Begin typing your search above and press return to search.

భార‌త్ - పాక్ విష‌యంలో చైనా జోక్యం త‌గ్గ‌లేదు!

By:  Tupaki Desk   |   11 Oct 2016 9:19 PM IST
భార‌త్ - పాక్ విష‌యంలో చైనా జోక్యం త‌గ్గ‌లేదు!
X
వేలు పెట్టను అంటూనే భార‌త్‌-పాక్ వ్య‌వహారాలను చైనా కెలుకుతూనే ఉంది. పాకిస్థాన్ ప‌ట్ల భార‌త్ ఏ వైఖ‌రి అవ‌లంభిస్తే చైనాకి వ‌చ్చిన నొప్పేంటో అర్థం కావ‌డం లేదు! పాకిస్థాన్ తో భార‌త్ అనుస‌రిస్తున్న వైఖ‌రి పైనే చైనాతో భార‌త్ సంబంధాలు ఆధార‌ప‌డ‌తాయ‌ని ప్ర‌క‌ట‌న‌లు చేస్తోంది. త్వ‌ర‌లో గోవాలో బ్రిక్స్ స‌ద‌స్సు జ‌ర‌గ‌బోతోంది. ఈ నేప‌థ్యంలో ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. ఉరీ సెక్టార్ పై పాక్ ప్రేరేపిత దాడుల అనంత‌రం భార‌త్ కొన్ని క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంది. వీటిలో ముఖ్య‌మైన‌ది భార‌త్‌-పాక్ స‌రిహ‌ద్దును రెండేళ్ల‌పాటు మూసేయ‌డం. రెండుదేశాల మ‌ధ్య స‌రిహ‌ద్దు ప్రాంతాన్ని 2018 వ‌ర‌కూ మూసేస్తున్న‌ట్టు ఇటీవ‌లే కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ నిర్ణ‌యంపై చైనా స్పందించింది. స‌రిహ‌ద్దు మూసివేత‌ను త‌ప్పుబ‌డుతోంది!

స‌రిహ‌ద్దును మూసేయ‌డం అహేతుక‌మైన నిర్ణ‌య‌మ‌ని చైనా అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తోంది. షాంఘై అకాడెమిలో ఇన్‌ స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్‌ కు చెందిన హు జియాంగ్ ఈ మేర‌కు కొన్ని వ్యాఖ్య‌లు చేశారు. ఇప్ప‌టికే భార‌త్-పాకిస్థాన్ దేశాల మ‌ధ్య సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్నాయ‌నీ, వాణిజ్య సంబంధాలు కూడా దృఢంగా లేవ‌ని, ఇలాంటి ప‌రిస్థితుల్లో స‌రిహ‌ద్దును మూసేస్తే వాతావ‌ర‌ణం మ‌రింత ఇబ్బందిక‌రంగా మారే అవ‌కాశాలున్నాయని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. ఉరి సెక్టార్ పై దాడి విష‌యంలో కూడా పాకిస్థాన్ కు మ‌ద్ద‌తుగానే ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. భార‌త్ పై ఉగ్ర‌వాదులు చేసిన దాడి వెన‌క పాకిస్థాన్ ఉంద‌న్న గ్యారంటీ ఏంట‌న్నారు. ఆ మేర‌కు స్ప‌ష్ట‌మైన ద‌ర్యాప్తు కూడా ఎక్క‌డా జ‌రిగిన దాఖాలాలు క‌నిపించ‌డం లేద‌ని భార‌త్ వైఖ‌రిని త‌ప్పుబట్టారు.

ఇన్‌ స్టిట్యూట్ ఫర్ సదరన్ అండ్ సెంట్రల్ యేషియన్ స్టడీస్ డైరెక్టర్ వాంగ్ డెహువా కూడా కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. స‌రిహ‌ద్దు మూసేస్తూ ఇండియా తీసుకున్న నిర్ణ‌యం ప‌రోక్షంగా యుద్ధ కాంక్ష క‌నిపిస్తోంద‌ని భావించ‌వ‌చ్చ‌న్నారు. బార్డ‌ర్ క్లోజ్ చేయ‌డం వ‌ల్ల క‌శ్మీర్ స‌మ‌స్య మ‌రింత జ‌ఠిలం అవుతుంద‌న్నారు. క‌శ్మీరు ప్రాంతంలో చాలామంది మ‌నోభావాలు దెబ్బ‌తింటాయ‌న్నారు. చైనాకి పాకిస్థాన్ ఎప్ప‌టికీ వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్య దేశ‌మే అని హూజియాంగ్ అన్నారు. కాబ‌ట్టి, పాకిస్థాన్ విష‌యంలో భార‌తదేశం ఏ నిర్ణ‌య‌మైనా భార‌త్‌, పాక్‌, చైనా సంబంధాల‌పై ప్ర‌భావితం చూపుతుంద‌ని చెప్పారు. క‌శ్మీరు స‌మ‌స్య విష‌యంలో శాంతియుతంగా ప‌రిష్క‌రించుకునేందుకు భార‌త్ చొరవ చూపాలంటూ ఓ స‌ల‌హా కూడా ఇచ్చారు. మొత్తానికి, భార‌త్-పాక్ వ్య‌వ‌హారాల్లో చైనా జోక్యం లేదంటూనే ఇలాంటి స‌ల‌హాలు ఇస్తున్నారు. పాకిస్థాన్ ప‌ట్ల భార‌త్ అనుస‌రిస్తున్న వైఖ‌రిని ప‌రోక్షంగా త‌ప్పుబ‌డుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/