Begin typing your search above and press return to search.

భార‌త్‌ను పొగిడేసిన చైనా మీడియా

By:  Tupaki Desk   |   4 Aug 2017 4:27 AM GMT
భార‌త్‌ను పొగిడేసిన చైనా మీడియా
X
ఇటీవ‌ల కాలంలో ఎన్ని యాంగిల్స్ కు ఛాన్స్ ఉంటే.. అన్ని యాంగిల్స్ లో తిట్ట‌ట‌మే ప‌నిగా పెట్టుకున్న చైనా అధికారిక మీడియా గ్లోబ‌ల్ టైమ్స్ తాజాగా త‌న స‌హ‌జ వైఖ‌రికి భిన్నంగా వ్య‌వ‌హ‌రించింది. ఇటీవ‌ల కాలంలో భార‌త్‌.. చైనాల మ‌ధ్య నెల‌కొన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో ప్ర‌తి అంశంలోనూ భార‌త్ తీరును త‌ప్పు ప‌ట్టి.. భార‌త్ మీద విషం చిమ్ముతున్న గ్లోబ‌ల్ టైమ్స్ తాజాగా మాత్రం త‌న తీరుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించింది.

గ‌డిచిన కొద్ది రోజులుగా రెండు దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లుకొన‌సాగుతున్న డోక్లాం ఇష్యూ ఒక కొలిక్కి రాకున్నా.. ఉద్రిక్త‌త‌లు కొన‌సాగుతున్నప్ప‌టికీ భార‌త్ ను పొగుడుతూ వ్యాసం రాయ‌టం విశేషం. గ్లోబ‌ల్ టైమ్స్ ప్ర‌చురించిన వ్యాసంలో భార‌త్ లోని ప‌లు సానుకూల‌త‌ల గురించి ప్ర‌స్తావించ‌టం గ‌మ‌నార్హం.

భార‌త్ లో జ‌నాభాతో పాటు పేద‌రికం ఎక్కువ‌గా ఉంటుంద‌ని అనేక‌మంది చైనీయులు భావిస్తుంటార‌ని కానీ.. అందుకు భిన్నంగా అభివృద్ధి అంశాన్ని కూడా గ‌మ‌నించాల‌ని సూచించింది. భార‌త్ లో బిలియ‌నీర్లు పెరుగుతున్న అంశాన్ని త‌న తాజా వ్యాసంలో ప్ర‌స్తావించింది. చైనాలో విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాల్ని త్వ‌ర‌గా తీసుకుంటార‌ని.. భార‌త్ లో మాత్రం ఆల‌స్యం ఉంటుందంది.

భార‌త్ లో యువ పారిశ్రామిక‌వేత్త‌లు వినూత్న ఆవిష్క‌ర‌ణ‌ల‌తో దేశ అభివృద్దికి దోహ‌దం చేస్తున్నార‌ని వివ‌రించింది. భార‌త్ లో ఆర్థికాభివృద్ధి గ‌ణ‌నీయ‌స్థాయికి చేరుకుంద‌ని.. దేశీయ మార్కెట్ లో విస్త‌రించిన అనంత‌రం ప్ర‌పంచ మార్కెట్ పై భార‌త పారిశ్రామిక‌వేత్త‌లు దృష్టి సారిస్తున్నార‌ని స‌ద‌రు వ్యాసంలో పేర్కొన్నారు. భార‌త్ పెట్టుబ‌డుల‌కు అనుకూల‌మ‌న్న విష‌యాన్ని చైనా పెట్టుబ‌డిదారులు తెలుసుకోవాల‌ని క‌థ‌నంలో పేర్కొన‌టం విశేషం. ముందుగా భార‌త్ లో అన్ని అంశాల్ని.. ప‌రిస్థితుల్ని క్షుణ్ణంగా ప‌రిశీలించి పెట్టుబ‌డులు పెట్టొచ్చ‌ని త‌న వ్యాసంలో పేర్కొంది.