Begin typing your search above and press return to search.

కేసీఆర్‌తో విబేధాలు... చిన్న జీయ‌ర్ క్లారిటీ

By:  Tupaki Desk   |   18 Feb 2022 2:30 PM GMT
కేసీఆర్‌తో విబేధాలు... చిన్న జీయ‌ర్ క్లారిటీ
X
స‌మ‌తామూర్తి విగ్ర‌హావిష్క‌ర‌ణ సంద‌ర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు త్రిదండి చినజీయర్ స్వామికి మ‌ధ్య విబేధాలు త‌లెత్తిన‌ట్లు వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. స‌మ‌తామూర్తికి సంబంధించిన వివిధ‌ కార్య‌క్ర‌మాల‌కు సీఎం కేసీఆర్ హాజ‌రు కాక‌పోవ‌డం వెనుక ఈ విబేధాలే కార‌ణ‌మంటూ ప్ర‌చారం జ‌రుగుతుండ‌టంపై తాజాగా త్రిదండి చినజీయర్ స్వామి క్లారిటీ ఇచ్చారు.

తాజాగా నిర్వహించిన విలేక‌రుల స‌మావేశంలో సీఎం కేసీఆర్ తో తనకు విభేదాలున్నాయన్న వార్తలు అవాస్త‌వ‌మ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రితో స‌ఖ్య‌త ఉంద‌ని స్పష్టం చేశారు .

ప్రతిపక్షాలు, అధికార పక్షాలు అంతా త‌మ‌కు సమానమేన‌ని త్రిదండి చినజీయర్ స్వామి తెలిపారు. తాము అందరినీ ఆహ్వానించామని వివ‌రించారు. ప్రజా సేవలో వుండే ప్రతి వారికి సమతా స్ఫూర్తి ఉండాలని సూచించారు. సమతామూర్తి ఉత్సవాలకు సీఎం కేసీఆర్ సహకారం పూర్తిగా ఉంది అని చినజీయ‌ర్ స్వామి వివ‌రించారు.

``సీఎం కేసీఆర్ సహకారం ఉంది కాబట్టే.. అద్భుతంగా కార్యక్రమం చేశాం. ఉత్సవాలకు నీళ్లు, విద్యుత్ వంటి ఎన్నో సౌకర్యాలు కల్పించారు. ముఖ్యమంత్రి తో ఎలాంటి విభేదాలు లేవు.. విభేదాలు సృష్టించడం సరికాదు. ఆరోగ్యం, ఇతర కార్యక్రమాల దృష్ట్యా సహస్రాబ్ది ఉత్సవాలకు సీఎం కేసీఆర్ రాలేకపోయి ఉంటారు`` అని చి జీయర్ స్వామి తెలిపారు.

సమతామూర్తి కేంద్రంలోని 108 ఆలయాల్లో శ‌నివారం కల్యాణ మహోత్సవం జరగునుందని చిన‌జీయ‌ర్ స్వామి వివ‌రించారు. శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు, 108 ఆలయాల ప్రతిష్ఠ కార్యక్రమాలను మీడియా అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్లిందని త్రిదండి చినజీయర్‌ స్వామి అన్నారు.

ఆలయాల్లోకి 108 మూర్తులకు ప్రతిష్ఠ చేసినట్లు చెప్పారు. అయితే అంత మందికి శాంతి కల్యాణం చేయడానికి భారీ ఏర్పాట్లు చేయాల్సి ఉందని.. అందుకే 14వ తేదీన జరగాల్సిన శాంతి కల్యాణం వాయిదా వేయాల్సి వచ్చిందన్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు శాంతి కల్యాణం ప్రారంభం అవుతుందని చెప్పారు.