Begin typing your search above and press return to search.

రెండు రాష్ట్రాల్లోనూ చినజీయర్ ఆధ్యాత్మిక యాత్ర

By:  Tupaki Desk   |   1 Jan 2016 11:34 AM GMT
రెండు రాష్ట్రాల్లోనూ చినజీయర్ ఆధ్యాత్మిక యాత్ర
X
ఆధ్యాత్మికవాదులకు ప్రాంతాలు అడ్డుగా ఉండవని చెబుతారు. చినజీయర్ విషయంలో ఇది పక్కాగా రుజువవుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడగా ఉంటున్న ఆయన తెలంగాణలోనూ అటు ఆంధ్రప్రదేశ్ లో ఆధ్యాత్మికత విస్తరణకు పావులు కదుపుతున్నారు.

హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ లో చినజీయర్ కు ఇప్పటికే ఒక ఆశ్రమం ఉంది. అందులో 216 అడుగుల ఎత్తయిన భారీ పెద జీయర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చిన జీయర్ సంకల్పించారు. దీనికితోడు ఈ ప్రాంతాన్ని ఒక ప్రత్యేక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని కూడా భావిస్తున్నారు.

ఇక, నవ్యాంధ్ర రాజధాని ముఖ ద్వారం విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి అతి సమీపంలో సీతానగరంలో చిన జీయర్ ఆశ్రమం ఉంది. ఇక్కడి విజయ కీలాద్రి పర్వతాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలని చిన జీయర్ సంకల్పించారు. ఈ కొండపై పలు ఆలయాల నిర్మాణానికి చిన జీయర్ శంకుస్థాపన కూడా చేశారు. వాస్తవానికి కొండపై వెంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించడానికి ప్రయత్నించి అనివార్య కారణాలతో దానిని విరమించుకున్నారు. అప్పట్లో ఏర్పాటు చేసిన మెట్ల మార్గాన్ని మరింత అభివృద్ధి చేసి సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల ఘాట్ రోడ్డును ఇప్పుడు నిర్మిస్తున్నారు. కొండపై ఉన్న ప్రాంతాన్ని చదును చేసేందుకు ప్రయత్నించగా పురాతన విగ్రహాలు, నీటి కుంటలు బయటపడ్డాయి. శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎక్కతున్నట్లు ఉన్న విగ్రహం, వెంకటేశ్వరస్వామి విగ్రహంగా వాటిని గుర్తించారు. కొండ శిఖరాగ్రంలో నలుమూలలకూ కనిపించేలా వెంకటేశ్వరస్వామి శంఖు చక్రాలను ఏర్పాటు చేశారు. అంతేనా.. ఇంద్రకీలాద్రి పర్వతానికి అభిముఖంగా ఉండేలా విజయ కీలాద్రిపై 108 అడుగుల ఎత్తయిన రామానుజ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి చిన జీయర్ పావులు కదుపుతున్నారు.