుగు సెంట్రల్‌ జైళ్లు - 80 సబ్‌ జైళ్లు - ఒక ఓపెన్‌ జైలు ఉందని వీటిని సంస్కరణ కేంద్రాలుగా మారుస్తామని తెలిపారు. ఖైదీల శిక్షణా కాలంలో వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చి సమాజంలో గౌరవంగా జీవించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తాను ధరించిన దుస్తులూ ఖైదీలు తయారు చేసినవేన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/