Begin typing your search above and press return to search.

డిప్యూటీ సీఎం సాక్షిగా ఎమ్మెల్యేల హెచ్చ‌రిక‌లు

By:  Tupaki Desk   |   17 Sep 2016 4:08 PM GMT
డిప్యూటీ సీఎం సాక్షిగా ఎమ్మెల్యేల హెచ్చ‌రిక‌లు
X
ఆంద్ర‌ప్రదేశ్‌ లో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే కార్పొరేషన్‌ ఎన్నికలు రాజ‌కీయ పార్టీలు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో స‌హ‌జంగానే అధికార తెలుగుదేశం పార్టీ త‌న‌దైన శైలిలో శ్రేణుల‌ను స‌న్న‌ద్ధం చేస్తోంది. అయితే గుంటూరులోని రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో జిల్లా ఇన్‌ ఛార్జి - ఉప ముఖ్య‌మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ముఖ్య అతిథిగా జ‌రిగి అర్బన్‌ పార్టీ సమావేశం హెచ్చ‌రిక‌ల‌కు వేదిక‌గా మారింది. చిన‌రాజ‌ప్ప మాట్లాడుతూ క్ర‌మ‌శిక్ష‌ణ గురించి చెప్పిన‌ప్ప‌టికీ అనంత‌రం మాట్లాడిన ఎమ్మెల్యేలు ఆయ‌న సాక్షిగానే పార్టీకి అల్టిమేటం ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

రాబోయే కార్పొరేషన్‌ ఎన్నికలకు సన్నాహకంగా గుంటూరులో జరిగిన మొట్టమొదటి సమావేశంలో చినరాజప్ప మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఇప్పటి నుంచే కసరత్తు జరగాలని సూచించారు. అన్ని డివిజన్లలో సమావేశాలు నిర్వహించి కార్యకర్తలు, ప్రజల అభిప్రాయ సేకరించాలన్నారు. ప్రతి డివిజన్‌ లో నెగ్గి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. "నెగ్గేవారికే సీట్లు ఇవ్వాలి.. ఓడిపోయే వారిని పక్కన పెట్టండి.. కష్టపడి పనిచేసే వారిని గుర్తించి వారికి సరైన బాధ్యతలు అప్పగించాలి.. నిరంతరం ప్రజల్లో ఉంటూ సేవ చేసే వారికే సీట్లు ఇవ్వాలి" అని పార్టీ నేతలు, నాయకులకు ఉద్బోధ చేశారు. అభివృద్ధి నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని చిన‌రాజ‌ప్ప‌ హితవు పలికారు. ఒక్కో ఎమ్మెల్యేకు అయిదేసి డివిజన్ల వంతున కేటాయిస్తామని, వాటిని గెలిపించాల్సిన బాధ్యత వారు తీసుకోవాలని ఆయ‌న స్ప‌ష్టంచేవారు. అనంత‌రం జిల్లా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ అన్ని డివిజన్లలో గెలుపు ఏకపక్షం కావాల‌ని అవినీతి వైకాపాకు ఒక్క సీటు కూడా దక్కకూడదని చెప్పారు. నవంబర్‌ చివరి వారం లేదంటే డిసెంబర్‌ మొదటి వారంలో కార్పొరేషన్‌ ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. మరో దఫా ఓటర్ల నమోదు ప్రక్రియ జరుగుతుందని, ఆ తర్వాత డివిజన్ల పునర్విభజన చేస్తామన్నారు. అందరికీ పదవులు ఇవ్వడం కుదురదని, అర్హత - సీనియారిటీ - సమర్థతను బట్టి వస్తాయన్నారు. మార్కెట్‌ కమిటీలకు పాలకవర్గాలు పూర్తిచేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడో చెప్పారని, స్థానిక నాయకత్వాల వల్లే జాప్యం జరుగుతుందని ప్ర‌తిపాటి కార్య‌క‌ర్త‌ల‌కు స‌ర్దిచెప్పే ప్ర‌య‌త్నం చేశారు.

గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ తన నియోజకవర్గంలో ఎవరి పెత్తనాన్ని ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. అలాగైతేనే గెలుపు బాధ్యత తాను తీసుకుంటానని తెగేసి చెప్పారు. గెలిపించలేని పక్షంలో రాజీనామా చేసి ఇంట్లో కూర్చుంటాన‌ని స‌వాల్ విసిరారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించిన వారిని కార్పొరేటర్లు - మేయర్‌ గా గెలిపించాల్సిన బాధ్యత ఉందని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఖర్చును పార్టీనే భరించి కష్టపడి పనిచేసిన పేదవారిని కార్పొరేటర్లుగా చేయాలని కోరారు. అధికారులు ఎమ్మెల్యేల మాట వినేలా చూడాలని చెప్పారు. తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ పార్టీకి వ్యతిరేకంగా మంత్రులు - ఎమ్మెల్యేలు - నాయకులు - కార్యకర్తలు ఎవరు మాట్లాడినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. టీడీపీ అంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, పదవులు రాలేదని పార్టీపై నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు. మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత డాక్టర్‌ మాకినేని పెదరత్తయ్య సైతం ఇదే అభిప్రాయం వ్య‌క్తం చేశారు. మంచి వారందరికీ సీట్లు ఇవ్వలేకపోవచ్చు...అయితే సీట్లు ఇచ్చిన వారందరూ మంచివారై ఉండాలన్నారు. నాయకత్వంలో కూడా లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దుకుని ముందుకు సాగాలన్నారు. ఇలా సాక్షాత్తు రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి స‌మ‌క్షంలోనే ఈ ర‌కంగా పార్టీ తీరుపై విమ‌ర్శ‌లు చేయ‌డంఆస‌క్తిక‌రంగా మారింది.