Begin typing your search above and press return to search.

చినరాజప్ప తేల్చేశారు...పవన్ బాబూ ఒక్కటేనా... ?

By:  Tupaki Desk   |   10 Dec 2021 3:30 PM GMT
చినరాజప్ప తేల్చేశారు...పవన్ బాబూ ఒక్కటేనా... ?
X
టీడీపీ హయాంలో ఉప ముఖ్యమంత్రిగా చేసిన గోదావరి జిల్లాలకు చెందిన పెద్ద నాయకుడు చిన రాజప్ప. సాధారణంగా ఆయన లోకల్ ఇష్యూస్ మీదనే ఎపుడూ మాట్లాడతారు. అలాంటి చిన రాజప్ప సడెన్ గా అతి పెద్ద ఇష్యూ మీదనే భారీ స్టేట్మెంట్ ఇచ్చేశారు. అది కూడా ఏపీ రాజకీయ సమీకరణలను మొత్తం మార్చబోయే స్టేట్మెంట్. ఎన్నికలకు ముందు జనసేన టీడీపీల మధ్య పొత్తు కుదురుతుందని చిన రాజప్ప చేసిన కామెంట్స్ ఇపుడు ఏపీలో హాట్ హాట్ డిస్కషన్ కి దారి తీస్తున్నాయి.

ఏపీలో టీడీపీ దారి వేరు. ప్రస్తుతానికైతే ఒంటరి పోరాటమే అని చెప్పాలి. సీపీఐ అయితే కలసి వచ్చేలా ఉంది. అంతే తప్ప మరే పార్టీతోనూ అధికారికంగా పొత్తు కానీ స్నేహం కానీ లేదు. ఇంకో వైపు చూసుకుంటే జనసేన బీజేపీల మధ్య రెండేళ్ల క్రితం పొత్తు కుదిరింది. రెండు పార్టీలు కూడా అనేక అంశాల మీద కలసి ప్రయాణం చేస్తున్నాయి. కొన్ని ఇష్యూస్ మీద జనసేన విభేదించినా అదేమీ పొత్తునకు ఆటంకంగా లేదు అనే చెప్పాలి. ఇక వచ్చే ఎన్నికల్లో జనసేన బీజేపీ కూటమి తప్పకుండా అధికారంలోకి వస్తుందని బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు తో సహా ఆ పార్టీ పెద్దలు అంతా పదే పదే ప్రకటిస్తూనే ఉన్నారు. తమ కూటమి పవర్ లోకి వస్తే సీఎం అయ్యేది పవన్ కళ్యాణే అని కూడా తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల వేళ ప్రకటించేశారు కూడా. అంటే ఈ కూటమి తో ఉంటే పవన్ కి సీఎం అయ్యే చాన్సెస్ పూర్తిగా ఉన్నాయి.

మరో వైపు టీడీపీతో జనసేన పొత్తు అంటూ టీడీపీ మాజీ మంత్రులు ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అయితే క్షేత్ర స్థాయిలో అంతా ఓకేగా ఉంది. ఇక పై స్థాయిలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు మాట్లాడుకుంటే సరిపోతుంది అని చెప్పేశారు. ఇపుడు మరో అడుగు ముందుకేసి చిన రాజప్ప ఎన్నికల ముందు జనసేనతో పొత్తు కుదిరే అవకాశాలు ఉన్నాయని చెప్పడం సంచలనంగానే చూడాలి. పవన్ కళ్యాణ్ అయితే ఈ రోజుకీ చంద్రబాబు మీద ఏ విమర్శా చేయడం లేదు. మరో వైపు చంద్రబాబు వైపు నుంచి కూడా పవన్ మీద సాఫ్ట్ కార్నర్ ఉంది. అయితే బీజేపీ పొత్తులో పవన్ ఉన్నారు. బీజేపీ వైఖరి కూడా ఇటీవల కాలంలో మారుతోంది. ఏపీలో వైసీపీనే టార్గెట్ చేస్తోంది.

దాంతో పవన్ తో పాటు బీజేపీ కూడా టీడీపీతో చెలిమి కోరుకుంటాయా లేక పవన్ మాత్రమే ఇటు వైపు వస్తారా అన్న చర్చ అయితే ఉంది. ఇక టీడీపీతో పొత్తు పెట్టుకుంటే పవన్ సీఎం అయ్యే అవకాశాలు పూర్తిగా ఉండవని అంటున్నారు. పవన్ సీఎం కావాలన్నది ఆయన సామాజిక వర్గం కోరికతో పాటు, ఆయనకు ఉన్న అభిమానుల కోరిక కూడా. మరి పవన్ కళ్యాణ్ కూడా తాను సీఎం అయితే ఫలనా చేస్తాను అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. మరి చంద్రబాబుని సీఎం చేసి పవన్ ఏం సాధిస్తారు అన్న ప్రశ్న కూడా వస్తోంది. అయితే దీనికి టీడీపీ మాజీ మంత్రుల వాదన భిన్నంగా ఉంది. ఏపీ భవిష్యత్తు దృష్ట్యా పవన్ తమకు మద్దతు ఇవ్వాలని ఆయన్ని ఇరుకున పెడుతున్నారు. రాష్ట్ర శ్రేయస్సు ఇపుడు ముఖ్యమని, ముఖ్యమంత్రి పదవి కాదని కూడా సుద్దులు చెబుతున్నారు.

మరి ఈ నీతి వచనాలు టీడీపీ ఎందుకు పాటించకూడదు, పవన్ని సీఎం ఎందుకు చేయకూడదు అని సహజంగా అవతల వైపున వచ్చే ప్రశ్న. మరి దానికి టీడీపీ వారి లాజిక్ పాయింట్ అయితే తమది పెద్ద పార్టీ కాబట్టి తామే సీఎం కావాలని. మొత్తానికి పవన్ మద్దతు తీసుకుని మరో సారి అధికారంలోకి రావడానికి టీడీపీ గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. పవన్ 2014 మాదిరిగా అధికారం కోసం మరో పాతికేళ్ల పాటు వేచి ఉంటాను అనుకుంటే కచ్చితంగా ఈ పొత్తు కుదురుతుంది. చూడాలి మరి టీడీపీ మాజీ మంత్రుల కామెంట్స్ కి జనసేన ఎలా రియాక్ట్ అవుతుందో.