Begin typing your search above and press return to search.

మిర్చి తినే కుర్రాడు

By:  Tupaki Desk   |   20 Oct 2015 10:30 PM GMT
మిర్చి తినే కుర్రాడు
X
టిపిన్ ఏం తింటావంటే.. ఇడ్లీ.. దోస‌.. వడ‌.. పూరీ అని సౌత్ వాళ్లు చెబితే.. పూరీ..స‌బ్జీ.. ఆలూరోటీ అని నార్త్ వాళ్లు చెబుతారు. బ్రెడ్ అండ్ జామ్ తినే సుకుమారులు చాలామందే ఉంటారు. కానీ.. చైనాకు చెందిన లీ యోంగ్జి మాత్రం కాస్త భిన్నం. స‌గ‌టు చైనీయుల మాదిరి ఆయ‌న టిపిన్ ఉండ‌ద‌ట‌. ఆ మాట‌కు వ‌స్తే.. భోజనం కానీ.. స్నాక్స్ కూడా ఆయ‌న‌గారివి అంతా ఢిప‌రెంట్‌.

వేడివేడిగా వండి వ‌డ్డిస్తానంటే చిరాగ్గా చూసే ఆయ‌న‌.. ప‌ళ్లెం నిండా మిర‌ప‌కాయ‌ల పొడినో.. లేదంటే మిర‌ప‌కాయ‌ల్నో ఇస్తే అమృతం తిన్న వాడిలా అస్వాదిస్తూ తినేస్తాడ‌ట‌. పొర‌పాటున ఒక మిర‌ప‌కాయ వ‌స్తేనే మంట న‌శాళానికి అంటి గ్లాసుల గ్లాసులు నీళ్లు తాగి.. అప్ప‌టికి మంట త‌గ్గ‌క.. నోట్లో పంచాద‌ర వేసుకుంటే కానీ ఆగ‌ని దానికి అత‌గాడు పూర్తి భిన్నం.

మిర‌ప‌కాయ‌ల్ని ప‌రాప‌రా న‌మిలేసే ఇత‌గాడికి మిర్చి తినే అల‌వాటు ప‌దేళ్ల నుంచి మొద‌లైంది. మిర‌ప‌కాయ‌ల్ని ఇష్టంగా తినేసే ఇత‌గాడు.. గుడ్డు.. మాంసం లాంటి వాటి కంటే ప‌ళ్లెం నిండా మిర‌ప‌కాయ‌లు ఇవ్వొచ్చుగా అన్న‌ట్లు చూస్తుంటాడు. మిర‌ప‌కాయ‌లు.. కార‌ప్పొడిని ఆహారంగా తినే ఇత‌గాడు.. రోజుకు 2.5కేజీల వ‌ర‌కు లాగించే కెపాసిటీ ఉంద‌ని చెబుతున్నారు. మామూలుగా ఫుడ్ తీసుకోమంటేనే ఇన్నెన్ని కిలోలు తిన‌ని వారు.. ఇత‌గాడి గురించి విన్న వెంట‌నే మంట పుట్టి క‌ళ్ల‌ల్లో నుంచి.. నోట్లో నుంచి నీళ్లు కారే ప‌రిస్థితి.

ఇత‌గాడి మిర్చి మీల్స్ అల‌వాటు కార‌ణంగా కావొచ్చు.. ఇంటి వెనుక ఎనిమిది ర‌కాల మిర‌ప‌కాయ‌ల్ని పండిస్తున్నారు. మిగిలిన‌వారు ఎలానో.. ఇత‌గాడు కూడా వేర్వేరు రుచుల్లో ఉండే మిర‌ప‌కాయ‌ల్ని తినేస్తుంటాడ‌ట‌. ప‌దేళ్ల కొడుకు ప్ర‌మాదానికి గురైనప్పుడు తీవ్ర ఒత్తిడికి గురైన ఇత‌గాడు రెండు ప‌ళ్లాల కార‌ప్పొడిని తినేసినా నిక్షేపంగా ఉన్నాడ‌ట‌. ఇత‌ని విచిత్ర‌మైన ఆహార అల‌వాటును చూసిన వైద్యులు ఇత‌నికి అన్ని ర‌కాలైన టెస్ట్ చేసి.. ఇత‌ని ఆరోగ్యంలో ఏలోపం లేద‌ని తేల్చాడు. డాక్ట‌ర్లు కూడా ఇదేమీ త‌ప్పు కాద‌ని చెప్ప‌లేక‌పోవ‌టంతో త‌న మిర్చి మీల్స్ ను కంటిన్యూ చేస్తున్నాడీ చిల్లీ కింగ్‌.