Begin typing your search above and press return to search.

మోడీ సర్కారు దెబ్బకు చైనా కూసాలు కదిలాయి!!

By:  Tupaki Desk   |   10 July 2020 5:25 PM GMT
మోడీ సర్కారు దెబ్బకు చైనా కూసాలు కదిలాయి!!
X
ఈ భూమ్మీద అసలు నమ్మలేని దేశం ఏదైనా ఉందంటే... అది చైనాయే. అత్యంత మోసపూరిత, క్రూర మనస్తత్వపు దేశమది. ఉద్దేశపూర్వకంగా ఇతర దేశపు వనరులపై విధ్వంసపు దాడిచేస్తుంటుంది. ఇటీవల భారత్ పై సామ్రాజ్యవాదాన్ని చూపబోయింది. తన సరిహద్దులోని 15 దేశాలతో కయ్యం పెట్టుకుని, అందరి భూభాగాలను తమలో కలుపుకుని ఉత్తినే కయ్యంపెట్టుకుంటున్న చైనా సరిగ్గా రెండు నెలల క్రితం మా టిక్ టాక్ వాడకుండా ఉండలేరు... మా గురించి మీరు మాట్లాడతారా అని ఓవరాక్షన్ చేసింది.

సరిగ్గా నెల క్రితం గాల్వన్ లో మన భూభాగం పక్కనే చలిమంటలు వేసుకుని కాపుకోవడం మొదలుపెట్టింది. భారత్ ముందు మాట్లాడి చూసింది. తర్వాత హెచ్చరించింది. అయినా గుంటనక్క వంటి ఆ దేశానికి ఎక్కలేదు. మన వాళ్లపై ఆకస్మిక దాడి చేసింది. కట్ చేస్తే... నెల రోజుల్లోపు భారత్ తడాఖా ఏంటో చైనాకు అర్థమైపోయింది. చైనా లేకపోయినా భారత్ ఎలా బతగ్గలదో నిరూపించింది. అంతే కాదు... మన మీదకు వచ్చిన వారి సైనికుల అంతు చూసింది. తేల్చుకుందాం రా అంటూ తొడగొడితే తోకముడిచింది.

ఇపుడు మై డియర్ ఇండియా... యు ఆర్ మై ఫ్రెండ్ అంటోంది. చైనా ఆర్థిక మూలాలపై మోడీ సర్కారు కొట్టిన దెబ్బకు చైనా విలవిల్లాడింది. కాళ్ల బేరాలకు వచ్చింది. భారత్ తమకు మిత్ర దేశమేనని.. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకుంటామని నీతి సూత్రాలు వల్లె వేస్తోంది. భారత్‌లో చైనా రాయబారి సన్ వీడాంగ్ శుక్రవారం దీనిపై వరుస ట్వీట్లు వేశారు.

భారత్-చైనా సంబంధాలను తిరిగి గాడిన పడతాయని, అందుకోసం చర్చలు జరుపతున్నామని వీడాంగ్ పేర్కొన్నారు. అన్నిరకాల ద్వైపాక్షిక సంబంధాలు త్వరలోనే మెరుగు పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నెహ్రూ టైంలో ఇచ్చిన నినాదం హిందీ చీనీ భాయి భాయీ అని మళ్లీ వ్యాఖ్యానించింది. ఇండియా-చైనా చిరకాల మిత్రులని పేర్కొంది. ప్రమాదాలు వద్దు, స్నేహమే ముందు అంటూ ఆయన ఏకంగా ఒక వీడియో విడుల చేశారు. మళ్లీ వివరంగా పది ట్వీట్లేశారు.

ఇండియా, చైనా ఇరుదేశాలు సానుకూల దృక్పథంతోనే ఉన్నాయని... సరిహద్దు ఘర్షణలను తగ్గించాల్సిన అవసరం ఉందని వీడాంగ్ పేర్కొన్నారు. పరస్పర సహకారం ఇరు దేశాలకూ లబ్ధి చేకూరుస్తుందన్నారు. పరస్పర గౌరవం, సహకారం కోసం ఇరు దేశాలు ఓపెన్ గానే ఉన్నాయన్నారు. భారత్, చైనా ద్వైపాక్షిక సంబంధాలు 70వ వసంతంలోకి అడుగు పెడుతున్న తరుణంలో ఇది చాలా అవసరమని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.